‘‘ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు..’’ అని ఆక్రోశించాడు మహా కవి శ్రీశ్రీ. వర్తమాన రాజకీయ చిత్ర విచిత్రాలను గమనిస్తోంటే ‘ఏవి తండ్రీ నాడు ఎరిగిన నైతికతా సిద్ధాంతములు’ అంటూ ఆవేదన కలుగుతుంది.
‘ఒకప్పట్లో..’ అంటూ గతించిపోయిన వైభవం గురించి సిగ్గుపడుతూ నెమరువేసుకోవాల్సిందే.. ఎందుకంటే వర్తమానంలో ఆ విలువల వైభవం లేనే లేదు. ఒకప్పట్లో రాజకీయ పార్టీ పుడుతున్నదంటే దానికి కొన్ని సిద్ధాంతాలుండేవి. ఆ సిద్ధాంతాలతో సారూప్యత ఉన్నవాళ్లు, అవి నచ్చినవాళ్లు మాత్రమే అందులో చేరేవాళ్లు. ఆ సిద్ధాంతాలే వారికి భగవద్గీత, ఖురాన్, బైబిల్ లాంటివి అయ్యేవి. వాటిని మీరేవారు కాదు. ఆ రకంగా ‘ఒకప్పట్లో పుట్టిన..’ పార్టీలతో సహా.. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీకైనా సిద్ధాంతాలు, విలువలు ఉన్నాయా? అంటే అనుమానమే.
ప్రజలు, సమాజం, సంఘహితం ఏ ఒక్కరికీ లక్ష్యం కాదు! అధికారమే ప్రతి ఒక్కరి పరమావధి! ధనదాహమే రాజకీయ పార్టీలకు పునాది! ప్రజాప్రతినిధులు ఒక పార్టీకి కట్టుబడకుండా.. విచ్చలవిడిగా అటుఇటు గెంతుతూ పార్టీలు అతితరచుగా, నిస్సిగ్గుగా ఫిరాయిస్తూ ప్రజలముందు తిరగగలుగుతున్నారంటే.. తమ చేతలను సమర్థిచుకుంటున్నారంటే పార్టీలే కారణం! పార్టీలకు సిద్ధాంతాల్లేవు.. నాయకులకు విలువల్లేవు! అందరిదీ ఒకటే రంధి.. అధికార దాహం, ధనదాహం!
వీళ్లంతా కలిసి చెదపురుగుల్లా చేరి మన ప్రజాస్వామ్య వ్యవస్థను లోలోపల పూర్తిగా సర్వనాశనం చేసేస్తున్నారు.
రాజకీయ పార్టీలు ఎందుకు పుడతాయి? మామూలు మనుషులు హఠాత్తుగా రాజకీయాల్లోకి ఎందుకు అడుగు పెడతారు? రాజకీయాల్లోకి ఎవరు అడుగుపెడుతున్నారు? ఇలాంటి ప్రశ్నలకు ఒకేరకమైన సమాధానాలు దొరకడం చాలా కష్టం. మన దేశ చరిత్రను చూసుకుంటే.. రాజకీయ పార్టీలు అనేవి.. పోరాడడం కోసం పుట్టాయి. ఇప్పుడు పాపులర్‌గా మనుగడలో ఉన్న పార్టీల గురించి ఆలోచిస్తే కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, వామపక్షాలు పోరాడడం కోసమే పుట్టాయి. వాటి పుట్టుకకు ఒక నిర్దిష్టమైన లక్ష్యం ఉంది. ఎలా ముందుకు సాగాలనే విషయంలో వారికి నిర్దుష్టమైన ప్రణాళిక ఉంది. వీటన్నింటినీ మించి ప్రతి పార్టీకి ఒక ‘సిద్ధాంతం’ ఉంది!
తాము ఏ పార్టీలో ఉన్నామో దాని యొక్క సిద్ధాంతం ఏమిటో ఆ పార్టీకి చెందిన ప్రతి నాయకుడికి పూర్తి అవగాహన ఉంది. ఆ సిద్ధాంతానికి అనుగుణంగా మాత్రమే నడుచుకోవాలనే నైతిక విలువలు అప్పటి నాయకుల్లో ఉన్నాయి. సిద్ధాంతానికి అనుగుణంగా లేని వారు పార్టీకి తగరని బయటకు పంపే కట్టుబాటు ఆ పార్టీల్లో ఉంది. ‘ఉంది’ అంటే తప్పు! ‘ఉండేది’ అనాలి! ఎందుకంటే అప్పటి పార్టీలు ఇప్పటికీ ఉన్నాయి! కానీ అప్పట్లో ఉన్న సిద్ధాంతాలూ, నైతికవిలువలూ, కట్టుబాట్లే ఎక్కడా కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదు!
