ఒక్కో పెద్ద హీరో ఒక సినిమాను పూర్తి చేసి విడుదల చేయడానికి కనీసం రెండేళ్ల సమయాన్ని తీసుకుంటూ ఉన్నాడు సగటున! మరి రెండేళ్లకు గానూ ఒకటిగా వస్తున్న ఆ సినిమాలు తీరా విడుదలైన తొలి షోతోనే నివ్వెరపరుస్తున్నాయి, నిస్సారం అనిపిస్తున్నాయి. ఒకవేళ బాగుంది అనే మాట వినిపించినా.. ఆ తర్వాత లోటు పాటు ఎక్కువ! ఏ సినిమాకు అయినా ఇవి తప్పకపోవచ్చు.
సినిమా రంగంలో సక్సెస్ రేటు ఐదు శాతం లోపే కావొచ్చు! అయితే.. గతంలో హీరోలు మూడు నెలల్లో ఒక్కో సినిమాను పూర్తి చేసే వారు. వారెంత స్టార్ హీరోలైనా, వారెంత మాస్ ఇమేజ్ ను కలిగిన వారు అయినా.. మూడు నెలల్లోపే ఎంత గొప్ప సినిమాను అయినా పూర్తి చేసి, మరో సినిమాకు వెళ్లిపోయేవారు.
స్టార్ హీరోలు కూడా ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తున్న రోజుల్లో.. వారు కథల విషయంలో ఇబ్బంది పడ్డారంటే అదో ఎత్తు! ఆ తర్వాతి కాలంలో స్టార్ హీరోలు ఏడాదికి ఒక సినిమా చేసే సంప్రదాయం ఏర్పడింది. ఇప్పుడు రెండేళ్లకు ఒక సినిమానే ఎక్కువ అయ్యింది! మరి ఇంతజేసీ.. చరిత్రలోనే కనివినీ ఎరగని డిజాస్టర్లను, వీరాభిమానులను కూడా వీరవిసుగెత్తించే సినిమాలను వదులుతున్నారు మన స్టార్లు!
మరి లోపం ఎక్కడ? అంటే.. దర్శకులు, రచయిత మీదే వేళ్లు చూపబడుతూ ఉన్నాయి. ఇందులో పెద్ద ఆశ్చర్యం లేదు కూడా! ఒక సినిమా హిట్ అయితే ఇప్పుడు దర్శకులు, హీరోలకు మంచి పేరొస్తోంది. హీరోలకు సమానంగా వారు ఇమేజ్ ను సంపాదించుకుంటున్నారు. కటౌట్లు పెట్టించుకోగలుగుతున్నారు. కోట్ల రూపాయల రెమ్యూనిరేషన్లూ తీసుకుంటున్నారు!
గతంతో పోలిస్తే దర్శకుల విలువ టాలీవుడ్ లో అన్ని రకాలుగానూ చాలా పెరిగింది. అయితే.. ఔట్ పుట్ మాత్రం ఆ స్థాయిలో ఉండటం లేదు. అంచనాలను అందుకోవడం మాట అటుంచితే.. కొత్తదనం కోసం ప్రయత్నం కానీ, కొత్తగా ప్రజెంట్ చేయడంలో కానీ.. పెద్ద వర్క్ జరిగినట్టుగా కనిపించదు. తమకు తెలిసిన సేఫ్ గేమ్ ను ఆడటం లేదా, అతి విశ్వాసంతో ప్రేక్షకులను తక్కువ అంచనా వేసి సినిమాలను చూపించడమే పనిగా పెట్టుకుంటున్నారు దర్శకులు!
ఫెయిల్ కావాలని, ప్రేక్షకులను ఆకట్టుకోకూడదని ఏ దర్శకుడూ సినిమా తీయాలనుకోడు. ఏ రచయితా అలాంటి ప్రయత్నం చేయడు. అయితే సమస్యల్లా వారి అతి విశ్వాసమే వల్లనే అనుకోవచ్చు. గుంటూరు కారం విషయంలో అయితే.. త్రివిక్రమ్ అతి విశ్వాసం లేదా ప్రేక్షకులను మరీ తక్కువ అంచనా వేయడం వల్లనే కళ్లలోకి కారం అనిపించుకుంటూ ఉండవచ్చు.
తనేం తీసినా అది హిట్టే, తనే అపరమేధావిని, తనబోటి మేధావులకు మాస్ పల్స్ తెలియదా అన్నట్టుగా త్రివిక్రమ్ అతి విశ్వాసంతో ఇలాంటి డిజాస్టర్ లను ఇస్తుండవచ్చు. ఇలాంటి మేధస్సు మితిమీరిపోయి కృష్ణవంశీ, పూరి జగన్నాథ్ వంటి వాళ్లు డిజాస్టర్లతో వెనుకబడిపోయారు. ఇప్పుడు త్రివిక్రమ్ పరిస్థితి కూడా అలానే తయారవుతోందా అనే అనుమానాలు సాధారణ ప్రేక్షకుల్లో కలగడంలో పెద్ద ఆశ్చర్యం లేదు!
ఓ రామ్ గోపాల్ వర్మ, ఇంకో గుణశేఖర్, ఇంకో పూరీ, ఇంకో శ్రీను వైట్ల, ఇంకో కృష్ణవంశీ.. వీళ్ల టైమ్ చాలా కాలమే నడిచింది. ఆ తర్వాత వీళ్లంతా సినిమాలు తీయడం మానేసి తమకు తోచిన డాక్యుమెంటరీలను జనాల మీదకు వదిలి వెనుకబడ్డారు. ఇప్పుడు త్రివిక్రమ్ కూడా వారి సరసన చోటు సంపాదించుకుంటున్నట్టుగా ఉన్నారు.
గతంలో హీరోలకే విజయాహాంకారం ఉంటుందని, వారే తామేం తీసినా చెల్లుతుందనే అభిప్రాయంతో ఉంటారనే టాక్ ఉండేది. అయితే ఇప్పుడు హీరోలు చాలా వినయపూర్వకంగా మారారు. దర్శకులు, రచయితలు చెప్పిందల్లా చేస్తూ ఉన్నారు. కండలు పెంచమన్నా, కష్టపడమన్నా, ఏం చేయమన్నా హీరోలు దర్శకులు చెప్పిందల్లా చేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు.
అయితే హీరోల సమయాన్ని వారి కష్టాన్ని కూడా దర్శకులు పెద్దగా దృష్టి పెట్టుకున్నట్టుగా కనపడటం లేదు. పేపర్ మీదే పరమ వీక్ గా ఉన్న సీన్లతో వీళ్లు సెట్స్ మీదకు వెళ్లి మొత్తానికే కంగాళీ చేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు! అతివిశ్వాసమో, అతి మేధస్సో ఇందుకు కారణం!
-హిమ