ఓటర్ల జాబితాలో అక్రమ చేరికలు, అక్రమ తొలగింపుల ద్వారా మాత్రమే ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాబోయే శాసనసభ ఎన్నికల్లో గెలవాలని అనుకుంటున్నట్టుగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నానా గొడవ చేస్తూన్నారు.
సంక్రాంతి పండగ చేసుకోవడానికి సొంత ఊరికి వెళ్లిన చంద్రబాబుకు అక్కడ కూడా వేరే ధ్యాస లేదు. అక్కడో మీడియా మీట్ పెట్టి.. ఓటర్ల జాబితాల్లో అక్రమాల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. అయితే.. కేవలం ఈ అంశం మీద చంద్రబాబు ఇంత అతిగా మాట్లాడుతుండడం అనేది అతిశయంగా కనిపిస్తోంది. ఎన్నికల తర్వాత ఓడిపోతే.. ఎలాంటి సాకులు చెప్పుకోవాలో.. వాటికి ఇప్పటినుంచే ఆయన ఆధారాలను తయారుచేసుకుంటున్నట్టుగా భావించాల్సి వస్తోంది.
ఎందుకంటే.. ఎన్నికల సమయంలో ఓటర్ల జాబితాలో కొత్తగా పేర్లను చేర్చడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నించడం అనేది చాలా సాధారణమైన సంగతి. అవకతవకలు జరగడం కూడా చాలా మామూలు విషయం. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఆరోపణలు అనేకం వినవచ్చాయి. అయితే చంద్రబాబు ఈసారి చాలా ఎక్కువ రభస చేస్తున్నారు.
తమాషా ఏంటంటే.. ఓటర్ల జాబితాలను సరిచేయడానికి ఇంకా సమయం మించిపోలేదు. జాబితాల్లో తప్పులుంటే ఫిర్యాదు చేసి వాటిని తొలగించేలా చేయవచ్చు. ఏదో నాటకీయంగా పవన్ కల్యాణ్ ను కూడా వెంటబెట్టుకుని.. కేంద్ర ఎన్నికల సంఘం అధికార్ల వద్దకు వెళ్లి అన్నీ అక్రమాలు జరుగుతున్నాయని ఒక డైలాగు చెప్పి రావడం మాత్రమే కాదు.
క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ ఫిర్యాదులు చేస్తూ తప్పులున్న సంగతిని నిరూపిస్తూ జాబితాలను చక్కదిద్దవచ్చు. ఎటూ క్షేత్రస్థాయిలో తమకు అపరిమితమైన కార్యకర్తల బలం ఉన్నదని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ ఓటర్ల జాబితా మీద ఎప్పటికప్పుడు నిఘా పెట్టవచ్చు. అలాంటి పనులు చేయకుండా.. జాబితాల్లో అక్రమాలు జరిగిపోతున్నాయని అనవసరమైన గోల చేయడం ఉపయోగం ఉండదు.
పదేపదే ఈ మాటలు అనడం చూస్తోంటే అనుమానం వస్తోంది. ఎటూ ఓడిపోయిన తర్వాత.. మేం ముందు నుంచే చెబుతున్నాం.. ఓటర్ల జాబితాలో అక్రమాల వల్లనే ఓడిపోయాం తప్ప మాకు ప్రజాదరణ లేకపోవడం వల్ల కాదు అంటూ బుకాయించవచ్చుననేది చంద్రబాబు దూరాలోచన కావచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు.