చంద్రబాబుకు డిమాండ్ చేసేంత సీనుందా?

తెలుగుదేశం పార్టీ వర్గాలు, ఆయన అనుకూల పచ్చ మీడియా ఇప్పుడు రెండు రకాల ప్రచారాలకు తెగబడుతున్నాయి. భారతీయ జనతా పార్టీ కాళ్లు పట్టుకుని అయినా సరే.. వారితో పొత్తు కుదుర్చుకోవాలని.. తద్వారా దేశవ్యాప్తంగా పెరిగిన…

తెలుగుదేశం పార్టీ వర్గాలు, ఆయన అనుకూల పచ్చ మీడియా ఇప్పుడు రెండు రకాల ప్రచారాలకు తెగబడుతున్నాయి. భారతీయ జనతా పార్టీ కాళ్లు పట్టుకుని అయినా సరే.. వారితో పొత్తు కుదుర్చుకోవాలని.. తద్వారా దేశవ్యాప్తంగా పెరిగిన మోడీ గ్రాఫ్ ను తన విజయానికి అనుకూలంగా వాడుకోవాలని చంద్రబాబు నాయుడు నానా పాట్లు పడుతున్న సంగతి తెలిసిందే.

అమిత్ షా అపాయింట్మెంట్ ఇస్తే చాలు భగవంతుడా.. పొత్తు కుదిరితే చాలు దేవుడా అన్నట్లుగా ఆయన ఢిల్లీలో కూర్చుని ఎదురుచూపులు చూస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ, పచ్చ మీడియా రెండు రకాల ప్రచారాల ద్వారా చంద్రబాబు పరువు పోకుండా, ఆయన ఫాల్స్ హీరోయిజాన్ని ఎలివేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి.

పొత్తుల కోసం చంద్రబాబు నాయుడు బిజెపిని దేబిరించడం లేదని- వాళ్లంతట వాళ్లే ఆయనతో బంధం ముడిపెట్టుకోవడానికి ఎగబడుతున్నారనేది ఒక ప్రచారం. ఎన్డీయేలో గతంలో ఉన్న అన్ని పార్టీలను కూడా తిరిగి కలుపుకునే ప్రయత్నంలో భాగంగానే చంద్రబాబునాయుడును వారే ఆహ్వానిస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. అంటే బిజెపి ఆహ్వానిస్తే.. పోనీపాపం అని వారి కోరికను మన్నించి.. చంద్రబాబునాయుడు వారితో పొత్తుకోసం చర్చలు జరపడానికి ఢిల్లీ వెళ్లారన్నమాట. ఇలాంటి ప్రచారం ద్వారా అయిదుకోట్ల మంది తెలుగుప్రజల చెవుల్లో గుమ్మడిపూలు పెట్టడానికి పచ్చమీడియా మరియు తెలుగుదేశం వర్గాలు శతవిధాల ప్రయత్నిస్తున్నాయి.

అదే సమయంలో చంద్రబాబునాయుడు దిగజారుడుతనాన్ని తెలుగు ప్రజలు దారుణంగా తిట్టిపోయకుండా తెలుగుదేశం, పచ్చమీడియా కలిసి మరో ఎత్తుగడ ఎత్తాయి. రాష్ట్రప్రయోజనాలను ఆశిస్తూ చంద్రబాబునాయుడు బిజెపి వద్ద కొన్ని డిమాండ్లు పెట్టారట. ఆ డిమాండ్లు అన్నీ తీరిస్తే తప్ప ఆయన పొత్తులకోసం ఒప్పుకోరట. ముందు బిజెపి ఆ డిమాండ్లు ఒప్పుకోవాల్సిందేనట.

ఇంతకూ వీళ్లందరూ కలిసి వండి వారుస్తున్న సదరు చంద్రబాబు డిమాండ్లు ఏమిటో తెలుసా..? విశాఖ ఉక్కు కర్మాగారం ప్రెవేటీకరణ ఆలోచనను కేంద్రప్రభుత్వం వెనక్కు తీసుకోవాలట, వెనుకబడిన జిల్లాలకోసం ప్రకటించే ప్యాకేజీలను ఏపీలోని వెనుకబడిన జిల్లాలకోసం బాగా పెంచాలట, అలాగే అమరావతి రాజధాని నిర్మాణానికి పూర్తిస్థాయిలో సహకరించాలట. ఈ మూడు డిమాండ్లు ఒప్పుకుంటేనే పొత్తులకు సిద్ధం అని చంద్రబాబు అంటున్నారట. ఈ మూడు డిమాండ్లలో అమరావతి మాత్రమే సింగిల్ రాజధానిగా ఉంటుందనే విషయాన్ని ఆల్రెడీ తమ పార్టీ అదికారికంగా ప్రకటించిందని అమిత్ షా చంద్రబాబు ఎదుట ఒప్పుకున్నారట.

ఈ రకంగా అవాకులు చెవాకులు పేర్చి ప్రచారాన్ని సిద్ధం చేస్తున్నారు తెలుగుదేశం, పచ్చమీడియా. బిజెపి ఎదుట సాగిలపడుతున్న చంద్రబాబుకు.. అసలు వారి ఎదుట తన డిమాండ్లు వినిపించేంత సీనుందా? అనేది ప్రజల సందేహం. నిజంగానే ఆయనకు అంత సీనుంటే గనుక ఇక అవీఇవీ ఎందుకు? ఏకంగా ప్రత్యేకహోదా గురించి డిమాండ్ చేసి , తాను చేసిన పాపాన్ని తానే కడిగేసుకోవచ్చు కదా.. అని కూడా ప్రజలు దెప్పిపొడుస్తున్నారు.