అదేంటో బాలయ్యపై ఎప్పుడూ దగ్గరివాళ్లే కామెంట్స్ చేస్తుంటారు. ఆయన గురించి అన్నీ తెలిసిన వ్యక్తులే సెటైర్లు వేస్తుంటారు. ఈసారి దర్శకుడు కేఎస్ రవికుమార్ వంతు. ఓ తమిళ సినిమా ఫంక్షన్ లో మాట్లాడిన కేఎస్ రవికుమార్.. బాలయ్యపై కౌంటర్లు వేశారు.
ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసిన ఈ సీనియర్ దర్శకుడు, బాలయ్య బిహేవియర్ ను ఉన్నదుట్టున్నట్టు పూసగుచ్చినట్టు చెప్పేశారు. సెట్స్ లో ఎవరైనా నవ్వితే బాలయ్యకు సర్రున కోపం వస్తుందట. అలా నవ్విన వాళ్లను తన ప్రత్యర్థి వర్గానికి చెందిన వ్యక్తులని అనుకుంటారట బాలకృష్ణ.
ఓసారి ఇలానే సెట్స్ లో అసిస్టెంట్ డైరక్టర్ శరవణన్, బాలయ్య వైపు ఫ్యాన్ తిప్పాడట. ఆ గాలికి బాలయ్య విగ్గు కదిలిందంట. దీంతో బాలయ్య ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడట. తను వెంటనే అప్రమత్తమవ్వడంతో పెద్ద ప్రమాదం తప్పిందని, లేదంటే ఆ టైమ్ లో తన అసిస్టెంట్ డైరక్టర్ చెంప ఛెళ్లుమనేదంటూ సరదాగా చెప్పుకొచ్చారు కేఎస్.
ఆయనలా చెబుతుంటే స్టేజ్ పై ఉన్న వ్యక్తులతో పాటు, కింద కూర్చున్న జనం కూడ ఫక్కున నవ్వారు. ఆ వేదికపై హీరోయిన్ హన్సిక కూడా ఉంది. ఆమె కూడా పగలబడి నవ్వింది. ఆ వెంటనే కోలీవుడ్ లో బాలయ్య విగ్గుపై విపరీతంగా కథనాలు వచ్చాయి.
ఇక టాలీవుడ్ విషయానికొస్తే.. బాలయ్య విగ్గుపై రెండు వర్గాలు ఓ రేంజ్ లో దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. సహజంగానే బాలయ్య వర్గం ఈ అంశాన్ని హైలెట్ చేసింది. మరీ ముఖ్యంగా ఏపీలో ఎన్నికల టైమ్ కావడంతో, ఓ సెక్షన్ బాలయ్య బిహేవియర్ అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలుపెట్టింది.
దీనికి బాలకృష్ణ ఫ్యాన్స్ కౌంటర్ ఇవ్వట్లేదు కానీ, కేఎస్ రవికుమార్ పై మాత్రం వాళ్లు భగ్గుమంటున్నారు. అవకాశాల్లేని టైమ్ లో బాలకృష్ణ, పిలిచిమరీ 2 సినిమాల ఛాన్సులిచ్చారని, అలాంటిది ఇప్పుడు అదే బాలయ్యపై నోటికొచ్చినట్టు మాట్లాడ్డం ఏంటంటూ ఫైర్ అవుతున్నారు.
నిజానికి తన ప్రసంగంలో కేఎస్ రవికుమార్, బాలయ్యను పొగిడారు. బాలయ్యది మంచి మనసని, ఆయన భోళా వ్యక్తి అని చెప్పారు. బాలయ్యను దర్శకుల నటుడిగా చెప్పుకొచ్చారు. అయితే అవన్నీ పక్కకెళ్లిపోయాయి, కేవలం బాలయ్య విగ్గుపై కేఎస్ చేసిన కామెంట్స్ మాత్రం వైరల్ గా మారాయి.