ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల లోగా ముఖయమైన జిల్లాలలో పర్యటిస్తున్నారు. ఆయా జిల్లాలకు వెళ్ళి కీలక ప్రకటనలు చేస్తున్నారు. విజన్ విశాఖ పేరుతో వైజాగ్ లో జరిగిన గ్లోబల్ ఈవెంట్ లో జగన్ విశాఖ నుంచే తాను రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తాను అని ప్రకటించి సంచలనం రేపారు.
అదే హుషార్ లో ప్రకాశం జిల్లా వెళ్ళి అక్కడ 2024 తరువాత ఏర్పడే ప్రభుత్వంలో తొలి మంత్రిగా బాలినేని శ్రీనివాసరావు పేరు ప్రకటించి రాజకీయ ప్రకంపనలు రేపారు. ఈ నెల 7న ముఖ్యమంత్రి అనకాపల్లి జిల్లాకు వస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాకు ఆయన ఒక రోజు వ్యవధిలో రెండవసారి రావడం విశేషంగా చూస్తున్నారు.
ముఖ్యమంత్రి అనకాపల్లి పర్యటనలో రాజకీయ ప్రకటనలు ఉంటాయా అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. అనకాపల్లి రాజకీయం ఇటీవల కాలంలో ఏపీలో వేడెక్కిస్తోంది. జనసేన టీడీపీ కలసి అనకాపల్లి జిల్లాను రాజకీయంగా ఒడిసిపట్టాలని ప్రయత్నం చేస్తున్నాయి.
రాజకీయ సామాజిక సమీకరణలను మార్చాలని ప్రయత్నం చేస్తున్నాయి. అనకాపల్లి ఇంచార్జిగా కొత్త ముఖానికి వైసీపీ అవకాశం ఇచ్చింది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన మలసాల భరత్ కుమార్ కి టికెట్ ఇస్తారని అంటున్నారు.
అనకాపల్లి ఎంపీ టికెట్ ఎవరికి ఇస్తారో తెలియలేదు. మంత్రి గుడివాడ అమరనాధ్ పేరు వినిపిస్తోంది. మరో రెండు మూడు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అనకాపల్లిలో ఎంపీ అభ్యర్ధి మీద ప్రకటన ఉంటుందా అన్నది వైసీపీలో ఆసక్తిని పెంచుతోంది. అనకాపల్లి రాజకీయంగా చైతన్యవంతం అయిన ప్రాంతం. ముఖ్యమంత్రి ఇక్కడ ఏమి మాట్లాడుతారు అన్నది అన్ని రాజకీయ పక్షాలు గమనిస్తున్నాయి. అభివృద్ధికి సంబంధించిన ప్రకటనలు కూడా ఉండవచ్చు అని అంటున్నారు.