కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిలకు కీలక పదవి ఏ క్షణాన్నైనా దక్కొచ్చు. ఏపీ కాంగ్రెస్ సారథ్య బాధ్యతల్ని ఆమెకు అప్పగించడానికి తాజా అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు రూట్ క్లియర్ చేయడం విశేషం. తన పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. దీంతో షర్మిలకు ఏపీ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారనే ప్రచారానికి బలం కలిగింది.
ఇటీవల షర్మిల రాహుల్, ఖర్గే సమక్షంలో తన పార్టీ వైఎస్సార్‌టీపీని విలీనం చేశారు. కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి బాధ్యతల్ని అప్పగించినా పని చేయడానికి సిద్ధమని ఆమె ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంతకాలం వైఎస్సార్‌టీపీ తరపున తెలంగాణలో రాజకీయ పోరాటాలు చేశారు. అయితే తెలంగాణ సమాజం ఆమె ఆశించిన స్థాయిలో ఆదరించలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఆమె మద్దతు పలికారు.
అనంతరం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. తెలంగాణలో తన అన్నకు వ్యతిరేకంగా రాజకీయ కార్యకలాపాలు సాగిస్తారా? లేదా? అనే చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ అప్పగించే బాధ్యతల్ని బట్టి తన పంథా వుంటుందని ఇటీవల ఆమె ప్రకటించారు. పీసీసీ అధ్యక్ష బాధ్యతల్పి అప్పగించనున్న నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో వైఎస్ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె గళం ఎత్తనున్నారు.
ఇదిలా వుండగా గిడుగు రుద్రరాజు రాజీనామాతో షర్మిలకు త్వరలో కొత్త బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఇటీవల గిడుగు మీడియాతో మాట్లాడుతూ షర్మిల నాయకత్వంలో పని చేయడానికి సిద్ధమని ప్రకటించారు. టీడీపీ, వైసీపీలలో టికెట్లు దక్కని నేతలు తమ వైపు చూస్తున్నారని ఆయన చెప్పారు. వామపక్షాలతో పాటు ఆప్ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్ చర్చలు జరుపుతోంది. షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ ఏ మేరకు బలపడుతుందో చూడాలి.