ఇన్నాళ్లు కొంచం సస్పెన్స్ ఉన్నది గానీ.. ఇప్పుడు అది కూడా తొలగిపోయింది. వైఎస్ షర్మిలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇస్తారా, ఏఐసీసీలో చోటు కల్పిస్తారా? అనే విషయంలో ఒక డైలమా ఉండేది. ఇప్పుడు గిడుగు రుద్రరాజు రాజీనామాతో అది తొలగిపోయింది. మణిపూర్ లో రాహుల్ పాదయాత్ర సందర్భంలోనే షర్మిలకు ఖర్గే పీసీసీ సారథ్యంపై క్లారిటీ ఇచ్చినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అంతా బాగున్నది గానీ.. షర్మిల రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతున్నది అనేది ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది.
వైఎస్ షర్మిలకు సారథ్యం అప్పగించడం ద్వారా.. ఏపీలో జగన్మోహన్ రెడ్డికి ఉండగల ఓటు బ్యాంకును గణనీయంగా చీల్చగలం అనేది కాంగ్రెస్ నమ్మకం. తద్వారా చంద్రబాబునాయుడు నెత్తిన పాలు పోయాలనేది వారి ఆశ.
చింతామోహన్ లాంటివాళ్లు కామెడీ చేస్తున్నట్టుగా షర్మిల సారథ్యంలో కాంగ్రెస్ ఉన్నపళంగా 130 సీట్లు గెలిచి అధికారంలోకి రావడం జరిగేది కాదు. కాకపోతే.. రాష్ట్రాన్ని చీల్చిన పార్టీ.. అవశేష ఆంధ్రప్రదేశ్ లో కొంత ఓటు శాతాన్ని పెంచుకోగలుగుతుంది. వైసీపీ నుంచి అసంతృప్తితో బయటకు వెళ్తున్న నాయకులు షర్మిలను నమ్మి కాంగ్రెస్ టికెట్ పై బరిలోకి దిగితే రాష్ట్రంలో ఆ పార్టీకి పదేళ్ల తర్వాత కనీసం ఒకరిద్దరి ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం కూడా దక్కవచ్చు. అయితే షర్మిలకు ఏం ఒరుగుతుంది?
షర్మిలను కడప ఎంపీ స్థానం నుంచి పోటీచేయించే అవకాశం ఉన్నదని గుసగుసలున్నాయి. ఆ ఆఫర్ షర్మిల ఒప్పుకుంటారో లేదో తెలియదు. ఆ ఆఫర్ స్వీకరిస్తే కొన్ని ఇబ్బందులున్నాయి. షర్మిల కడప ఎంపీ బరిలో దిగితే.. రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేయడం కష్టం. తీరా ఎంపీగా ఓడిపోయిందంటే.. సొంతంగా ఎంపీగా సొంత ఊర్లో కూడా గెలవలేని నాయకురాలు అనే కాంగ్రెస్ పార్టీనే ఆమె మీద ముద్ర వేసి.. మైండ్ గేమ్ ఆడి.. ఆమెకు అవకాశాలను పలచన చేస్తుంది. విఫల నాయకురాలని ముద్ర వేస్తుంది.
అందువల్ల షర్మిల స్వయంగా ఎన్నికల బరిలోకి దిగకుండా.. కేవలం రాష్ట్రవ్యాప్త ప్రచారానికి మాత్రమే పరిమితమైతే ఆమె రాజకీయ భవిష్యత్తు స్థిరంగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆమె ప్రచారం వల్ల.. కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఎంతో కొంత పెరుగుతుంది. పెరిగినదంతా ఆమె ఘనత కిందికే వస్తుంది. అప్పుడు ఆమెకు ప్రత్యుపకారం చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ బాధ్యత అవుతుంది.
ఏపీలో బలం లేకపోయినా సరే.. దేశంలో ఏదో ఒక రాష్ట్రం నుంచి ఆమెకు రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టే అవకాశం ఏర్పడుతుంది. అలా కాకుండా ఆమె కూడా స్వయంగా ఎన్నికల్లోకి దిగి ఓడిపోతే కేవలం విఫలమైందనే ముద్ర మాత్రమే కాదు, తన స్వార్థం చూసుకున్నదని, రాష్ట్రమంతా శ్రద్ధగా తిరిగి ఉంటే పార్టీ ఇంకా బలపడేదని రకరకాల ముద్రలు వేస్తారు. ఈ విషయంలో షర్మిల ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ప్రజలు భావిస్తున్నారు.