చామకూర మల్లారెడ్డి అంటే తెలంగాణ రాజకీయాల్లో తెలియని వారు ఉండరు. బండి పాలక్యాన్లు పెట్టి అమ్ముకుంటూ ప్రారంభించిన జీవితంలో, వందల కోట్ల సంపన్నుడిగా ఎదగడం వరకు ఆయన గురించి ప్రజలకు తెలుసు. పైగా సభా వేదిక ఎక్కి మైకు అందుకున్నారంటే.. ఇక కామెడీ డైలాగులతో నవ్వులు పూయించడం కూడా ఆయనకు అలవాటు.
అవగాహన లేని మాటలు, అజ్ఞానం అనిపించే మాటలను ఏమాత్రం తడుముకోకుండా మాట్లాడేస్తూ.. ఆయన కామెడీచేస్తుంటారు. సవాళ్లు కూడా విసురుతుంటారు. అలాంటి చామకూర మల్లారెడ్డి.. రేవంత్ ప్రభుత్వం ప్రయోగించిన ఒక్క జేసీబీ అస్త్రానికి ఒక్కసారిగా జావకారిపోయినట్టుగా కనిపిస్తోంది. లోక్ సభ ఎన్నికల బరిలో తమ కుటుంబం నుంచి ఎవ్వరూ దిగబోరని ఆయన నిర్ణయించుకోవడం, ఈ నిర్ణయాన్ని భారాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కూడా కలిసి చెప్పేశారు.
మల్లారెడ్డి తెలుగుదేశం పార్టీలో ఎంపీగా గెలవడంతోనే తొలుత తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తరువాత ఆయన భారాసలో చేరి మంత్రి కూడా అయ్యారు. ఆయన భారాస ప్రభుత్వంలో ఉన్న రోజుల్లో రేవంత్ రెడ్డి మీద ఒక రేంజిలో రెచ్చిపోయారు. తొడకొట్టి సవాళ్లు విసిరారు. రేవంత్ ను నానా మాటలూ అన్నారు. తన మీద చేస్తున్న విమర్శలకు తీవ్రమైన ప్రతిసవాళ్లు విసిరారు.
అప్పట్లో తన మీద రేవంత్ చేసిన విమర్శలకు కౌంటర్ గా ప్రెస్ మీట్ పెట్టిమరీ ఓ రేంజిలో బూతులు తిట్టారు. ‘‘రేయ్ సాలే.. రేయ్ గూట్లే.. గాండూ .. రారా తేల్చుకుందాం..’’ అంటూ, కూర్చకున్న వ్యక్తి లేచి తొడకొట్టి మరీ సవాళ్లు విసిరారు. ‘నేనను కాదు, వాడు కబ్జాకోర్, వాడు బట్టేబాజ్’ అంటూ రేవంత్ ను తెగ తిట్టిపోశారు.
సీన్ కట్ చేస్తే.. రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. రేవంత్ ముఖ్యమంత్రి అయ్యారు. పార్లమెంటు ఎన్నికల సీజను కూడా మొదలైంది. రేవంత్ ఖాళీ చేసిన మల్కాజిగిరి పార్లమెంటు స్థానం నుంచి తన కొడుకు భద్రారెడ్డిని గానీ, ఆయన భార్యను గానీ నిలబెట్టడానికి మల్లారెడ్డి ప్రయత్నించారు. నిజానికి భారాస కూడా ఆయన కొడుకుకు టికెట్ ఇవ్వడానికి సుముఖంగానే ఉంది.
ఈలోగా ఆయన అల్లుడుకు చెందిన ఒక ఇంజినీరింగ్ కళాశాల నిర్మణాలు ఆక్రమణలు అంటూ ప్రభుత్వం జెసిబితో పాక్షికంగా కూల్చివేయించింది. దీంతో మల్లారెడ్డికి క్లారిటీ వచ్చేసినట్టుంది. ఆయన ఒక్కసారిగా అనేకమెట్లు దిగివచ్చి.. తాను ఏ రేవంత్ ను అయితే ఎడాపెడా తిట్టిపోశారో.. అదే రేవంత్ యొక్క సలహాదారు వేం నరేందర్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. వారి మధ్య ఏం మంతనాలు నడిచాయో తెలియదు. తాజాగా కేటీఆర్ ను కలిసి తమ కుటుంబం నుంచి ఎంపీగా ఎవ్వరూ పోటీచేయరంటూ దణ్నం పెట్టేసి తప్పుకున్నారు.
రేవంత్ రెడ్డి ఒక్క జేసీబీని ప్రయోగించడంతోటే మల్లారెడ్డికి క్లారిటీ వచ్చేసిందంటూ.. ఇప్పుడు విపరీతంగా ట్రోల్స్ అవుతున్నాయి. రేవంత్ ను ఆయన తిట్టిన తిట్లు, జేసీబీ ఆయన అల్లుడి కాలేజీని కూలుస్తున్న వైనం ఉన్న వీడియోలను కలిపి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.