బీజేపీతో పొత్తుపై చర్చలు కొలిక్కి రాకుండానే ఎల్లో మీడియా ఖరారు చేయడం గమనార్హం. బీజేపీ, జనసేనకు కలిపి 30 అసెంబ్లీ, 8 లోక్‌సభ స్థానాలు ఇచ్చేలా ఆ రెండు పార్టీలతో అవగాహన కుదిరినట్టు టీడీపీ అనుకూల మీడియా రాసుకొచ్చింది. ఆ రెండు పత్రికల్లో ఒకే సమాచారం రావడాన్ని చూస్తే, టీడీపీ పెద్దలు వ్యూహాత్మకంగా రాయించినట్టు అర్థమవుతోంది. మరోవైపు బీజేపీతో పొత్తుపై కొలిక్కి రాలేదనే ప్రచారం జరుగుతోంది.
బీజేపీ 25 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలు అడిగినట్టు సమాచారం. పది అసెంబ్లీ, 5 పార్లమెంట్ స్థానాలు ఇవ్వడానికి చంద్రబాబు సుముఖంగా ఉన్నారని, అంతకు మించి ఇవ్వడానికి ఆయన అంగీకరించలేదనే చర్చ జరుగుతోంది. మరోసారి ఆలోచించుకుని రావాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సూచించి పంపినట్టు బీజేపీ నేతలు తెలిపారు.
ఈ నేపథ్యంలో పొత్తు ఖరారైందని, ఇవాళ ప్రకటించడమే తరువాయంటూ ఎల్లో మీడియా కథనాలు రాయడం చర్చనీయాంశ మైంది. సీట్ల విషయంలో తన పార్టీ కేడర్‌కు సమాచారం పంపడానికి ఈ రకంగా కథనాలు రాయించారనే అభిప్రాయం వ్యక్తమవు తోంది.
ఇప్పటికే జనసేనకు 24 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాలను కేటాయించినట్టు పవన్ సమక్షంలో చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సీట్లపై జనసేన శ్రేణులు ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. ఎల్లో మీడియా రాతల ప్రకారం బీజేపీకి 6 అసెంబ్లీ, 5 లోక్‌సభ స్థానాలను ఇస్తున్నారు. ఇంత తక్కువకు బీజేపీ అగ్ర నాయకత్వం ఒప్పుకుంటుందా? అనే చర్చ లేకపోలేదు. ఏది ఏమైనా బీజేపీ సీట్లపై ఇవాళ స్పష్టత రానుంది.