2024 ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేనతో భాజపా కూడా చేతులు కలపబోతోందని చాలా వరకు క్లారిటీ వచ్చింది. భాజపా నాయకులు పురంధ్రీశ్వరి, సోము వీర్రాజు ఢిల్లీ వెళ్లడంతో ఆ మేరకు ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు, మూడు నుంచి అయిదు ఎంపీ సీట్లు భాజపాకు ఇస్తారనే వార్తలు వినిపించడం ప్రారంభమైంది. ఇప్పటికే 24 ఎమ్మెల్యే సీట్లు జనసేనకు ఇచ్చేసారు. మూడు ఎంపీ సీట్లు ఇచ్చేసారు. అందువల్ల మొత్తం లెక్క వేసుకుంటే 32 ఎమ్మెల్యే సీట్లు, ఏడెనిమిది ఎంపీ సీట్లు తేదేపా వదులుకుంటున్నట్లు.
నిజానికి జనసేనకు 32 ఎమ్మెల్యే సీట్లు పొత్తులో భాగంగా ఇస్తారని వార్తలు ఆరంభంలో వినిపించాయి. కానీ 24కు పరిమితం చేసారు. అంటే భాజపా పక్కాగా తమతో కలుస్తుందని చంద్రబాబు-పవన్ లకు సమాచారం వుందన్న మాట. అంటే భాజపాను తేదేపాతో కలపడం కోసం జనసేన అధినేత పవన్ త్యాగం చేసారన్న మాట. అంటే భాజపాను తేదేపాను కలపాలని పవన్ ఎంత పట్టుదలతో వున్నారో అర్థం అవుతుంది.
అయితే 175 స్ధానాల్లో దాదాపు 90శాతం చోట్ల తేదేపా కూడా వైకాపాతో సమానంగా బలంగా వుంది. కేడర్ వుంది. మాజీ నాయకులు వున్నారు. వారంతా చాలా ఆశగా వున్నారు టికెట్ ల కోసం. అది కాకుండా పలువురు ఎన్నారై లు ఎంపీలుగా పోటీ చేయడానికి ఉత్సాహంగా వున్నారు. పార్టీకి ఆర్థికంగా సహకరించేందుకు సిద్దంగా వున్నారు. ఇప్పుడు 32 ఎమ్మెల్యే స్ధానాల్లో తేదేపా కేడర్ కానీ నాయకులు కానీ నిరుత్సాహ పడక తప్పదు.
ఇలాంటి దానికి చంద్రబాబు దగ్గర పాత మంత్రం వుండనే వుంది. తాను ఎక్కడ ఎవరికి టికెట్ ఇవ్వాలనుకుంటున్నారో, వాళ్లను భాజపాలోకి లేదా జనసేనలోకి పంపించి, అక్కడ టికెట్లు ఇప్పించడం అన్నది చంద్రబాబు కు తెలిసిన పాత ఫార్ములా. 2014లో ఇదే అమలు చేసి కామినేని శ్రీనివాస్ లాంటి వారిని అటు నిలబెట్టి, గెలిపించి, మంత్రిని కూడా చేసారు.
పవన్ కూడా డిటోనే. తెలంగాణ ఎన్నికల్లో ముందు రోజు పార్టీలోకి వచ్చిన వారికి మర్నాడే టికెట్ లు ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు ఆల్ రెడీ. బాలశౌరి, రామాంజనేయులు, కొత్తపల్లి సుబ్బారాయుడు, కొణతాల రామకృష్ణ ఇలా వీళ్లందరినీ చంద్రబాబే జనసేనలోకి పంపారనే వదంతులు వున్నాయి. ఇప్పుడు ఇక ఇలా భాజపాలోకి కూడా పంపాల్సి వుంటుంది. అక్కడ వున్నది పురంధ్రీశ్వరి కనుక పెద్దగా ఇబ్బంది ఏమీ రాదు కూడా.
కానీ ఈ పొత్తువల్ల గెలుపు సంగతి ఎలా వున్నా, భవిష్యత్ లో భాజపా కానీ, జనసేన కానీ ఎప్పటికి స్వంతంగా మాత్రం ఎదగలేవు. ఎక్కడి నుంచి వచ్చిన నాయకులు టైమ్ అయ్యాక మళ్లీ ఎక్కడి వాళ్లు అక్కడ సర్దుకుంటారు. భాజపా దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఇలాగే మరుగుజ్జుగా వుండిపోయింది. జనసంఘ్ గా వున్నపుడు రాష్ట్ర వ్యాప్తంగా కేడర్, లీడర్లు వున్న ఆ పార్టీ ఇప్పుడు ఎలా వుందో అందరికీ తెలిసిందే. జనసేన పరిస్థితి కూడా భవిష్యత్ లో ఇలాగే వుంటుంది. ఎందుకంటే ఈ 24 స్ధానాలు తప్ప మిగిలిన చోట్ల కేడర్ ఎక్కడి వారు అక్కడ సర్దుకుంటారు. పనులు కావాలి, పైసలు కావాలి అంటే అలా చేయక తప్పదు. ఇక పార్టీ ఎలా బలపడుతుంది.
చంద్రబాబు-వెంకయ్య నాయుడు దోస్తీ కట్టి తెలుగుదేశం పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించినప్పటి నుంచి ఇదే తంతు నడుస్తోంది. భాజపాకు అది అలవాటైపోయింది. చంద్రబాబు కు అది కలిసి వస్తోంది.