వాపు Vs బలుపు… నిర్మాతపై ట్రోలింగ్

గుంటూరుకారంపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ నడుస్తోంది. మహేష్ బాబు హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో, నాగవంశీ నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమాపై ఓ రేంజ్ లో మీమ్స్ పడుతున్నాయి. మరీ ముఖ్యంగా…

గుంటూరుకారంపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ నడుస్తోంది. మహేష్ బాబు హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో, నాగవంశీ నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమాపై ఓ రేంజ్ లో మీమ్స్ పడుతున్నాయి. మరీ ముఖ్యంగా నిర్మాత నాగవంశీ కేంద్రంగా చాలా విమర్శలు కనిపిస్తున్నాయి.

గుంటూరుకారం సినిమాపై విడుదలకు ముందు, విడుదల తర్వాత ఎక్కువగా మాట్లాడిన వ్యక్తి నాగవంశీ. సినిమా విడుదలకు ముందు అతడు మాట్లాడిన కొన్ని క్లిప్పింగ్స్ ను ఇప్పుడు పనిగట్టుకొని మరీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

“అంతన్నాడు, ఇంతన్నాడు..” అంటూ నాగవంశీ మాట్లాడిన వీడియోల్ని వైరల్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా రివ్యూస్ పై నాగవంశీ చేసిన కామెంట్స్ ను కూడా ప్రస్తావిస్తున్నారు. 2 రోజులాగి రివ్యూ ఇవ్వాలంటూ నాగవంశీ డిమాండ్ చేసింది ఇందుకేనా అంటూ దెప్పిపొడుస్తున్నారు. వాటిలో కొన్ని ఇక్కడ..

– చాలా మంది బలుపు అనుకుంటారు కానీ, ఓ మాట చెప్పాలని ఉంది. మా గుంటూరుకారం సినిమా, ప్రతి ఏరియాలో రాజమౌళి నంబర్లకు దగ్గరగా వెళ్తుంది. నాన్-రాజమౌళి రికార్డులకు దగ్గరగా ఉంటుంది. అలాంటి సినిమాల్లో ఇప్పటివరకు అల వైకుంఠపురం మాత్రమే టాప్ లో ఉంది. దానికి దగ్గరగా గుంటూరుకారం ఉంటుంది.

– ఓ సినిమాకు సమీక్ష, 2 రోజులు ఆగి రాస్తే పోయేదేముంది. వెబ్ సైట్ ఓపెన్ చేసి చదవాలనుకునేవాడు ఎలాగైనా కచ్చితంగా చదువుతాడు. ఆ టైపు ప్రేక్షకుడు శుక్రవారం సినిమా చూడకపోతే, వాడు శనివారమైనా రివ్యూ చూసే సినిమాకు వెళ్తాడు కదా. అందుకే కనీసం శుక్రవారమైనా రివ్యూలు ఇవ్వడం ఆపేయమని అడుగుతున్నాం.

– గుంటూరుకారం సినిమాకు ఏ రివ్యూ రాసినా, ఎలాంటి రివ్యూ ఇచ్చినా నాకు అభ్యంతరం లేదు. ఎలా చూసుకున్నా అది బ్లాక్ బస్టర్ సినిమా.

– రాజమౌళి రికార్డులకు దగ్గరగా ఉంటాం. అదే మాటకు కట్టుబడి ఉంటాం. జనవరి 12న థియేటర్లలో సినిమా చూసి, ఆ రోజు సాయంత్రం అంతా ఇదే మాట అంటారు.

– సినిమా అనేది ఓ వ్యాపారం. ఈ ఇండస్ట్రీలో సమీక్షకులు కూడా ఓ భాగం. పరిశ్రమలో అందరూ ఒకరికొకరు సహకరించుకోవాలి. కాబట్టి శుక్రవారం ఒక్క రోజు రివ్యూ ఆపితే మంచిదని నా ఉద్దేశం.

– ఈ రోజుల్లో రెండే కొలమానాలు. హిట్ సినిమా, ఫ్లాప్ సినిమా. ఆడితే ఏ రేంజ్ కు వెళ్తుందో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. ఆడకపోతే ఏ రేంజ్ ఫ్లాప్ అవుతుందో కూడా ఎవ్వరూ ఊహించలేకపోతున్నారు. హిట్ అయితే ఎక్కడికైనా వెళ్తుంది, ఫ్లాప్ అయితే ఇక దాని గురించి ఆలోచించక్కర్లేదు.

– టైటిల్ కార్డ్ పడినప్పట్నుంచే ట్విట్టర్ లో రివ్యూలు ఇచ్చేస్తున్నారు. ఎందుకంత తొందర. కనీసం శుక్రవారం వదిలేయండి, సినిమా ఎలా ఉందో ప్రేక్షకుల్ని డిసైడ్ చేయనివ్వండి.

– అల వైకుంఠపురములో తర్వాత త్రివిక్రమ్ చేస్తున్న సినిమా. ఆ సినిమా తర్వాత త్రివిక్రమ్-తమన్ కలిసి చేస్తున్న సినిమా. ఇక అతడు లాంటి క్లాసిక్, ఖలేజా లాంటి కల్ట్ తర్వాత మహేష్-త్రివిక్రమ్ చేస్తున్న సినిమా. ఇన్ని అంచనాల్ని అందుకోవడానికి మేం ఎంత కష్టపడుతున్నామో మీరే ఊహించుకోండి.

ఇలా రిలీజ్ కు ముందు నాగవంశీ ఇచ్చిన స్టేట్ మెంట్స్ అన్నింటినీ నెటిజన్లు మరోసారి తెరపైకి తీసుకొస్తున్నారు. ఈ స్టేట్ మెంట్స్ అన్నీ చూసి, మరోసారి ఫ్రెష్ గా స్టేట్ మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.