జనసేనాని పవన్‌కల్యాణ్‌ను ఈ ఒక్క విషయంలో అభినందించ వచ్చు. ఎట్టకేలకు తిరుపతిలో జనసేనే పోటీ చేయనుంది. చంద్రబాబుతో జరిపిన భేటీలో ఈ మేరకు అవగాహన కుదిరింది. తిరుపతిపై మొదటి నుంచి జనసేన పట్టుదలతో వుంది. ఈ సీటు తమకే కావాలని కోరుకుంటోంది. 2009లో పీఆర్పీ అధినేత , మెగాస్టార్ చిరంజీవి ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందారు. దీంతో తిరుపతిని జనసేన దక్కించుకోకపోతే, పార్టీ ఉండడమే వృథా అనే రీతిలో శ్రేణులు చెబుతూ వచ్చాయి. తిరుపతి సీటు విషయమై పవన్‌పై తీవ్ర ఒత్తిడి ఆ పార్టీ శ్రేణుల నుంచి వస్తున్న సంగతి తెలిసిందే.
బలిజలు ఎక్కువగా వున్నారని, జనసేన పార్టీని ఆ సామాజిక వర్గం ఓన్ చేసుకుంటుందని, అందుకే తమకే కావాలని చంద్రబాబుతో పవన్ పదేపదే చెబుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో తిరుపతిలోనే జనసేనకు ఎక్కువ అవకాశాలున్నాయని గ్రహించిన చంద్రబాబు.. పవన్ ప్రతిపాదనకు ఓకే చెప్పినట్టు తెలిసింది.
తిరుపతిని జనసేనకు కేటాయించిన నేపథ్యంలో టీడీపీ నాయకులైన మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, నరసింహయాదవ్‌ను అధిష్టానం విజయవాడకు రప్పించుకుంటోంది. తిరుపతి సీటును జనసేనకు కేటాయించామని, సహకరించాలని కోరనుంది. తిరుపతిలో జనసేన తరపున చిత్తూరు ఎమ్మెల్యే ఆరిణి శ్రీనివాసులు(లేదా) గంటా నరహరి నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వైసీపీని ఎదుర్కోవాలంటే ఆర్థికంగా బలమైన నాయకులను పోటీలో పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. అందుకే ఆ ఇద్దరు నాయకులపై ఆయన దృష్టి సారించినట్టు తెలిసింది.
ఇదిలా వుండగా జనసేన టికెట్‌ను పసుపులేటి హరిప్రసాద్, కిరణ్ రాయల్ కూడా ఆశిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే టీడీపీ నాయకులు ఇంత కాలం తమకే టికెట్ దక్కుతుందనే ఆశతో జనంలో తిరుగుతూ వచ్చారు. ఇప్పుడు టికెట్ లేదని తెలిసే సరికి ఒక్కసారిగా నీరుగారి పోయారు.