రాజు గారి కోట రాజకీయం!

విజయనగరం పూసపాటి వంశీకుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు తన కుమార్తె అదితి గజపతిరాజుని గెలిపించేందుకు పూర్తి శక్తి సామర్ధ్యాలను ఉపయోగిస్తున్నారు. గతసారి లైట్ తీసుకున్న రాజు గారు ఈసారి మాత్రం ఏ…

విజయనగరం పూసపాటి వంశీకుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు తన కుమార్తె అదితి గజపతిరాజుని గెలిపించేందుకు పూర్తి శక్తి సామర్ధ్యాలను ఉపయోగిస్తున్నారు. గతసారి లైట్ తీసుకున్న రాజు గారు ఈసారి మాత్రం ఏ చిన్న అవకాశాన్ని అసలు పోనీయడంలేదు. వైసీపీని బలం ఉన్న చోట దృష్టి పెట్టి కీలక నేతలను లాగేసే ప్రయత్నం చేస్తున్నారు.

విజయనగరంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి బలంగా ఉన్నారు. ఆయనకు అరుదైన రికార్డు ఉంది. తండ్రీ కూతుళ్లను ఓడించిన ఏకైన లీడర్ గా పొలిటికల్ హిస్టరీలో పేరుంది. దాంతో రెట్టింపు కసితో కోటలో టీడీపీ శిబిరం పనిచేస్తోంది.

ఈసారి తాను పోటీ నుంచి దూరంగా ఉంటూ కుమార్తెను అశోక్ వ్యూహాత్మకంగా బరిలోకి దించారు అని అంటున్నారు. తమ రాజకీయ వారసత్వాన్ని కాపాడుకోవాలంటే అదితి తప్పనిసరిగా గెలవాలి. ఏడు దశాబ్దాల విజయనగరం అసెంబ్లీ చరిత్రలో అత్యధిక కాలం ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు పూసపాటి వారే.

ఆ వంశం నుంచి మూడవతరం రాజకీయానికి గట్టి పునాది వేయాలని చూస్తున్నారు. ఈసారి బీసీకి విజయనగరం టికెట్ ఇవ్వాలని టీడీపీ అధినాయకత్వం భావించినా పట్టుబట్టి అదితి గజపతిరాజుకు సాధించుకున్నారు. అంతే పట్టుదలగా గెలిపించుకోవాలని చూస్తున్నారు.

కోలగట్లకు మరోసారి టికెట్ ఖరారు కావడంతో అవనాపు ఫ్యామిలీ అసంతృప్తిలో ఉందని తెలిసి వారిని కోట నీడకు చేర్చారు. సైకిలెక్కించారు. విజయనగరం కార్పోరేషన్ లో వైసీపీ బలంగా ఉంది. దాంతో కార్పోరేటర్ల మీద గురి పెట్టారు. ఒక వార్డు కార్పోరేటర్ ని కూడా తమ వైపు తిప్పుకున్నారు.

మరింతమంది వైసీపీ నేతల మీద ఫోకస్ పెట్టారు. అయితే దీన్ని వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు. నాయకులను ప్రలోభాలకు గురి చేసి తెచ్చుకున్నా ప్రజలు తమ పక్షమే అంటున్నారు. ప్రజలకు తాము  చేసిన మంచి వైసీపీని గెలిపిస్తుంది అంటున్నారు. కోలగట్ల అయితే తాను అయిదేళ్ళలో చేసిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో విజయనగరం రూపు రేఖలు మార్చామని చెబుతున్నారు. తానే మళ్లీ గెలుస్తాను అని ఆయన అంటున్నారు.