బీజేపీతో టీడీపీ పొత్తు దాదాపు ఖరారైందని అంటున్నారు. పొత్తుపై ఇవాళ స్పష్టత రానుంది. బీజేపీ 10 అసెంబ్లీ, 7 లోక్‌సభ సీట్లు అడుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే టీడీపీ మాత్రం 6 అసెంబ్లీ, 4 లోక్‌సభ సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ఎల్లో మీడియా రాస్తోంది. ఇదే నిజమైన ఆశ్చర్యపోనవసరం లేదు.
జనసేనకు 24, బీజేపీకి 6 సీట్లు కలిపి… మొత్తం 30 సీట్లకు మించి మిత్రపక్షాలకు ఇవ్వకూడదనేది టీడీపీ ఆలోచన. ఇక్కడ టీడీపీ ధైర్యం, వ్యూహం వేరే. బీజేపీకి పేరు ఆరు లేదా ఏడు అసెంబ్లీ, నాలుగైదు ఎంపీ సీట్లు ఇచ్చినా, వాటిలో తన వాళ్లనే పెట్టుకోవచ్చనే గట్టి నమ్మకంతో చంద్రబాబునాయుడు ఉన్నారు.
బీజేపీలో ఉన్న టీడీపీ నాయకులు మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డికి జమ్మలమడుగు, వరదాపురం సూరికి ధర్మవరం, కామినేని శ్రీనివాస్‌కు కైకలూరు, విష్ణుకుమార్‌రాజుకు విశాఖ నార్త్ తప్పక కేటాయిస్తారు. మహా అయితే నిఖార్పైన బీజేపీ నేతలు సోము వీర్రాజు, మాధవ్‌కు టికెట్లు ఇస్తారే గానీ, వారిని పనిగట్టుకుని ఓడిస్తారు.
అలాగే ఎంపీ సీట్ల విషయానికి వస్తే.. సుజనా చౌదరి, సత్యకుమార్, సీఎం రమేశ్‌నాయుడు, దగ్గుబాటి పురందేశ్వరి, టీజీ వెంకటేశ్‌లకు తప్పకుండా ఎంపీ సీట్లు ఇస్తారు. ఎందుకంటే వీళ్లంతా చంద్రబాబు కోసం పనిచేసే బీజేపీ ముసుగులో ఉన్న టీడీపీ నాయకులు. జీవీఎల్ నరసింహారావు, విష్ణువర్ధన్‌రెడ్డి లాంటి ఒకరిద్దరు బీజేపీ నాయకులకు ఒకవేళ ఎక్కడైనా సీట్లు ఇచ్చినా, టీడీపీ నేతలే పట్టుపట్టి ఓడించి తీరుతారు.
బీజేపీతో పొత్తు ఆ విధంగా ముందుకు సాగుతుందనడంలో సందేహం లేదు. పొత్తులో భాగంగా బీజేపీకి ఎన్ని సీట్లు ఇస్తారనేది ముఖ్యం కాదు. ఇచ్చిన సీట్లలో ఎంత మంది టీడీపీ నేతలుంటారనేది చూసుకునే, చంద్రబాబు జాగ్రత్తంగా అడుగులు ముందుకేస్తారు. పేరుకు బీజేపీనే తప్ప, ఆ పార్టీ తరపున నిలబడే నేతల్లో 90 శాతం టీడీపీ నాయకులే అనడంలో ఎలాంటి సందేహం లేదు. తినబోతు రుచి చూడడం ఎందుకు?