కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పవన్‌కల్యాణ్ పోటీ చేస్తారని టీడీపీ నమ్ముతోంది. ఇదే సందర్భంలో పవన్ పోటీ చేస్తే, తమ నాయకుడైన మాజీ ఎమ్మెల్యే వర్మకు టికెట్ దక్కదని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. పిఠాపురం నుంచి పవన్‌కల్యాణ్ పోటీ చేస్తారనే వార్తల నేపథ్యంలో స్థానిక టీడీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే వర్మ దంపతులు హాజరయ్యారు. పిఠాపురం టికెట్ దక్కదనే ఆవేదనలో వర్మ దంపతులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. పిఠాపురంలో పవన్ పోటీపై వర్మకు టీడీపీ అధిష్టానం స్పష్టమైన సంకేతాలు పంపింది. అందుకే టీడీపీ శ్రేణులు ప్రత్యేకంగా సమావేశమై తమ నిరసన ప్రకటించాయి. నిజానికి పవన్‌కల్యాణ్ పోటీపై జనసేన ఇంత వరకూ స్పష్టత ఇవ్వలేదు. దీంతో పలు నియోజకవర్గాలు తెరపైకి వచ్చాయి.
కానీ పిఠాపురం నుంచే పవన్ పోటీ చేస్తారని మాజీ ఎమ్మెల్యే వర్మ చెప్పడం గమనార్హం. తమ నాయకుడికి టికెట్ దక్కదనే ఆగ్రహంతో కార్యాలయం వద్ద శ్రేణులు ఆందోళనకు దిగాయి. టీడీపీ కరపత్రాలు, ప్లెక్సీలను కార్యకర్తలు తగుల బెట్టారు. అలాగే వర్మకు టికెట్ ఇవ్వకపోతే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని టీడీపీ నాయకులు హెచ్చరించారు. ఒకవేళ టికెట్ దక్కకపోతే 2014లో మాదిరిగా స్వతంత్ర అభ్యర్థిగా దిగాలని వర్మపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒత్తిడి తెచ్చారు.
వర్మ మాట్లాడుతూ చంద్రబాబునాయుడు తనకు అన్యాయం చేయరని భావిస్తున్నట్టు చెప్పారు. చంద్రబాబుపై తనకు నమ్మకం వుందన్నారు. టికెట్ తనకే వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.