వైసీపీలో ఆయ‌న ట్రబుల్ షూట‌ర్!

మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిపై ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మ‌రింత భ‌రోసాగా ఉన్నారు. పెద్దిరెడ్డి అంటే విజ‌య సాధ‌కుడిగా జ‌గ‌న్ విశ్వ‌సిస్తున్నారు. అందుకే ఆయ‌న‌కు కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యంలో అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఇప్ప‌టికే ఆయ‌న…

మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిపై ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మ‌రింత భ‌రోసాగా ఉన్నారు. పెద్దిరెడ్డి అంటే విజ‌య సాధ‌కుడిగా జ‌గ‌న్ విశ్వ‌సిస్తున్నారు. అందుకే ఆయ‌న‌కు కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యంలో అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఇప్ప‌టికే ఆయ‌న అనంత‌పురం, హిందూపురం, చిత్తూరు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల స‌మ‌న్వ‌య‌క‌ర్త‌. తాజాగా తిరుప‌తి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా సీఎం జ‌గ‌న్ నియ‌మించారు.

ఈ నియోమ‌కం వెనుక బ‌ల‌మైన కార‌ణం వుంది. తిరుప‌తి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో సూళ్లూరుపేట‌, స‌త్య‌వేడు, వెంక‌ట‌గిరి, గూడూరు నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ ప‌రిస్థితి బాగా లేదు. ఆ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఖ‌చ్చితంగా గెల‌వాలంటే పార్టీలోని అసంతృప్తుల‌ను బుజ్జ‌గించి, భ‌విష్య‌త్‌లో త‌మ‌కు అండ‌గా నిలుస్తార‌నే న‌మ్మ‌కాన్ని క‌లిగించే నాయ‌క‌త్వం అవ‌స‌రం. అలాంటి నాయకుడు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిగా సీఎం జ‌గ‌న్ భావ‌న‌.

స‌త్య‌వేడులో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం రాజీనామాతో పార్టీలో అయోమ‌య ప‌రిస్థితి నెల‌కుంది. దీంతో ఆ నియోజ‌క‌వ‌ర్గ బాధ్య‌త‌ల్ని మంత్రి పెద్దిరెడ్డికి జ‌గ‌న్ అప్ప‌గించారు. స‌త్య‌వేడు నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా రాజేష్‌ను పెద్దిరెడ్డి తెర‌పైకి తెచ్చారు. ప్ర‌స్తుతం రాజేష్ స‌త్య‌వేడులో క‌లియ‌తిరుగుతున్నారు. ఇటీవ‌ల సూళ్లూరుపేట‌లో కూడా మంత్రి పెద్దిరెడ్డి ప‌ర్య‌టించారు.

ఎమ్మెల్యే సంజీవ‌య్య‌పై అసంతృప్తితో ర‌గిలిపోతున్న నాయ‌కుల వ‌ద్ద‌కు పెద్దిరెడ్డే వెళ్లి స‌ముదాయించే ప్ర‌య‌త్నం చేశారు. అయితే ఇంకా ఒక కొలిక్కి రాలేదు. పెద్దిరెడ్డి భ‌రోసా ఇస్తే, వైసీపీ అసంతృప్త నాయ‌కులంతా తిరిగి పార్టీకి ఎన్నిక‌ల్లో ప‌నిచేసే అవ‌కాశాలున్నాయ‌ని సీఎం జ‌గ‌న్ న‌మ్ముతున్నారు. అందుకే వైసీపీ ప‌రిస్థితి బాగా లేకుంటే, ట్రబుల్ షూట‌ర్‌గా భావించే పెద్దిరెడ్డిని పంపుతున్నార‌ని వైసీపీలో చ‌ర్చ జ‌రుగుతోంది.

ఈ నేప‌థ్యంలోనే తిరుప‌తి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గానికి కూడా పెద్దిరెడ్డిని నియ‌మించార‌ని అంటున్నారు. పెద్దిరెడ్డి నియామ‌కంతో త‌మ గోడు చెప్పుకోడానికి ఓ పెద్ద దిక్కు దొరికింద‌నే భావ‌న వైసీపీ అసంతృప్త నేత‌ల్లో క‌నిపిస్తోంది.