అమ్మ‌కానికి జ‌న‌సేన టికెట్లు!

జ‌న‌సేన టికెట్ల‌ను వేలానికి పెట్టారా? అంటే… ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. టీడీపీ ద‌య‌త‌ల‌చి ఇచ్చిందే 24 అసెంబ్లీ, 3 లోక్‌స‌భ స్థానాలు. వీటిని కూడా సొంత పార్టీ నేత‌ల‌కు ఇచ్చుకోలేని ద‌య‌నీయ స్థితిలో ప‌వ‌న్‌క‌ల్యాణ్…

జ‌న‌సేన టికెట్ల‌ను వేలానికి పెట్టారా? అంటే… ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. టీడీపీ ద‌య‌త‌ల‌చి ఇచ్చిందే 24 అసెంబ్లీ, 3 లోక్‌స‌భ స్థానాలు. వీటిని కూడా సొంత పార్టీ నేత‌ల‌కు ఇచ్చుకోలేని ద‌య‌నీయ స్థితిలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఉండ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. మ‌రోవైపు జ‌న‌సేన శ్రేణుల‌కు ఆగ్ర‌హం తెప్పిస్తోంది. క‌నీసం జ‌న‌సేన‌లో చేరిన వాళ్ల‌కు టికెట్లు ఇస్తే స‌రిపెట్టుకోవ‌చ్చ‌ని ఆ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు అంటున్నారు.

జ‌న‌సేన టికెట్ల‌ను వేలానికి పెట్టి, ఎవ‌రు ఎక్కువ రేటుకు కొంటే వారే అభ్య‌ర్థి కావ‌డం ఏంట‌నే నిల‌దీత జ‌న‌సేన శ్రేణుల నుంచి వినిపిస్తోంది. ఉదాహ‌ర‌ణ‌గా భీమ‌వ‌రం, తిరుప‌తి సీట్ల గురించి జ‌న‌సేన నాయ‌కులు చెబుతున్నారు. 2019లో భీమ‌వ‌రం నుంచి ప‌వ‌న్‌క‌ల్యాణ్ పోటీ చేశారు. వైసీపీ అభ్య‌ర్థి గ్రంధి శ్రీ‌నివాస్ చేతిలో ఓడిపోయారు. ఈ ద‌ఫా కూడా భీమ‌వ‌రం నుంచే పోటీ చేస్తార‌ని అంతా అనుకున్నారు.

చివ‌రికి భీమ‌వ‌రం నుంచి త‌ప్పుకున్నారు. అలాంట‌ప్పుడు భీమ‌వ‌రంలో పార్టీ కోసం ప‌ని చేసే నాయ‌కుల‌కు అవ‌కాశం క‌ల్పించాలి. ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఏం చేస్తున్నారంటే, టీడీపీ నాయ‌కుడికి టికెట్ ఇస్తూ, త‌న పార్టీ వాడని స‌రిపెట్టుకోవాల‌ని భావిస్తున్నారు. జ‌న‌సేన‌లో భీమ‌వ‌రం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయ‌కుడు పులిప‌ర్తి రామాంజ‌నేయులు ఇంకా చేర‌లేదు. కానీ భీమ‌వ‌రం జ‌న‌సేన నాయ‌కుల‌తో నిర్వ‌హించిన స‌మావేశంలో ఆయ‌న పాల్గొన‌డం గ‌మ‌నార్హం. రెండు మూడు రోజుల్లో జ‌న‌సేన‌లో చేర‌తాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు.

వైసీపీ లేదా మ‌రే ఇత‌ర ప్ర‌తిప‌క్ష పార్టీల నాయ‌కులు జ‌న‌సేన‌లో చేర‌డాన్ని అర్థం చేసుకోవ‌చ్చు. ఎందుకంటే అవి ప్ర‌తిప‌క్ష పార్టీలు కాబ‌ట్టి. మిత్ర‌ప‌క్షమైన టీడీపీ నాయ‌కుల‌ను ఏ విధంగా చేర్చుకుంటారు? ఎలా స‌మ‌ర్థించుకుంటారో ప‌వ‌న్‌క‌ల్యాణ్ స‌మాధానం చెప్పాలి. వైసీపీ నేత‌ల చేరిక సంద‌ర్భంగా, ఆ పార్టీ నియంతృత్వమో, స్వేచ్ఛ లేద‌నో విమ‌ర్శించొచ్చు. టీడీపీ నేత‌ల్నే చేర్చుకోవ‌డాన్ని జ‌న‌సేనాని ఎలా స‌మ‌ర్థించుకుంటార‌నే ప్ర‌శ్న జ‌న‌సేన నేత‌ల నుంచే రావ‌డం విశేషం.

అలాగే తిరుప‌తి సీటును జ‌న‌సేన‌కు కేటాయించారు. ఇక అధికారికంగా ప్ర‌క‌టించ‌డ‌మే త‌రువాయి. ఈ నేప‌థ్యంలో తిరుప‌తి సీటు కోసం అక్క‌డి జ‌న‌సేన నాయ‌కులు ప్ర‌య‌త్నిస్తున్నారంటే అర్థం చేసుకోవ‌చ్చు. అదేంటో గానీ, జ‌న‌సేన టికెట్ కోసం ప‌వ‌న్ చుట్టూ టీడీపీ నాయ‌కులు తిర‌గ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

తిరుప‌తి జ‌న‌సేన సీటు కోసం ఆ పార్టీ నాయ‌కులు ప‌సుపులేటి హ‌రిప్ర‌సాద్‌, కిర‌ణ్ రాయ‌ల్ త‌దిత‌రుల పేర్లు అస‌లు వినిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఆ సీటు కోసం టీడీపీ నాయ‌కులు గంటా న‌ర‌హ‌రి, ఊకా విజ‌య్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే సుగుణ‌మ్మ‌, జేబీ శ్రీ‌నివాసులు త‌దిత‌రులు సీరియ‌స్‌గా ప్ర‌య‌త్నిస్తున్నార‌ని స‌మాచారం. వీళ్లంతా జ‌న‌సేన టికెట్‌ను కొనుగోలు చేసే బ్యాచ్‌గా చెబుతున్నారు. తాజాగా జ‌న‌సేన‌లో చేరిన చిత్తూరు ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీ‌నివాసులు కూడా కొనుగోలు రేస్‌లో తాను కూడా ఉన్నాన‌ని చెబుతున్నారు.

జ‌న‌సేన‌కు సీట్ల కేటాయింపులో డొల్ల‌త‌నం బ‌య‌ట ప‌డింది. రానున్న రోజుల్లో జ‌న‌సేన సీట్ల కేటాయింపు, అభ్య‌ర్థుల ఎంపిక విష‌యానికి వ‌స్తే, ఇంకెన్ని చిత్ర‌విచిత్రాలు చూడాల్సి వ‌స్తుందో అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. జ‌న‌సేన‌కు సీటు కేటాయిస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతున్న చోట‌, టీడీపీ నేత‌లు వ్యూహం మార్చారు. ఎటూ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సీట్ల‌ను వేలానికి పెడుతున్నార‌ని, అదేదో తామే ఆ పార్టీలో చేరి కొంటే స‌రిపోతుంది క‌దా? అని ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. మ‌రోవైపు సీట్ల‌ను ప‌వ‌న్ అమ్ముకుంటున్నార‌నే ప్ర‌చారంపై జ‌న‌సేన శ్రేణులు తీవ్ర ఆవేద‌న‌లో ఉన్నాయి.