చంద్ర‌బాబు వ‌ద్ద ప‌వ‌న్ స్టామినా బ‌య‌ట‌ప‌డేదెన్న‌డు?

టీడీపీ- జ‌న‌సేన పొత్తు ఈనాటిది కాదు. చాన్నాళ్లుగా ఇది న‌డుస్తున్న క‌థే! ఇప్ప‌టికే లెక్క‌కు మించి స‌మావేశాలు జ‌రిగాయి. హైద‌రాబాద్ లోని చంద్ర‌బాబు, ప‌వ‌న్ ఇళ్ల‌ల‌లో వారి స‌మావేశాలు జరిగాయి. ఆ త‌ర్వాత రాజ‌మండ్రి…

టీడీపీ- జ‌న‌సేన పొత్తు ఈనాటిది కాదు. చాన్నాళ్లుగా ఇది న‌డుస్తున్న క‌థే! ఇప్ప‌టికే లెక్క‌కు మించి స‌మావేశాలు జ‌రిగాయి. హైద‌రాబాద్ లోని చంద్ర‌బాబు, ప‌వ‌న్ ఇళ్ల‌ల‌లో వారి స‌మావేశాలు జరిగాయి. ఆ త‌ర్వాత రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్ వేదిక‌గా కూడా ఈ పొత్తు పెళ్లి జ‌రిగింది. ఆ త‌ర్వాత సమ‌న్వ‌య క‌మిటీల‌న్నారు, చ‌ర్చ‌ల‌న్నారు, చాలానే జ‌రుగుతున్నాయి! ఇవ‌న్నీ ఎన్ని జ‌రిగినా, జ‌రుగుతున్నా.. ఇప్ప‌టి వ‌ర‌కూ చంద్ర‌బాబు జ‌న‌సేన‌కు కేటాయించే నియోజ‌క‌వ‌ర్గాలు ఎన్ని? అవేవీ అనే క్లారిటీ మాత్రం బ‌య‌ట‌కు రావ‌డం లేదు!

పెళ్లంటుంది, ప్రేమ అంటుంది.. నాతోనే అని క‌మిట్ కావ‌డం లేదురా చారీ.. అని అదుర్స్ లో బ్ర‌హ్మానందం బ‌య‌ట‌కొచ్చి మొర‌పెట్టుకున్న‌ట్టుగా ఉంది ప‌రిస్థితి. పొత్తంటారు, క‌లిసి పోటీ అంటారు.. తీరా ఎన్నిక‌ల‌కు గ‌ట్టిగా మూడు నెల‌ల‌కు మించి స‌మ‌యం లేదు.. ఇలాంటి స‌మ‌యంలో కూడా ఎవ‌రికి ఎన్ని సీట్లు అనే క్లారిటీ కూడా లేక‌పోవ‌డ‌మే ఇందులో విశేషం!

తెలుగుదేశం పార్టీతో పొత్తు అంటేనే..  అవ‌త‌ల పార్టీకి వాచిపోవ‌డం రొటీనే. చంద్ర‌బాబు నాయుడు ఎవ‌రినైనా ఎలాగైనా వెన్నుపోటు పొడ‌వ‌గ‌ల‌రు. దీనికి ఆయ‌న‌తో పొత్తుపెట్టుకున్న పార్టీలు ఏ మాత్రం మిన‌హాయింపు కాదు. బ‌హుశా జ‌న‌సేన‌కు కూడా ఎన్నిక‌ల నాటికి ప‌డేది అలాంటి పోటే.. అనేది చాలా స‌హ‌జంగా వినిపించే మాట‌! ఇందులో పెద్ద ఆశ్చ‌ర్యం కూడా లేదు. ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఎన్నిక‌ల్లోపే చంద్ర‌బాబు గ‌ట్టి పోటు వేయ‌క‌పోతే ఆశ్చ‌ర్యం కానీ, వేస్తే ఆశ్చ‌ర్య‌పోవ‌డానికి ఏమీ లేదు. ప‌వ‌న్ కు ఇప్ప‌టికీ చంద్ర‌బాబు నాయుడు వ‌ర‌స ప‌రీక్ష‌లు పెడుతున్నాడ‌ని స్ప‌ష్టం అవుతోంది.

ముందుగా ప‌వ‌న్ క‌ల్యాణ్ కు బీజేపీని పొత్తుకు ఒప్పించే ప‌రీక్ష పెట్టారు చంద్ర‌బాబు. క‌మ‌లం పార్టీని పొత్తుకు తీసుకురావ‌డానికి ప‌వ‌న్ ను బాగానే వాడారు, వాడుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ బీజేపీ నుంచి సానుకూల సూచ‌న‌లు ఏమీ లేవు! అద‌లా సాగుతూ ఉండ‌గానే.. ఇప్పుడు కాపుల్లో చీలిక లేకుండా అంద‌రినీ త‌న ప‌ల్ల‌కి మోసే బాధ్య‌త‌ను తీసుకోనేలా చూసుకోవ‌డం అనే బాధ్య‌త‌ను కూడా ప‌వ‌న్ కే అప్ప‌గించారు చంద్ర‌బాబు నాయుడు. అందులో భాగంగానే ముద్ర‌గ‌డ‌తో కూడా చ‌ర్చ లు జ‌రిపి, అంతా క‌లిసి చంద్ర‌బాబు ప‌ల్ల‌కి మోయ‌డానికి ఒప్పించే బాధ్య‌త ప‌వ‌న్ కు ఇచ్చిన‌ట్టుగా ఉన్నారు చంద్ర‌బాబు!

