‘ది గ్రేట్ తెలుగు సీఎం’ కోసం ఓ ఎంపీ సీటు రెడీ!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో మంది మహానుభావులు ముఖ్యమంత్రులుగా సేవలు అందించారు. కానీ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్టచివరి ముఖ్యమంత్రి అనే కితాబు మాత్రం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఖాతా లోనే ఉండిపోయింది. కూలిన…

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో మంది మహానుభావులు ముఖ్యమంత్రులుగా సేవలు అందించారు. కానీ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్టచివరి ముఖ్యమంత్రి అనే కితాబు మాత్రం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఖాతా లోనే ఉండిపోయింది. కూలిన జర్మన్ గోడకు చెందిన ఒక ఇటుకను చూపిస్తూ… రెండు తెలుగు రాష్ట్రాలను మళ్లీ తాను కలుపుతానని భీషణ ఉత్తరకుమార ప్రగల్భాలు పలికిన ఈ మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు ఎంపీ అయి లోక్ సభలో అడుగుపెట్టాలని చూస్తున్నారు. ఆయనను తమ పార్టీ తరఫున ఎంపీ చేయడానికి భారతీయ జనతాపార్టీ, పొత్తుల్లో దక్కబోయే ఒక సీటును రిజర్వు చేసిపెట్టినట్టుగా తెలుస్తోంది.

రాజంపేట నియోజకవర్గం నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీగా పోటీచేస్తారని ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. ఆయన సొంత నియోజకవర్గం పీలేరు కూడా ఈ రాజంపేట పరిధిలోకే వస్తుంది. ఆ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

తెలుగుదేశంతో పొత్తులు కుదురుతున్న సమయంలో భారతీయ జనతా పార్టీ కోరుతున్నట్టుగా వారికి ఏడు సీట్లు దక్కినా, లేదా, తెలుగుదేశం మొండికేస్తున్నట్టుగా నాలుగుసీట్లకే వారిని పరిమితం చేసినా రాజంపేట సీటు మాత్రం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికేనని బిజెపి వర్గాలు తెలియజేస్తున్నాయి.

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా ఉంటూ రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి ఒక చేతగాని ప్రయత్నం చేశారు. ఆ విభజనతో కాంగ్రెసు పార్టీ సమాధి తప్పదని భయపడి, బయటకు వచ్చి చెప్పుగుర్తుతో సొంత పార్టీ పెట్టుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బరిలోకి దిగి దారుణంగా భంగపడ్డారు. అప్పటి నుంచి రాజకీయంగా సైలెంట్ గా ఉండిపోయిన కిరణ్ కుమార్ రెడ్డి కొన్ని నెలల కిందట బిజెపిలో చేరారు. అయినాసరే ఆ పార్టీ ఆయనను పెద్దగా ఆదరించింది లేదు.

పార్టీలో చేరిన సమ‌యంలో.. తనకు ఆంధ్ర, తెలంగాణ రెండూ కూడా సొంత ప్రాంతాలేనని.. పార్టీ ఆదేశాల మేరకు ఎక్కడి నుంచైనా పోటీచేస్తానని చెప్పుకున్న ఈ మాజీ సీఎం.. నిజానికి సొంత ఊర్లో బలం లేక బిజెపి బలంగా ఉండే తెలంగాణ రాజకీయాల్లోనే స్థిరపడాలనుకున్నారు. అయితే, అక్కడి పార్టీ నాయకులు ఈ సీమాంధ్ర నాయకుడి జోక్యాన్ని పడనివ్వలేదు.

అలాగని ఒకటి రెండు పార్టీ సమావేశాలకు హాజరవడం మినహా ఏపీ బిజెపి వ్యవహారాల్లో కూడా కిరణ్ చురుగ్గా వ్యవహరించలేదు. తీరా ఇప్పుడు ఆయన గట్టిగా కోరుతుండడంతో రాజంపేట ఎంపీ నియోజకవర్గం నుంచి పోటీచేయించాలని పార్టీ డిసైడ్ చేసినట్టు తెలుస్తోంది. పొత్తుల ప్రకటన రాగానే.. ఆయన అభ్యర్థిత్వం కూడా ప్రకటిస్తారని చెబుతున్నారు.