సీట్లు ఫైనలైజ్ అవుతున్నాయి. బిజెపి పొత్తు సంగతి కూడా దాదాపుగా తేలిపోయినట్టే. ఇక అభ్యర్థులనే తేల్చుకోవాల్సి ఉంది. ఆ కసరత్తు మొదలైపోయింది కూడా. జనసేనకు కేటాయించేసిన సీట్లలో తమ పార్టీకి చెందిన నాయకుల్ని సర్దుబాటు చేసే పనిని కూడా చంద్రబాబునాయుడు దశలవారీగా చేపడుతున్నారు.
ఈక్రమంలో ఒక నియోజకవర్గం లో జరిగిన తాజా పరిణామాలను గమనిస్తే.. అక్కడినుంచి పవన్ కల్యాణ్ పోటీచేస్తున్నారేమో అనే సందేహం కలుగుతోంది. స్థానికంగా ఆ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ఎదురైన సవాలును స్వీకరించడానికి పవన్ సిద్ధపడుతున్నారా? అని కూడా అనిపిస్తోంది.
తిరుపతి ఎమ్మెల్యే నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, నర్సింహయాదవ్ లు తెలుగుదేశం టికెట్ ఆశిస్తున్నారు. అధినేత చంద్రబాబునాయుడు ఆ ఇద్దరు నాయకులను పిలిపించి వారితో ప్రత్యేకంగా మాట్లాడినట్లుగా స్థానికంగా వినిపిస్తోంది.
తిరుపతి నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించేస్తున్నాం అని.. ఈ ఇద్దరు నాయకులు కూడా జనసేన విజయానికి పూర్తిస్థాయిలో పనిచేసి గెలిపించాలని ఆయన చెప్పినట్టుగా సమాచారం. మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని.. అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి తగిన ప్రాధాన్యం కల్పిస్తానని కూడా చంద్రబాబు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. దాంతో తిరుపతి నియోజకవర్గం నుంచి జనసేన పోటీచేయడం అనేది ఖరారు అయినట్టే.
అయితే ఆ పార్టీ తరఫున అక్కడ అభ్యర్థి ఎవరు? ఆల్రెడీ కిరణ్ రాయల్, పసుపులేటి సుధాకర్ వంటి బలిజ నాయకులు తిరుపతి నుంచి ఎమ్మెల్యే పదవిని ఆశిస్తున్నారు. అయితే బలిజ సామాజిక వర్గం తిరుపతిలో మెజారిటీ ఉన్నందున ఇక్కడినుంచి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే అంచనాతో జనసేన ఉంది. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్వయంగా ఇక్కడినుంచి పోటీ చేస్తారని కూడా ఊహాగానాలు సాగుతున్నాయి.
ఇప్పటికే తిరుపతి వైసీపీ అభ్యర్థిగా ప్రకటించబడిన అభినయ్ రెడ్డి.. పవన్ కల్యాణ్ కు ఇటీవల ఒక సవాలు విసిరారు. ధైర్యముంటే పవన్ ఇక్కడి నుంచి పోటీచేయాలని ఆయన అన్నారు. పోటీచేస్తే ఓడించి పంపుతామని ఎద్దేవా చేశారు. మరి తిరుపతిలో తెలుగుదేశం ఆశావహుల్ని చంద్రబాబు సర్దుబాటు చేస్తున్న నేపథ్యంలో.. పవన్ కల్యాణ్ ఇక్కడి నుంచే బరిలోకి దిగుతారా? అనేది వేచిచూడాలి.
ఒకవేళ పవన్ కల్యాణ్ బరిలోకి దిగితే.. తన అన్నయ్య చిరంజీవి, అభినయ్ తండ్రి భూమన కరుణాకర రెడ్డిని ఓడించిన తీరులో ఇప్పుడు తాను కొడుకును ఓడించి ఆ తరహా విజయాన్ని రిపీట్ చేస్తారా? లేదా, అభినయ్ రెడ్డి.. పవన్ ను ఓడించి తన తండ్రి ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటారా అనేది చూడాలి.