కొన్నాళ్లుగా ఓ వ్యక్తితో సీక్రెట్ డేటింగ్ చేస్తోంది మీరా చోప్రా. అతడికి సినిమా రంగంతో ఎలాంటి సంబంధం లేదు. ముంబయిలో బిజినెస్ మేన్. ఈ నెల్లోనే అతడ్ని పెళ్లాడబోతోంది ఈ హీరోయిన్. ఇప్పుడు అతడి సంగతులతో పాటు, పెళ్లి విశేషాలు బయటకొచ్చాయి
మీరా చోప్రా పెళ్లాడబోతున్న వ్యక్తి పేరు రక్షిత్ కేజ్రీవాల్. ఇతడు ముంబయిలో వ్యాపారవేత్త. మూడేళ్లుగా ఇతడితో లవ్ లో ఉంది మీరా చోప్రా. కానీ అతడి విషయాన్ని ఎక్కడా బయటపెట్టలేదు. పెళ్లి సందర్భంగా అతడి డీటెయిల్స్ వెల్లడించింది.
చాలామంది హీరోలు, హీరోయిన్లలా మీరా చోప్రా కూడా ముంబయిలో కాకుండా, రాజస్థాన్ లో పెళ్లి చేసుకోబోతోంది. జైపూర్ లోని బ్యూనా విస్తా లగ్జరీ గార్డెన్ స్పా రిసాప్ట్ లో ఈమె పెళ్లి 2 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనుంది.
ఈనెల 11వ తేదీన మెహందీ ఫంక్షన్ తో మీరా చోప్రా పెళ్లి సంబరాలు షురూ అవుతాయి. అదే రోజు సాయంత్రం సంగీత్, కాక్ టైల్ పార్టీ కూడా ఏర్పాటు చేశారు.
ఇక 12వ తేదీన ఉదయం హల్దీ ఫంక్షన్ తో అసలైన పెళ్లి తంతు మొదలౌతుంది. అదే రోజు సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు మీరా చోప్రా, రక్షిత్ వైవాహిక బంధంలోకి అడుగుపెడతారు.
ఇక అదే రోజు రాత్రి 9 గంటల నుంచి రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. ఇలా 2 రోజుల పాటు అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోబోతోంది మీరా చోప్రా. పెళ్లి కోసం వీళ్లు ఏకంగా రిసార్ట్ మొత్తాన్ని బుక్ చేశారు. ఆహుతులకు తప్ప వేరే వాళ్లకు ఆ 2 రోజుల్లో ప్రవేశం నిషిద్ధం. ఈ పెళ్లికి మీరా చోప్రా కజిన్ ప్రియాంక చోప్రా హాజరుకానుంది.