భారతీయ జనతా పార్టీతో కూడా పొత్తు కుదుర్చుకోవడానికి తెలుగుదేశం పార్టీ గత ఏడాది కాలంగా ఎంతగా తహతహలాడిపోతున్నదో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఏపీలో పసిపిల్లవాడిని అడిగినా సరే ఆ సంగతి విపులంగా చెబుతారు.
బిజెపితో కూడా పొత్తు కుదిర్చడానికిక తాను ఎన్నో అవమానాలు పడ్డానని, తిట్లు తిన్నానని.. జనసేనాని పవన్ కల్యాణ్ బహిరంగ వేదికల మీద నుంచి పొలికేకలు పెడుతూ చెప్పుకున్నారు. అంటే వీళ్లే ప్రయత్న పూర్వకంగా బిజెపి కోసం ఆరాటపడ్డారని మనకు క్లియర్ గా అర్థమవుతుంది.
కానీ.. పొత్తులు చివరి దశకు వచ్చిన తర్వాత.. ఇక అధికారిక ప్రకటన మాత్రమే వెలువడవలసి ఉన్న సమయంలో.. పచ్చమీడియా చేస్తున్న ప్రచారం మాత్రం భిన్నంగా ఉంది. చంద్రబాబుతో పొత్తు కోసం భారతీయ జనతా పార్టీనే ఆహ్వానం పంపినట్టుగా.. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ఆ ఆహ్వానాన్ని ఉపయోగించుకుని చంద్రబాబునాయుడు చాలా పెద్ద మనసుతో ఆ పొత్తులకు ఒప్పుకున్నట్టుగా ఇప్పుడు ప్రచారం జరుగుతోంది.
పచ్చ మీడియా రాస్తున్న రాతలు ఇంత పచ్చి అబద్దాలుగా ప్రజలకు నవ్వు తెప్పిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరఫున 400కు పైగా సీట్లు సాధించి కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే కృతనిశ్చయంతో ఉన్న మోడీ దళం.. అందుకోసం ఎన్డీయే పాత మిత్రపక్షాలన్నిటినీ ఆహ్వానిస్తున్నదట. అందులో భాగంగానే తెలుగుదేశానికి కూడా ఆహ్వానం అందిందట.
ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలని చంద్రబాబునాయుడు నిర్ణయించారట. జగన్ పాలించిన అయిదేళ్లలో రాష్ట్రం వెనక్కు పోయిందట. అందుకని హఠాత్తుగా ఇప్పుడు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లిపోవడానికి కేంద్రసాయం కూడా అవసరం అనుకుంటూ ఆ ముందుచూపుతోనే వారితో కలిసి పనిచేయడానికి చంద్రబాబు ఒప్పుకున్నారట.
ఈ కామెడీ స్క్రిప్టు మొత్తం పచ్చమీడియా చేస్తున్న ప్రచారం. జగన్ వ్యతిరేక ఓటు చీలితే పుట్టి మునుగుతుందన్న భయంతో.. అందరమూ కలిసి పోటీచేస్తాం అంటూ పవన్ కల్యాణ్ గత ఏడాదిగా గొంతు చించుకుంటున్నారు. పవన్ కల్యాణ్ మీద వన్ సైడ్ లవ్ అంటూ ఆయనను పల్లకీ బోయీగా మార్చుకున్నది చంద్రబాబే. ఆ తర్వాత బిజెపిలోని తన కోవర్టులను, దత్తపుత్రుడిని ఉపయోగించి కమలం పొత్తులకు పావులు కదిపింది చంద్రబాబే. కానీ యిప్పుడు చంద్రబాబు హీరోయిజం చూసి భారతీయ జనతా పార్టీనే ఎగబడి ఆయనకోసం వలచి వచ్చినట్టుగా సొంతడబ్బా ప్రచారం సాగుతోంది.
నితీశ్ కుమార్, నవీన్ పట్నాయక్ వంటి వారితో కూడా ఎన్డీయే ఇప్పుడు పొత్తుబంధాలు కుదుర్చుకుంటూ ఉండడం అనేది ఇలాంటి అవకాశవాద డబ్బా ప్రచారానికి పచ్చమీడియాకు అవకాశం కల్పించింది. దీంతో ఇక వారు.. చంద్రబాబు భజన చేయడంలో రెచ్చిపోతున్నారు.