తిట్లు తిన్న పవన్, త్యాగాలకు కూడా సిద్ధమా?

ఉరుమురిమి మంగలం మీద పడడం అంటే ఇదే. ఒక దశవరకు వచ్చిన తర్వాత.. బిజెపితో పొత్తుల విషయంలో ఉంటే ఉండండి.. పోతే పొండి అన్న విధంగా చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్నారా? అనే అనుమానాలు పలువురికి కలుగుతున్నాయి.…

ఉరుమురిమి మంగలం మీద పడడం అంటే ఇదే. ఒక దశవరకు వచ్చిన తర్వాత.. బిజెపితో పొత్తుల విషయంలో ఉంటే ఉండండి.. పోతే పొండి అన్న విధంగా చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్నారా? అనే అనుమానాలు పలువురికి కలుగుతున్నాయి. ఆయన అలా మొండిపట్టు పడుతున్నట్టుగా వస్తున్న వార్తలు నిజమే అయితే గనుక.. పవన్ కల్యాణ్ తన జనసేన పార్టీ తరఫున మరికొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుందనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

తెలుగుదేశంతో పొత్తుకోసం తిట్లు తిన్నానని, ఎన్నెన్నో అవమానాలు భరించానని చెప్పుకున్న పవన్ కల్యాణ్ ఇప్పుడు తన పార్టీ ప్రయోజనాలను కూడా పణంగా పెట్టి మరిన్ని త్యాగాలు కూడా చేయాల్సి ఉంటుందేమోననే అనుమానం ప్రజలకు కలుగుతోంది.

ఇంతకూ విషయం ఏంటంటే.. కొన్ని రోజుల కిందట తెలుగుదేశం- జనసేన కలిసి తమ తొలిజాబితాను ప్రకటించినప్పుడు.. తమ పార్టీకి 24 అసెంబ్లీ సీట్లు మాత్రం తీసుకుంటున్నట్టుగా పవన్ కల్యాణ్ వెల్లడించారు. మరీ అంత తక్కువా అని అందరూ పెదవి విరుస్తుండగా.. గాయత్రీ మంత్రంలో కూడా 24 అక్షరాలే ఉంటాయంటూ తన అజ్ఞానాన్ని కూడా ప్రదర్శించుకున్నారు. కానీ అసలు మర్మం ఇప్పుడు బయటకు వస్తోంది.

ఢిల్లీలో కూర్చుని రెండు రోజుల పాటు మంతనాలు సాగించిన తర్వాత.. చంద్రబాబునాయుడు ఒక్క సంగతి తేల్చి చెప్పేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. జనసేన బిజెపిలకు కలిపి 30 అసెంబ్లీ సీట్లు, 8 పార్లమెంటు సీట్లు మాత్రం ఇవ్వడానికి తాము సిద్ధం అని ఆయన చెప్పేశారు. అక్కడితో ఆయన చేతులు దులిపేసుకున్నట్టుగా తెలుస్తోంది.

అందులో జనసేన ఇప్పటికే 24 అసెంబ్లీ సీట్లు, నాలుగు ఎంపీసీట్లలో తాము పోటీచేయబోతున్నట్టు ప్రకటించుకుంది. అంటే.. భాజపాకు 4 ఎంపీ సీట్లు, 6 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే మిగిలాయి. మరీ ఇంత నీచమైన ఆఫర్ కు బిజెపి ఒప్పుకునే స్థితిలో లేదు.

బిజెపి ఒప్పుకోకపోతే.. కేవలం చంద్రబాబు నాయుడును నమ్మి ఎన్నికలకు వెళ్తే గెలిచేది కష్టమనే భయం పవన్ కల్యాణ్ కు ఉంది. అందుకే ఆయన బహిరంగ సభలో.. తెలుగుదేశంతో పొత్తులకు ఒప్పించడానికి నేను చాలా తిట్లు తిన్నాను, అవమానాలు భరించాను అని బిజెపి గురించి ప్రస్తావిస్తూ చెప్పారు.

ఇప్పుడు ఈ ఆఫర్ కు బిజెపి నో చెబితే.. పవన్ కల్యాణే త్యాగాలు చేయాల్సి ఉంటుంది. 6 అసెంబ్లీ సీట్లకు బిజెపి ఒప్పుకున్నా.. 4 ఎంపీ సీట్లకు అంగీకరించరు. ఇంకా ఒకటో రెండో కావాలని పట్టుపడితే.. పవన్ కల్యాణ్ తన పార్టీ కోసం తీసుకున్న 4 స్థానాల నుంచి ఇవ్వాల్సి వస్తుందని విశ్లేషణలు సాగుతున్నాయి. అందుకే పొత్తులకోసం పవన్ కల్యాణ్ పార్టీని పణంగా పెట్టి త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని పలువురు చర్చించుకుంటున్నారు.