తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గుండెపోటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. తమ్మినేని గుండెపోటుకు గురయ్యారని తెలియగానే సీపీఎం శ్రేణులు ఆందోళన చెందాయి. చాలా మంది సీపీఎం కార్యకర్తలు హైదరాబాద్‌కు వెళ్లారు.
ఇదిలా వుండగా ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేసి ఐదు వేలకు పైగా ఓట్లు సాధించారు. కాంగ్రెస్‌తో పొత్తు కోసం చివరి వరకూ ప్రయత్నించినా, సీట్ల సర్దుబాటులో అవగాహన కుదర్లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీతో సీపీఐ పొత్తు కుదుర్చుకుని కొత్తగూడెం నుంచి పోటీ చేసి గెలుపొందింది. సీపీఎం మాత్రం ఒంటరిగా బరిలో దిగి డిపాజిట్లను కూడా దక్కించుకోలేక పోయింది.
తమ్మినేని వీరభద్రం విషయానికి వస్తే… తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి నాయకత్వం వహిస్తున్నారు. సీపీఎంలో తమ్మినేని కీలక నాయకుడు. 1996లో ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి తమ్మినేని గెలుపొందారు. ఆ తర్వాత రెండేళ్లకు జరిగిన ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి తమ్మినేని ఓడిపోయారు.
2004లో ఖమ్మం ఎమ్మెల్యేగా ఆయన చట్టసభలో అడుగు పెట్టారు. ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందిన తమ్మినేని త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.