అయిదేళ్ళ క్రితం వరకూ ఈ వ్యవస్థ అంటే ఎవరికీ తెలియదు. అసలు ఎవరి ఊహలకూ లేదు. గత ఎన్నికలప్పుడు చూసినా అంతకు ముందు చూసినా ఉన్నతాధికారులను బదిలీ చేయండి అంటూ ఎన్నికల ముందు ప్రతిపక్ష పార్టీలు ఈసీలకు లేఖ రాసిన ఉదంతాలు ఉన్నాయి.
ఈసారి ఎన్నికల్లో మాత్రం అంతా కొత్తగా ఉంది అంటున్నారు. పెద్ద అధికారులు ఉన్నత స్థానాలలో ఉన్న వారి కంటే ఒక వాలంటీరు ఎక్కువ అయిపోయారు. విపక్షం మాట్లాడితే చాలు వాలంటీర్లు వద్దు అంటోంది. వారిని కట్టడి చేయండి అని పుంఖానుపుంఖాలుగా లేఖలను ఈసీకు రాస్తోంది.
తాజాగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చేన్నాయుడు వాలంటీర్లను కట్టడి చేయాలని ఈసీకి లేఖ రాశారు. వాలంటీర్ల అంశం అత్యవసరమైనదిగా భావించి వారిని ఏపీ ఎన్నికల రాజకీయాల నుంచి ఎలాంటి ప్రమేయం లేకుండా పక్కన పెట్టాలని కోరుతున్నారు.
అయితే అది సాధ్యమా అన్నది చూడాల్సి ఉంది. వాలంటీర్లు అయిదేళ్లుగా ప్రతీ యాభై కుటుంబాలకు ఒక ప్రతినిధిగా మారిపోయారు. వారు మైక్రో లెవెల్ లో పనిచేస్తున్న అతి ముఖ్య వ్యవస్థగా ఉన్నారు. వారిని ఇపుడు తప్పించాలని అంటున్నా వారి విషయంలో అలా చేసినా కూడా విపక్షానికి ఒనగూడే అదనపు ప్రయోజనం ఏమీ ఉండదు అని అంటున్నారు.
వాలంటీర్లు ఒక అతి చిన్న సెగ్మెంట్ లో కీలకంగా మారిపోయారు. వారిని పక్కన పెట్టాలనుకున్నా వీలు పడదు అని అంటున్నారు. వారు ఎన్నికల విధులలో ఉండకపోవచ్చు. కానీ వారు దైనందిన వ్యాపకాలలో ప్రజలను కలుస్తూనే ఉంటారు. అలా వారిని కట్టడి చేయడం అసాధ్యం అంటున్నారు.
వాలంటీర్లను తాము ఉద్యోగాల నుంచి తీసేయమని చంద్రబాబు ప్రకటించిన మరుసటి రోజే వారి మీద అదే పార్టీ కీలక నేతలు ఈసీకి లేఖ రాస్తూంటే వారి మద్దతు విపక్షానికి ఎలా దక్కుతుంది అని అంటున్నారు. వాలంటీర్లు మా సైన్యం అని ముఖ్యమంత్రి జగన్ అన్నారు అని అచ్చెన్న విమర్శిస్తున్నారు. ప్రభుత్వంలో వారు సైన్యంగానే పనిచేస్తున్నారు. అందుకే అలా అన్నారని వైసీపీ నేతలు వివరణ ఇస్తున్నారు.
ఇవన్నీ చూసినపుడు వాలంటీర్లు అంటే ఎందుకు అంత ఉలికిపాటు అని కూడా అంటున్నారు. ఈ రోజున ఏపీలో వాలంటీర్ల మీదనే చర్చ సాగుతోంది. వారి ప్రభావం ఈ ఎన్నికల్లో ఎంత ఉంటుందో తెలియదు కానీ ఒక వేళ ఉంటే మాత్రం వారే అత్యంత శక్తిమంతమైన వ్యవస్థ అని అంతా ఒప్పుకుంటారేమో.