మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఎక్కడ నుంచి పోటీ చేయాలన్నది ఆయన చేతులలో ఉందా లేదా అన్నది అనుచరులలో సాగుతున్న చర్చ. కొణతాల రామకృష్ణ ఎంపీగా అనకాపల్లి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకుని ఆచీ తూచీ ఆలోచించి జనసేన పార్టీలో చేరారు. ఆయన జనసేనలో చేరే సమయానికి నాగబాబు అనకాపల్లి వస్తారు అన్న ఊహ కూడా ఎవరికీ లేదు.
అయితే కొణతాల జనసేనలో అడుగుపెట్టిన వేళా విశేషంలో ఏమో కానీ అనకాపల్లి స్టేట్ లోనే హై ఓల్టేజ్ పాలిటిక్స్ ని చూపించేసింది. నాగబాబు ఎంపీగా పోటీ చేస్తారు అని ప్రచారం సాగడం దాంతో కొణతాల అలగడం, ఆయనకు సర్దుబాటు చేసే ప్రయత్నంలో అనకాపల్లి అసెంబ్లీకి మార్చారు అని కూడా ప్రచారంలో ఉన్న మాట.
జనసేనలో ఈ సర్దుబాటు ఓకే అనుకున్నా అక్కడ నుంచి టీడీపీలో సెగలూ పొగలు మొదలయ్యాయి. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ తనకు అనకాపల్లి సీటు దక్కలేదని మండిపోయారు. ఆయన అనుచరులు కూడా గగ్గోలు పెట్టారు. చంద్రబాబు అయితే ఆయనకు నచ్చచెప్పారు. దాంతో ఆయన కొంత సహనం పాటించాలని క్యాడర్ కి పిలుపు ఇచ్చారు.
ఈ క్రమంలో చూస్తే నాగబాబు ఎంపీగా పోటీ చేయరు అని తేలిపోయింది. ఆయన ప్లేస్ లో ఎవరు అని అనుకుంటే ఇపుడు కొణతాలను ఎంపీగా జనసేన తరఫున షిఫ్ట్ చేస్తారు అని అంటున్నారు. కొణతాలను ఎంపీగా పోటీ చేయించి అనకాపల్లి ఎమ్మెల్యే సీటును పీలాకు ఇవ్వబోతున్నారు అని లేటెస్ట్ గా ప్రచారం సాగుతోంది.
ఒక సీటు టీడీపీకి మరో సీటు జనసేనకు అన్నది అనకాపల్లి రాజకీయాలలో చేసుకుంటున్న కొత్త సర్దుబాటు అని అంటున్నారు. అయితే ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు ఉంటారు అని మరో చర్చ తెర పైకి వస్తోంది. బలమైన కాపు సామాజిక వర్గం దీని మీద ఎలా స్పందిస్తుంది అన్నది కూడా రెండు పార్టీలలో ఆలోచనలు సాగుతున్నాయి.
కాపుల నుంచి ఒక బడా పారిశ్రామిక వేత్త ఎంపీ సీటు ఆశిస్తున్నారు. టీడీపీలో ఇద్దరు మాజీ మంత్రుల వారసులు ఎంపీ సీటు మీద కన్నేశారు. దాంతో అనకాపల్లి రాజకీయ రచ్చ ఆగుతుందా సాగుతుందా అన్నది అయితే తెలియడం లేదు అంటున్నారు.