కల్కి సినిమాకు సంబంధించి యూనిట్ అంతా ఇటలీలో ల్యాండ్ అయింది. అక్కడి అందమైన లొకేషన్లలో ఓ సాంగ్ ప్లాన్ చేశారు. హీరో ప్రభాస్, హీరోయిన్ దిశా పటానీ కాంబినేషన్ లో ఆ సాంగ్ ను తీయబోతున్నారు. దీనికి సంబంధించి ఓ ఆన్ లొకేషన్ ఫొటోను కూడా షేర్ చేసింది యూనిట్.
కల్కి సినిమాకు సంబంధించి విదేశాల్లో ఓ పాట తీయబోతున్నారనే విషయం పాతదే. కాకపోతే ఇప్పుడు కొత్త చర్చ ఏంటంటే.. కల్కి కథకు, ఈ ఇటలీ లొకేషన్లు ఎలా సెట్ అవుతాయి?
భవిష్యత్ కథతో కల్కి సినిమా తెరకెక్కుతోందన్న సంగతి తెలిసిందే. ఇంకా చెప్పాలంటే 2898 సంవత్సరంలో జరిగిన కథగా ఈ సినిమాను చెబుతున్నారు. మరి ఈ కథకు ఇటలీ లొకేషన్ లో తీసే సాంగ్ ఎలా సెట్ అవుతుందనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది.
కల్కి సినిమాకు సంబంధించి ఇప్పటివరకు అంతా సెట్స్ లోనే జరిగింది. 'ఫ్రమ్ ది స్క్రాచ్' అంటూ ప్రతిది కొత్తగా సృష్టించి మరీ షూటింగ్ చేస్తున్నారు. మరి ఇలాంటి ఓ కొత్త ప్రపంచంలో కథ నడుస్తున్నప్పుడు ఇటలీలో తీసిన సాంగ్ సింక్ అవుతుందా అనేది చాలామంది అనుమానం.
అయితే ఈ విషయంలో దర్శకుడు నాగ్ అశ్విన్ ను చాలామంది సమర్థిస్తున్నారు. అంత అనాలోచితంగా దర్శకుడు వ్యవహరించడని, కచ్చితంగా ఏదో లింక్ ఉంటుందని ఊహిస్తున్నారు. అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీని మే 9న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.