“ఓ కుర్రాడు ఖాళీగా ఉన్న రోడ్డుపైకి సైకిల్ మీద వచ్చాడు. అదే టైమ్ లో కొన్ని కార్లు, బైకులు వచ్చేశాయి. అలాంటి టైమ్ లో ఆ సైకిల్ వాడు, తను ముందొచ్చానని రోడ్డు మధ్యలో నిలబడతాడా లేక తప్పుకుంటాడా?”
హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మను గ్రేట్ ఆంధ్ర అడిగిన ప్రశ్న ఇది. దీనికి ప్రశాంత్ అంతే సూటిగా సమాధానం ఇచ్చాడు.
“నేను రోడ్డు మధ్యలోనే ఉంటాను. తప్పుకోను. ఎందుకంటే, సైకిల్ పవర్, కారు కంటే ఎక్కువగా ఉండొచ్చు కదా. ఆ సైకిల్ తో గుద్దితే ఆ పెద్ద కారుకు కూడా సొట్ట పడొచ్చేమో కదా.”
కొన్ని రోజుల కిందట ప్రశాంత్ వర్మ ఇచ్చిన ఈ స్టేట్ మెంట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక్కడ కారు అంటే గుంటూరుకారం, సైకిల్ అంటే హను-మాన్ సినిమా.
గుంటూరుకారం సినిమాకు పోటీగా వచ్చిన హను-మాన్, ఆ సినిమా ధాటికి నిలవలేదని చాలామంది అనుకున్నారు. కానీ ప్రశాంత్ వర్మ భాషలోనే చెప్పాలంటే, సైకిలే బలంగా ఉంది, కారుకు సొట్టపడింది.
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవర్సీస్ లో కూడా హను-మాన్ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు జనం. అలా ఈ ఏడాది క్లియర్ సంక్రాంతి విన్నర్ గా నిలిచింది ఈ సినిమా. దీంతో కొన్ని రోజుల కిందట గ్రేట్ ఆంధ్రకు ఇచ్చిన ఇంటర్వ్యూ నుంచి ఈ క్లిప్ ను కట్ చేసి చాలామంది వైరల్ చేస్తున్నారు.