‘కావవే వరద..’: కాళ్లు పట్టుకోడానికి రెడీ!

గజేంద్రమోక్షం లో ఒక పద్యం ఉంటుంది. ‘నీవే తప్ప ఇతః పరం బెరుగ.. కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా..’ అని మొసలికి చిక్కిన ఏనుగు విష్ణమూర్తిని వేడుకుంటుంది. నీవు తప్ప నాకు మరొక దిక్కు…

గజేంద్రమోక్షం లో ఒక పద్యం ఉంటుంది. ‘నీవే తప్ప ఇతః పరం బెరుగ.. కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా..’ అని మొసలికి చిక్కిన ఏనుగు విష్ణమూర్తిని వేడుకుంటుంది. నీవు తప్ప నాకు మరొక దిక్కు లేదు సామీ.. వచ్చి కాపాడు అని అంటుంది. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. ఆయన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ కలిసి చేస్తున్న పని అదే అన్నట్టుగా కనిపిస్తోంది.

భారతీయ జనతా పార్టీ పొత్తులకు ఒప్పుకోకపోతే.. తమకు మరో దిక్కు లేదన్నట్టుగా.. వారిద్దరూ మళ్లీ ఢిల్లీ వెళుతున్నారు. తక్షణం పొత్తు ఉన్నదని చెప్పేయాలని కోరుతూ అవసరమైతే భాజపా అధిష్ఠానం పెద్దల కాళ్లు పట్టుకోవడానికి అయినా సిద్ధపడే వారిద్దరూ ఢిల్లీ బయల్దేరుతున్నట్టుగా తెలుస్తోంది.

భారతీయ జనతా పార్టీలో చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం గురించి అనేక భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం తమ గొయ్యిని తామే తవ్వుకోవడం అవుతుందనే అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది.

ఆ పొత్తు ఆత్మహత్యతో సమానం అని.. ప్రస్తుతం హిందూ సమాజంలో దేశవ్యాప్తంగా మోడీ పట్ల వెల్లువెత్తుతున్న అభిమానాన్ని చంద్రబాబు స్వలాభంకోసం త్యాగం చేయడం అనవసరం అనే అభిప్రాయం పార్టీలో ఉంది. ఈ ఎన్నికల్లో ఏపీలో బిజెపి ఒంటరిగా పోటీచేస్తే గనుక.. రాబోయే ఎన్నికల నాటికి పార్టీ చాలా బలపడుతుందని వారు అంటున్నారు.

ఈ వాదనకు చాలా బలం పెరుగుతుండడంతో భాజపా అధిష్ఠానం కూడా పునరాలోచనలో పడుతోంది. అసలు పొత్తులు వద్దు అనుకుంటున్నట్టుగా ఢిల్లీ వర్గాల సమాచారం. అయితే..  పొత్తులు కావాలంటూ ఎన్డీయే భాగస్వామిగా చెప్పుకునే జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరియు చంద్రబాబు నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉంది. వారి ఒత్తిడులకు అమిత్ షా లొంగడం లేదు.

బిజెపిలోని చంద్రబాబు కోవర్టులుల కూడా పొత్తు అనుకూల నిర్ణయం రావడానికి తమ ప్రయత్నాలు చేస్తున్నారు గానీ.. బిజెపి వారి సలహాలపై అలర్ట్ గానే ఉంది.

అయితే బిజెపి కలిస్తే తప్ప గెలవడం అసాధ్యం అనే భయంతో ఉన్న చంద్రబాబు ఇప్పటికే పలుమార్లు వారితో మంతనాలు సాగించినా ఫలితం లేకపోయే సరికి మరోమారు ఢిల్లీ పయనం అవుతున్నారు. ఈసారి ఇద్దరు నాయకులూ వెళుతున్నారు. కాళ్లు పట్టుకుని అయినా పొత్తు నిర్ణయంతోనే తిరిగి రావాలనే సంకల్పంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆల్రెడీ దగ్గుబాటి పురందేశ్వరి కూడా ఢిల్లీలోనే ఉన్నారు. మొత్తానికి వీరి ప్రయత్నాలు ఏమవుతాయో చూడాలి.