తెలంగాణ సాధనకోసం జరిగిన తుదివిడత జేఏసీ ఉద్యమాన్ని సారథిగా ముందుండి నడిపించిన కీలక నాయకుడు ప్రొఫెసర్ కోదండరాంకు చట్టసభల్లో ప్రవేశించే అదృష్టం ఇంకా పూర్తిగా దక్కలేదు. తెలంగాణ రాష్ట్ర సాధనకు కష్టపడిన వారికి పదవి దక్కడం అనేది సరైనదని అనుకుంటే.. ఆయన పేరు ముందు వరుసలోనే ఉంటుంది. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఆయనను పూర్తిగా పక్కన పెట్టారు.
తాజాగా రేవంత్ రెడ్డి సర్కారు ఆయనను ఎమ్మెల్సీగా నియమించింది గానీ.. ఆ ఉత్తర్వులను రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దాంతో ఆయన అభిమానులు మాత్రం.. అయ్యో ప్రొఫెసర్ సాబ్ కు ఆకులో ముద్ద నోటికి అందకుండా పోయిందే అని బాధపడుతున్నారు.
ప్రొఫెసర్ కోదండరాంతో పాటు అమీర్ అలీఖాన్ ను కూడా కలిపి గవర్నరు కోటాలో ఎమ్మెల్సీలుగా నియమిస్తూ రేవంత్ సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది. అయితే వారి పదవికి తొలినుంచి బాలారిష్టాలు ఎదురవుతున్నాయి. వారు ప్రమాణస్వీకారానికి వెళ్లిన సందర్భంలో వారితో ఆ పని చేయించడానికి మండలం ఛైర్మన్ భారాసకు చెందిన గుత్తా సుఖేందర్ రెడ్డి అందుబాటులో లేకుండా పోయారు. ఈలోగా వారి నియామకంపై హైకోర్టులో కేసు దాఖలైంది.
గత భారాస ప్రభుత్వ హయాంలో దాసోజు శ్రవణ్, కుర్రా సత్యానారాయణలను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేశారు. అయితే వీరి నియామకానికి గవర్నరు ఆమోదం తెలియజేయలేదు. వారి నియామకం, ఎంపిక చెల్లదని ఆమె తిప్పి కొట్టారు. అప్పట్లో భారాస ప్రభుత్వానికి , గవర్నరుకు మధ్య ప్రతిష్టంభన నడుస్తున్న నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. దాంతో వారు కోర్టుకు వెళ్లడం జరిగింది. ఇప్పటిదాకా ఆ కేసులో తుదితీర్పు రాలేదు.
అదలా ఉండగానే.. రేవంత్ సర్కారు ఏర్పడిన తర్వాత.. కోదండరాం, అమీర్ ఆలీఖాన్ లను నియమించడమూ, దానికి గవర్నరు ఆమోదం తెలియజేయడమూ కూడా జరిగిపోయింది. దాంతో దాసోజు, కుర్రా హైకోర్టును ఆశ్రయించారు. తమ నియామకానికి పాత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల విషయంలో కోర్టు కేసులో తుదితీర్పు రాకుండా కొత్త నియామకాలు జరగడానికి వీల్లేదని అభ్యంతరం పెట్టారు. కోర్టు వారి అభ్యంతరాన్ని ఆమోదించింది. కోదండరాం ను నియమిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవని ఆదేశాలు ఇచ్చింది.
పాపం కోదండరాం.. తెలంగాణ కోసం ఎంతగా శ్రమించిన నాయకుడు అయినప్పటికీ.. చట్టసభలో అడుగుపెట్టడానికి ఇంకా కొంతకాలం వేచిచూడాల్సి వచ్చేలా ఉంది.