ఒకప్పట్లో నాయకులు ఎక్కడినుంచి తయారయ్యేవారు? ప్రజలకోసం పనిచేస్తూ చేస్తూ.. ఆ పరిశ్రమకు, చేస్తూ ఉన్న ప్రజాసేవకు ఒక నిర్దిష్ట రూపం ఇచ్చే క్రమంలో భాగంగా నాయకులుగా తయారయ్యేవారు. తాము ఎలాంటి భావజాలంతో ఉన్నామో.. ఏ సిద్ధాంతానికి దగ్గరగా ఉన్నామో పోల్చుకుని ఆ పార్టీలో చేరేవారు.
మరి ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎలా ఉంటున్నాయి. మీకు బాగా తెలిసిన నాలుగైదు పార్టీలను గుర్తుచేసుకోండి. ఆయా పార్టీల మౌలిక సిద్ధాంతాలు ఏమిటో ఎన్నడైనా వారు ప్రకటించారా? ఆ సిద్ధాంతాల పట్ల తమకు చిత్తశుద్ధి ఉన్నదని నిరూపించుకున్నారా? అసలు పార్టీలకు సిద్ధాంతాలు ఉంటాయనే సంగతి కొత్తగా పార్టీలు పెడుతున్న వారికి ఎవరికైనా తెలుసా?
రాజకీయాల్లోకి అడుగు పెడుతున్న వ్యక్తులను పలకరించండి. ‘ఎందుకు రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నారు?’ అని ఒక్క ప్రశ్న అడగండి. బోలెడు సమాధానాలు వస్తాయి. ‘‘జీవితంలో చాలా సాధించాం. ఇక ప్రజాసేవ చేయాలని ఉంది.’’, ‘‘నన్ను ఇంత మహానుభావుడిగా గొప్పవాడిగా తయారుచేసిన సమాజానికి తిరిగి ఇవ్వాలని ఉంది’’, ‘‘నా దగ్గర తరగిపోని సంపద ఉంది. ఇక సంపాదించే మోజు లేదు. అందుకే ప్రజలకోసం సేవ చేయాలని అనుకుంటున్నా’’.. ఇంకా అలాంటి అనేకానేక జుగుప్సాకరమైన అసహ్యకరమైన పడికట్టు పదాలతో కూడిన అబద్ధపు జవాబులు వెల్లువెత్తుతాయి.
‘ఇప్పటిదాకా సమాజానికి చాలా సేవ చేస్తున్నాం.. ఇంకా గొప్పగా చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నాం’ అని చెప్పే ప్రబుద్ధులు కూడా ఉంటారు. వారి దృష్టిలో ప్రజాసేవ, సమాజం కోసం పనిచేయడం అంటే వేరు. స్కూలు పిల్లలకు నోటు పుస్తకాలు పంపిణీ చేయడం, స్కూళ్లలో మరుగుదొడ్లు కట్టించడం, ఎక్కడైనా ఒక బస్ షెల్టర్ నిర్మించడం, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయడం, బర్త్ డే రోజు అన్నదానం, యూత్ కోసం క్రికెట్ టోర్నీ… అంతే! ఇలాంటి పనులు నాలుగైదు చేయగానే ఇక ఎమ్మెల్యే అయిపోవడానికి, ఏదో ఒక పార్టీని ఆశ్రయించి ఎమ్మెల్యే టికెట్ అడగడానికి అర్హత వచ్చేసిందని అనుకుంటున్నారు.
సమాజసేవ అంటే అదేనా? వారు ఎన్నడైనా ఏదైనా ప్రజల సమస్య పరిష్కారం కోసం వారికి అండగా నిలబడ్డారా? ఒక సమస్య మీద పోరాడారా? ప్రజల కోసం పాటుపడ్డారా? అవేమీ ఉండవు. అలాంటివి చేయాలంటే వారికి భయం. రాజకీయం వైపు అడుగులు వేయగానే.. ఏ పార్టీలో చేరాల్సి వస్తుందో ఏమో.. ఇప్పుడు ఉద్యమాలు చేస్తే అధికారంలో ఉన్న పార్టీ తమమీద కక్ష కడుతుందని భయం. మరి వారు అనుకునే సేవను ఎలా చేస్తున్నారు?
ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనో, దళారీ పనుల ద్వారానో, చెమటా రక్తమూ చిందకుండా డబ్బు సృష్టించడం ఎలాగో అలవాటు అయిపోవడం వల్లనో.. హఠాత్తుగా, ఇంకా చెప్పాలంటే నడమంత్రంగా కుబేరులు అయిపోతున్నవారు అనేకులు ఉన్నారు. తమ జీవితకాలంలో అంత సునాయాసంగా ఖర్చు పెట్టలేనంత డబ్బు వారి వద్ద పోగుపడిపోతున్నది. దాన్ని ఖర్చు పెట్టడానికి, దానిని పెట్టుబడిగా వాడి.. ధన బలానికి అధికారబలాన్ని కూడా జత చేసుకుని భవిష్యత్ వారసుల కోసం ఇబ్బడిముబ్బడిగా ఆ సంపదను పెంచడానికి వారికి రాజకీయం అనేది ఒక దగ్గరిదారిగా కనిపిస్తున్నది!
ఒక చాలా సింపుల్ ప్రశ్న వేసుకుందాం. ఇవాళ్టి రోజుల్లో ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రాల్లో ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంలో నెగ్గడానికి అభ్యర్థి… టికెట్ పొందడం కోసం పార్టీకి సమర్పించుకునే ముడుపులు, తన గెలుపుకోసం పనిచేసే పార్టీ వారందరినీ మేపడానికి, ప్రజలందరి ఓట్లను కొనుగోలు చేయడానికి వెరసి కనీసం ఇరవై కోట్ల రూపాయలైనా ఖర్చు పెట్టి తీరాల్సిందే. దగ్గుబాటి వెంకటేశ్వరరావు లాంటి సన్యాసం తీసుకున్న సీనియర్లు.. 40-50 కోట్ల ఖర్చుకు సిద్ధపడాల్సి వస్తోందని అంటున్నారు కూడా!
ప్రజా సేవ చేయడమే లక్ష్యం అనే ముసుగులో ఎన్నికల్లో నెగ్గడానికి ఇరవై కోట్ల రూపాయలు సెలవు చేసే వ్యక్తి.. ఆ మాత్రం సొమ్మును నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనుల కోసం ఖర్చు పెడితే ఎలా ఉంటుంది? ఊహించుకోండి! ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంచుమించుగా అయిదు మండలాలు ఉంటాయి. సగటున ఒక్కో మండలంలో నాలుగు కోట్ల రూపాయల విరాళాలతో ఒక వ్యక్తి ‘స్వచ్ఛందంగా’ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే గనుక… ఆ నియోజకవర్గం మొత్తం అతణ్ని దేవుడిలా చూసుకుంటుందనడంలో సందేహం ఏమైనా ఉందా? ఎమ్మెల్యే అనే ట్యాగ్ లైన్ దక్కకపోవచ్చు గాక.. కానీ ప్రజలు దేవుడు గా భావించే మంచి పేరు దక్కుతుంది. కానీ.. ఈ ఔత్సాహిక రాజకీయ నాయకులు అందరికీ దేవుడు పదవి కంటె ఎమ్మెల్యే పదవే ముఖ్యమైనది. వారికి అదే కావాలి.
ఎందుకు? ఎమ్మెల్యే పదవిలో ప్రజాసేవ అనేది ఒక ముసుగు. సమాజసేవ అనేది ఒక సౌందర్యాత్మక వంచన! వారికి ఆ పదవి ఒక పెట్టుబడి! తాము పెట్టిన ఇరవై కోట్లను వంద కోట్లుగా మార్చుకోవడానికి ఉపయోగపడే జాక్‌పాట్! జాక్ పాట్ కొట్టిన వాడు ఎమ్మెల్యే అవుతాడు! ఓడినవాడు అయిదేళ్ల తరువాల మరోసారి గ్యాంబ్లింగ్ ఆడడానికి రెడీ అవుతూ ఉంటాడు. ఈ దుర్మార్గమైన పోకడే నడుస్తున్న చరిత్రలో నవీన రాజకీయ సిద్ధాంతం!
దిగజారుడుకు హేతువులు అవే!
వర్తమాన ఏపీ రాజకీయాలను చూస్తోంటే చాలా చిత్రమైన అభిప్రాయం కలుగుతుంది. ఇంతటి దిగజారుడు, చవకబారు రాజకీయాలు మరెక్కడైనా ఉంటాయా? అనే అనుమానం కూడా కలుగుతుంది. నాయకులందరూ అవకాశవాదులుగా మనకు కనిపిస్తున్నారు.
