విడుదలకు సిద్ధమైన యాత్ర-2 సినిమాపై ఉన్నదున్నట్టు మాట్లాడాడు దర్శకుడు మహి వి రాఘవ్. జగన్ ముఖ్యమంత్రిగా గెలవకపోయినా యాత్ర-2 వచ్చి ఉండేదని అన్నాడు.
“వైఎస్ఆర్ మరణం నుంచి జగన్ ఎదిగిన విధానంలో చాలా డ్రామా నాకు కనిపించింది. అందుకే యాత్ర-2 కూడా చేయాలని ఎప్పుడో ఫిక్స్ అయ్యాను. ఇదే మాట జగన్ కు చెబితే నవ్వారు. 2018లో జగన్ ఓడిపోయినా కూడా యాత్ర-2 వచ్చేది. ఎందుకంటే, ఆ కథలో అంత డ్రామా ఉంది. జగన్ ఓడినా, గెలిచినా యాత్ర-2 ఐడియా నా దగ్గర ఉంది. జగన్ గెలవడం కథాపరంగా నాకు ప్లస్ అయింది. మంచి ఎండింగ్ ఇచ్చాను. 2018లో జగన్ ఓడిపోయి ఉంటే డిఫరెంట్ క్లయిమాక్స్ వచ్చి ఉండేది. అంతే తప్ప, సినిమా మాత్రం చేస్తాను. ఎందుకంటే, గెలుపు-ఓటమిని మినహాయిస్తే… సినిమాలో మిగతా భాగం ఏదీ మారలేదు.”
యాత్ర సినిమాతో పోలిస్తే, యాత్ర-2 తీయడం తనకు చాలా ఛాలెంజింగ్ గా అనిపించిందంటున్నాడు మహి వి రాఘవ్. ప్రస్తుతం రాజకీయంగా యాక్టివ్ గా ఉన్న జగన్ పై సినిమా తీయడంపై మంచి-చెడు ఎదుర్కోవాలని చెబుతున్నాడు.
“యాత్ర-2 తీయడం చాలా ఛాలెంజింగ్ అనిపించింది. ఎందుకంటే, ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న రాజకీయ నాయకుడిపై తీసిన సినిమా ఇది. అతడిపై ఉన్న ద్వేషం, అతడిపై చూపించే ప్రేమ విషయంలో స్పష్టమైన విభజన రేఖ ఉంది. అలాంటి వ్యక్తిపై ఎంత గొప్పగా సినిమా తీసినా ఓ 30శాతం మంది చెత్తగా ఉందంటారు. అది ఎంత చెత్తగా తీసినా మరో 30శాతం మంది అద్భుతం అంటారు. మిగిలిన 30శాతం మంది ఇదొక పొలిటికల్ సినిమా కాబట్టి వెళ్లాల్సిన అవసరం లేదంటారు. కాబట్టి దీన్ని ఓ కథగా చెప్పడం నాకు ఛాలెంజింగ్.”
జగన్ జీవితంలో ఉన్న వ్యక్తులందరీ యాత్ర-2లో కనిపించరని అంటున్నాడు ఈ దర్శకుడు. తన కథకు తగ్గట్టు, ఫిక్షన్ జోడించి కొన్ని పాత్రల్ని పెట్టానని చెబుతున్నాడు. చరిత్రలో రాజకీయ నాయకుడిపై తీసిన సినిమా గొప్పగా ఆడిన సందర్భం లేదని, యాత్ర-2ను తను ఎంత గొప్పగా తీసినా విమర్శలు వస్తాయనే విషయం తనకు తెలుసని అంటున్నాడు.