ఉత్తరాంధ్రలోని ఓ ప్రధాన పట్టణంలో ఓ థియేటర్. సైంధవ్ సినిమా వేసారు. మార్నింగ్ షో కి ఆరు వేలు కలెక్షన్.. క్యాంటీన్ బేరం సున్నా.. పార్కింగ్ ఆదాయం అంతంతే. సినిమా మార్చేసి హనుమాన్ వేసుకుంటా అంటారు థియేటర్ ఓనర్. సమస్యే లేదు. అగ్రిమెంట్ చేసారు జనం వున్నా లేకున్నా, హనుమాన్ మాత్రం వేయడానికి వీల్లేదు. అదీ ఉత్తరాంధ్ర థియేటర్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకున్న ‘కింగ్’ పిన్ హుకం.
హైదరాబాద్ ప్రసాద్స్ లో ఆల్ రెడీ హనుమాన్ టికెట్ లు ఫుల్ గా అమ్మేసిన షో ను క్యాన్సిల్ చేయడం. ఏం జరిగింది అంటే ఎవరూ మాట్లాడరు. అసలు అలా క్యానిల్ చేసే హక్కు థియేటర్ కు వుంటుందా?
అదే ప్రసాద్ లో గుంటూరుకారం, ఇతర సినిమాలకు కొన్ని షో లకు ముఫై, పాతిక టికెట్ లు తెగుతున్నా షో లు క్యాన్సిల్ చేయడం లేదు. సినిమా మార్చడానికి అనుమతి ఇవ్వడం లేదు.
నైజాంలో కలెక్షన్లు లేని చోట్ల కూడా థియేటర్లలో బొమ్మ మార్చకపోవడం అన్నది సరేసరి.
ఏమిటి ఇదంతా. ఛాంబర్.. కౌన్సిల్ ఏం చేస్తున్నాయి. సినిమా పెద్దల దృష్టిలో చిన్న సినిమా అయిన హనుమాన్ పెద్ద హిట్ అయిన తరువాత విదేశాల్లో అతి భారీ సినిమాల సరసన కూర్చున్న తరువాత కూడా, డొమస్టిక్ మార్కెట్ లో జరుగుతున్న అన్యాయాన్ని అలా సహిస్తూ వుంటాయా? గిల్డ్, ఇతరత్రా సంస్థలను గుప్పట్లో పెట్టుకున్న ‘కింగ్’ పిన్ ల ఆధిపత్యానికి తల వంచి మౌనంగా వుంటాయా?
ఇదే విషయమై వెంకటేశ్వర ఫిలింస్ భాగస్వామి దిల్ రాజును ప్రశ్నించగా, హనుమాన్ మినహా మిగిలిన సినిమాల నిర్మాతలు తమ సినిమాకు మరి ఒకటి రెండు రోజులు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారని, ఆ తరువాత హనుమాన్ కు షిఫ్ట్ చేస్తామని అన్నారు. హిట్ సినిమా వేయాలనే తమకు వుంటుందని, ఒకటి రెండు రోజుల్లో అంతా సెటిల్ అవుతుందని అన్నారు.
ఉత్తరాంధ్రలో తమ సంస్థ థియేటర్లు హనుమాన్ కు కొన్ని ఇచ్చామని ఆ జాబితా ఇస్తానని అన్నారు. ఐమాక్స్ లో హనుమాన్ షో క్యాన్సిల్ అయిన విషయం తనకు తెలియదన్నారు.
నిర్మాతల కౌన్సిల్ పెద్ద ప్రసన్న కుమార్ ను ప్రశ్నించగా, హనుమాన్ కు షోలు ఇవ్వకపోవడం, క్యాన్సిల్ చేయడం ముమ్మాటికీ తప్పే అన్నారు. ఈ విషయంలో తాము హనుమాన్ వైపే వుంటామన్నారు. ఈ మేరకు తాము ఇప్పటికే ఆసియన్ సునీల్, దిల్ రాజు లతో మాట్లాడామన్నారు. వెంటనే అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి, సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.