ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ చర్చనీయాంశమైంది. తాజాగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ లిక్కర్ స్కామ్‌లో నోటీసులు ఇచ్చింది. మంగళవారం విచారణకు రావాలని అందులో ఈడీ పేర్కొనడం గమనార్హం. కనీసం 24 గంటలు కూడా గడవ ఇవ్వకుండానే విచారణకు పిలవడం చర్చనీయాంశమైంది.
గతంలో ఈడీ విచారణకు కవిత మూడుసార్లు విచారణకు హాజరైంది. ఇదిగో అరెస్ట్, అదిగో అరెస్ట్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఆమెను ఈడీ అరెస్ట్ చేయలేదు. కవితను అరెస్ట్ చేయకపోవడాన్ని కాంగ్రెస్ రాజకీయంగా బాగా వాడుకుంది. కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీతో కేసీఆర్ సర్కార్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకోవడం వల్లే కవితను అరెస్ట్ చేయలేదని కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది.
కాంగ్రెస్ ఆరోపణలు జనంలోకి బాగా వెళ్లాయి. అంత వరకూ బీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నాయం అనే పరిస్థితి క్రమంగా మారుతూ వెళ్లింది. బీజేపీ గ్రాఫ్ క్రమంగా తగ్గుతూ, కాంగ్రెస్ పరపతి పెరిగింది. బీఆర్ఎస్కు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమని భావించి, ఆ పార్టీలోకి వెళ్లిన నేతలంతా తిరిగి కాంగ్రెస్‌లోకి క్యూ కట్టారు. ఇదే కాంగ్రెస్‌కు రాజకీయంగా అనుకూలమైంది. బీఆర్ఎస్కు కవిత ఎపిసోడ్ నెగెటివ్ అని చెప్పాల్సి వుంటుంది.
తాజాగా కవితను ఈడీ విచారణకు ఆహ్వానించడంతో ఏం జరుగుతుందో అనే చర్చకు తెరలేచింది. అకస్మాత్తుగా విచారణకు రావాలని పిలవడంపై కవిత స్పందన ఎలా వుంటుందో తెలియాల్సి వుంది. ఇదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ ఇప్పటికే నాలుగు సార్లు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. అయినా ఆయన వెళ్లలేదు. మరి కవిత ఆయన బాటలోనే నడుస్తారా? ఒకవేళ అదే జరిగితే ఈడీ తదుపరి చర్య ఎలా వుంటుందనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.