ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ లో ట్రాఫిక్ ఏ రేంజ్ లో ఉందో అందరం చూశాం. గుంటూరుకారం సినిమాకు మినహా ఏ మూవీకి సరైన థియేటర్లు దక్కలేదు. స్క్రీన్స్ కోసం సినిమాల మధ్య పోటీ చూశాం. మేం ముందు వచ్చామంటే మేం ముందు వచ్చామనే ప్రకటనలు కూడా చూశాం.
అందుకేనేమో ఈసారి మేకర్స్ మరింత జాగ్రత్త పడ్డారు. వచ్చే సంక్రాంతికి వస్తున్నామంటూ ఈ సంక్రాంతికే ప్రకటించేసుకుంటున్నారు. అలా ఈరోజు 2 సినిమాల ప్రకటనలు వచ్చేశాయి.
వశిష్ఠ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై చిరంజీవి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ టైటిల్ ను ఈరోజు రిలీజ్ చేశారు. సినిమా థీమ్ ఏంటో చెబుతూ, ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. పనిలోపనిగా విడుదల తేదీ ప్రకటించారు.
చిరంజీవి 156వ సినిమాకు విశ్వంభర అనే టైటిల్ పెట్టారు. మూవీకి ఈ టైటిల్ పెడతారనే విషయం ముందుగానే చాలామందికి తెలుసు. అయితే ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తారనే విషయం మాత్రం కొత్త. “అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, 2025 సంక్రాంతికి కలుద్దాం” అంటూ ప్రకటించారు మేకర్స్.
ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి మరో సినిమా కూడా సిద్ధమైంది. ఈరోజు దిల్ రాజు ఓ సీక్వెల్ ప్రకటించారు. తనకు జాతీయ అవార్డ్ తెచ్చిపెట్టిన శతమానంభవతి సినిమాకు సీక్వెల్ అది. గతంలో భారీ చిత్రాల మధ్య చిన్న చిత్రంగా వచ్చి పెద్ద హిట్ సాధించింది శతమానంభవతి.
ఈ సినిమాకు సీక్వెల్ తీస్తానని ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన దిల్ రాజు, ఈరోజు ఆ ప్రకటన చేశారు. తన సీక్వెల్ కు “శతమానంభవతి నెక్ట్స్ పేజి” అనే టైటిల్ పెట్టిన రాజు, వచ్చే ఏడాది సంక్రాంతికి కలుద్దామంటూ పోస్టర్ వదిలారు. అంతకుమించి వివరాలు వెల్లడించలేదు.
ఇలా ఈ సంక్రాంతి రోజున వచ్చే ఏడాది సంక్రాంతికి రెండు సినిమాలు అధికారికంగా లాక్ అయ్యాయి. మే నెల నుంచి మరిన్ని సినిమాలు ఈ రేసులో చేరడం ఖాయం. ఎందుకంటే నాగార్జున బంగార్రాజు-3తో పాటు హను-మాన్ సీక్వెల్ కూడా వచ్చే సంక్రాంతికి వచ్చే అవకాశాలున్నాయి. వీటితో పాటు బాలయ్య సినిమా కూడా రేసులో చేరే ఛాన్స్ ఉంది.