మ‌రి బీజేపీని ఒప్పించి, కాపుల‌ను మూకుమ్మ‌డిగా ఒప్పించుకుని వెళితే అప్పుడు చంద్ర‌బాబు వ‌ద్ద ప‌వ‌న్ కు విలువ పెర‌గొచ్చు. మ‌రి అలా పెరిగిన విలువ‌తో అయినా.. ప‌వ‌న్ క‌నీసం పాతిక సీట్ల‌ను సంపాదించ‌గ‌ల‌రా? అనేది అస‌లు ప్ర‌శ్న‌! తెలుగుదేశం లెక్క‌ల ప్ర‌కారం.. ప‌వ‌న్ కు టీడీపీ కేటాయించే సీట్లు 15! 160 సీట్లు త‌మ‌కే అని టీడీపీ ప‌దే ప‌దే చేసే ప్ర‌క‌ట‌న‌ల సారాంశం ఇదే! మ‌రి 15 నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేయ‌డం కోసం ప‌వ‌న్ ఇన్ని పాట్లు ప‌డుతున్నాడంటే అంత‌కు మించిని ఆశ్చ‌ర్యం ఉండ‌బోదు!

15 కాకుంటే.. ఇర‌వ‌య్యో, పాతిక సీట్ల‌ను చంద్ర‌బాబు నాయుడు ప‌వ‌న్ పై ద‌య‌ద‌లిచి కేటాయించినా.. వాటిల్లో టీడీపీ శ్రేణులు ఎలా ప్ర‌వ‌ర్తిస్తాయి?  వాటికి చంద్ర‌బాబు ఎలాంటి స‌ల‌హాలు ఇస్తార‌నేది శేష ప్ర‌శ్న! గ‌తంలో త‌ను పొత్తు పెట్టుకున్న పార్టీల‌కు ఝ‌ల‌క్ లు ఇచ్చేలా వారికి కేటాయించిన సీట్ల‌లో కూడా తెలుగుదేశం పార్టీ బీఫారాల‌ను పంచారు చంద్ర‌బాబు! ప‌లు చోట్ల టీడీపీ రెబ‌ల్స్ బ‌రిలోకి దిగి పొత్తులో ఉన్న పార్టీని తొక్కేశారు. రెబ‌ల్స్ క‌న్నా.. చంద్ర‌బాబే నాయుడు పొత్తు ధ‌ర్మ‌మా తొక్కా అన్న‌ట్టుగా మిత్ర‌ప‌క్షానికి కేటాయించిన సీట్ల‌లో టీడీపీ అభ్య‌ర్థుల‌కు బీఫారాలు ఇవ్వ‌డం అనేది ఆయ‌న‌కే సాధ్య‌మ‌యిన రాజ‌కీయం! ఏపీ రాజ‌కీయంలో అలాంటి విశ్వాస‌ఘాతుకం అనేది చంద్ర‌బాబుకే సాధ్య‌మ‌య్యే చ‌ర్య‌, మ‌రి అలాంటాయ‌న‌తో ప‌దేళ్లుగా రాజ‌కీయ స్నేహం చేస్తూ.. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్పుడు మ‌రోసారి పొత్తు ప్రాప‌కం కోసం ఆరాట‌ప‌డుతూ ఉన్నారు.

జ‌న‌వ‌రి రెండోవారం గ‌డిచిపోయింది. ఎన్నిక‌ల‌ నోటిఫికేష‌న్ రావ‌డానికి మ‌రో రెండు నెల‌ల స‌మ‌యం ఉంది. ఇప్ప‌టికీ జ‌న‌సేన‌కు చంద్ర‌బాబు కేటాయించే నియోజ‌క‌వ‌ర్గాలు ఎన్నో కూడా క్లారిటీ లేదు. ఒక‌వేళ క్లారిటీ వ‌చ్చినా జ‌రిగే అద్భుతాలు ఏమీ లేవ‌ని, జ‌న‌సేన‌కు కేటాయించే సీట్ల‌లో కూడా చంద్ర‌బాబు నాయుడు ఆ పార్టీలోకి పంపిన వారే పోటీ చేస్తార‌నే అభిప్రాయాలు వినిపించ‌డంలో కూడా ఆశ్చ‌ర్యం లేదు!

ఒక‌టి చంద్ర‌బాబు నాయుడు జ‌న‌సేన‌లోకి పంపిన వారు ఆ పార్టీ త‌ర‌ఫున పోటీ చేయ‌డం, జ‌న‌సేన‌కు కేటాయించిన సీట్లలో చంద్ర‌బాబు నాయుడే మ‌ళ్లీ టీడీపీ వాళ్ల‌కూ బీఫారాలు ఇవ్వ‌డం, కాక‌పోతే రెబ‌ల్స్ అన‌డం, వీలైతే అనంత‌పురం వంటి చోట ప‌వ‌న్ క‌ల్యాణ్ ను పోటీకి దించి.. ఎమ్మెల్యేగా  కూడా గెల‌వ‌కుండా చేయ‌డం వంటి వ్యూహాలు చంద్ర‌బాబు వ‌ద్ద ఉండ‌టంలో పెద్ద ఆశ్చ‌ర్యాలు ఉండ‌వు. ప్ర‌తి ఎన్నిక‌ల వేళ కూడా ఇలాంటి వికృత‌వికాట్ట‌హాసాలు చేయ‌డం చంద్ర‌బాబుకు కొత్త కాదు! ఇది చ‌రిత్ర చెబుతున్న వాస్త‌వం!