అభ్యర్థుల ప్రకటన ఎప్పుడనేది కాదు.. అసలు రాయలసీమలో చాలా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు ఎవరో కూడా తెలియని పరిస్థితి అయితే కనిపిస్తోంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయ వ్యూహాల్లో చాలా బిజీగా ఉన్నట్టుగా ఉన్నారు. ప్రత్యేకించి పవన్ కల్యాణ్ తో పొత్తు వ్యవహారాన్ని కొలిక్కి తేవడం గురించి ఆయన చాలానే కష్టపడుతున్నట్టుగా ఉన్నారు.
బహుశా జైలు నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడుకు పవన్ కల్యాణ్- కాపులు అనే సమీకరణాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికే పాట్లు పడుతున్నారు. ఇంతజేసినా జనసేనకు ఎన్ని సీట్లో ఎవరికీ తెలీదు. మరోవైపు కేవలం జనసేనతో పొత్తు వల్ల ప్రయోజనం ఉండదని, అందుకే ముద్రగడను కూడా ప్రసన్నం చేసుకోవడానికి పవన్ కల్యాణ్ ను చంద్రబాబు వాడుకుంటున్నారనే టాక్ ఉంది. ఇంకోవైపు బీజేపీని కూడా దారిలో పెట్టుకోవడానికి, ఆ పై కాంగ్రెస్ ను ఉపయోగించుకోవడానికి కూడా చంద్రబాబు నాయుడు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.
మరి పవన్ కల్యాణ్ ను, ముద్రగడను, బీజేపీని, కాంగ్రెస్ ను, కమ్యూనిస్టులను ఇంకా ఎంఐఎంను ఆ పై ఆయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని కూడా చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో వాడుకోగల సిద్ధహస్తుడే! ఇందులో అణుమాత్రం అనుమానం లేదు! అయితే.. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ, రాయలసీమలో 50కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిల్లో చాలా అంటే చాలా నియోకవర్గాలకు ఎవరు అభ్యర్థులనే క్లారిటీ కూడా పార్టీ క్యాడర్ కు లేకపోవడం గమనార్హం. తిప్పితిప్పి కొడితే ఎన్నికలకు మరో మూడు నెలల సమయం కూడా లేదు! ఇలాంటి నేపథ్యంలో కూడా సీమలో తెలుగుదేశం అభ్యర్థులపై స్పష్టత లేకపోవడం విశేషం.
తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ఉమ్మడి అనంతపురం జిల్లా చాలా కీలకం. ఇక్కడ కనీసం పది సీట్లు గెలిచినప్పుడే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని సొంతం చేసుకోగగలదనేది బండగుర్తు! 14 సీట్లున్న ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలో ఏడెనిమిదీ సీట్లను నెగ్గినప్పుడు కూడా తెలుగుదేశం గతంలో రాష్ట్రంలో అధికారం రాలేకపోయింది. అనంతపురంలో పది, అంతకు మించి వచ్చినప్పుడే టీడీపీకి రాష్ట్రంలో అధికారం దక్కే పరిస్థితి ఉంటుంది. మరి ఇప్పుడు అదే ఉమ్మడి అనంతపురం జిల్లా పరిస్థితికి వస్తే.. పది సీట్లను నెగ్గడం మాట అటుంచి, పది సీట్లలో అయినా కనీసం అభ్యర్థులు ఖరారు అయ్యారా? అనేది శేష ప్రశ్న!
పుట్టపర్తిలో పల్లెకు టికెట్ ఇవ్వరనే ప్రచారం ఉంది, పెనుకొండ మాజీ ఎమ్మెల్యే పార్థసారధిని పెనుకొండ నుంచినే పోటీ చేయిస్తారా లేక హిందూపురం ఎంపీగా బరిలోకి దించుతారో ఎవరికీ తెలీదు! అలాగే అనంతపురం ఎంపీ గా ఎవరు పోటీ చేస్తారో క్లారిటీ లేదు! రాయదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరో తెలీదు. పరిటాల కుటుంబానికి రెండు టికెట్లు ఇచ్చి రాప్తాడు, ధర్మవరం నుంచి వారినే బరిలోకి దించుతారా లేక రాప్తాడుకే పరిమితం చేస్తారో తెలీదు!
ఇక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో అయితే సరేసరి! శింగనమలలో తెలుగుదేశం పార్టీకి దిక్కూదివాణం లేదు! మరి ఆ 14 నియోజకవర్గాల పరిధిలో సగం చోట్ల ఇప్పటి వరకూ స్పష్టత లేదు! మరి నామినేషన్ల ముందు రోజు వరకూ చంద్రబాబు నాయుడు అభ్యర్థులను తేల్చకపోవచ్చేమో. మరోవైపు జనసేనతో పొత్తు. ఆ పార్టీకి ఎన్ని సీట్లు, ఏ సీట్లు ఇస్తారో క్లారిటీ లేదు ఇంత వరకూ!
అనంతపురం జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే.. చిత్తూరు సరేసరి! చిత్తూరు జిల్లాలో రెండు ఎంపీ సీట్లకూ అభ్యర్థుల విషయంలో నో క్లారిటీ. ఎమ్మెల్యే సీట్ల విషయానికి వస్తే.. పూతలపట్టు, చిత్తూరు, మదనపల్లి, నగరి వంటి చోట్ల స్పష్టత లేదు!
కడపలో అన్ని గెలుస్తాం, ఇన్ని గెలుస్తాం అనే మాటలు సరే కానీ.. ఎన్ని సీట్లకు అభ్యర్థులున్నారో తెలుగుదేశం ముందు లెక్క పెట్టుకోవాలి. కర్నూలు విషయంలో అయితే మరింత గందరగోళం!
చంద్రబాబు నాయుడు ఆశలన్నీ కేవలం గోదావరి జిల్లాలు, పవన్ కల్యాణ్, కాపుల ఓట్లు అనే సమీకరణాల మీదనే ఉన్నట్టున్నాయి. బీసీలు మెండుగా ఉన్న రాయలసీమ విషయంలో ఆయనకు ఆశలున్నట్టుగా కూడా లేవు! అందుకే ఇక్కడ పార్టీని పట్టించుకున్నట్టుగా కూడా లేరు!