విజయమే లక్ష్యంగా ప్రతి పార్టీ కూడా పనిచేస్తుంది. ఇప్పుడు ఏపీలో ముఖ్యమంత్రి జగన్ కూడా అదే చేస్తున్నారు. గెలిచే అవకాశం లేదని తనకు అనిపించిన వాళ్లందరినీ పక్కన పెడుతున్నారు. చంద్రబాబునాయుడైనా అదే పనిచేస్తున్నారు. అక్కడ ఇంక రెండు పార్టీల సీట్ల పంచాయతీనే తెగలేదు కాబట్టి, అభ్యర్థుల కసరత్తు ఇంకా మొదలు కాలేదు కాబట్టి.. ఆయన ఎందరిని పక్కన పడేస్తున్నారన్నది అప్పుడే చర్చకు రావడం లేదు. సరే, ఇలా పక్కన పెట్టబడుతున్న నాయకులందరూ ఏం చేస్తున్నారు? తమను ఇన్నాళ్లు ఆదరించిన పార్టీ సరైన కారణాలు ఉండబట్టే తమను పక్కన పెట్టిందని నమ్ముతున్నారా? అవకాశం దక్కినా లేకపోియినా తాము అదే పార్టీలో కొనసాగాలనే నిబద్ధతను చూపిస్తున్నారా? అస్సలు లేదు. తక్షణం ఇంకో పార్టీని చూసుకుంటున్నారు. వైకాపా వారు తెదేపా/జనసేనలోకి, ఆ పార్టీల వారు వైకాపాలోకి జంపింగ్ చేసేస్తున్నారు. ఎందుకిలా జరుగుతోంది?
ఎందుకంటే.. పార్టీలకు సిద్ధాంతాలు లేవు. నాయకులకు విలువలు లేవు. ఇవాళ్టి రోజుల్లో రాజకీయం అనేది ధనదాహం, అధికార దాహం, అక్రమార్జన, అరాచకత్వం అనే వాటికి పర్యాయపదంగా మారిపోయింది.
ఒక పార్టీ నుంచి ఒక నాయకుడు వెళ్లిపోయాడంటే.. ‘వాడికి రాజకీయ జీవితం ప్రసాదించిన నాయకుడికి/ పార్టీకి వెన్నుపోటు పొడిచి వెళ్లిపోయారని’ ఆడిపోసుకుంటున్నారే తప్ప, ‘మా పార్టీలోని మౌలిక సిద్ధాంతానికి ద్రోహం చేసి.. ఆ మార్గంలో చేయదలచుకున్న ప్రజాసంక్షేమానికి చీడపురుగులాగా వెళ్లిపోయాడని’ అనగల దమ్ము ఏ ఒక్కరికీ లేదు. ఎందుకంటే.. పార్టీలకు సిద్ధాంతాలు లేవు. నాయకులకు విలువలు లేవు.
జ్ఞాపకాల్లో గర్వమూ దుఃఖమూ
జ్ఞాపకాలను నెమరు వేసుకుంటే కొంత గర్వమూ బోలెడంత దుఃఖమూ కలుగుతాయి. కాంగ్రెసు పార్టీ అనేది స్వాతంత్ర్య సాధన అనే లక్ష్యం కోసం పుట్టింది. ఆ తరువాత… సంఘహితాన్ని తమ పార్టీ మౌలిక సిద్ధాంతాల్లో అనేక రూపాలుగా చేర్చుకుంటూ మనుగడ సాగించింది. పేదల, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి అనేది సూత్రంగా పార్టీ మనుగడ సాగించింది. ఇప్పుడు కూడా వారి పాలనలో లేదా వారి మాటలలో అలాంటి పదాలు వినిపిస్తాయి. కానీ అవన్నీ కూడా జనాకర్షక మంత్రాలుగా మారిపోయాయి. అదొక దుఃఖం!
భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలతో పుట్టిన, సిద్ధాంతాలకు కట్టుబడిన పార్టీగా చెప్పుకుంటుంది. సభలో విశ్వాస తీర్మానం మీద ఓటింగు జరిగితే.. ఒక్కఓటు తేడాతో ఓడిపోయిన, కేవలం 13రోజల్లో పదవినుంచి దిగిపోయిన ప్రధానిగా అటల్ బిహారీ వాజపేయి ఇవాళ మనదేశచరిత్రలో నిలిచిపోయారు. ఆ రోజునాటికి లోక్ సభలో.. కేవలం ఒక్క సభ్యుడు మాత్రమే ఉన్న చిన్న పార్టీలు చాలానే ఉన్నాయి. అలాంటి వారిలో ఏ ఒక్కరిని ప్రలోభపెట్టి, మభ్యపెట్టి, బెదిరించి, లోబరచుకుని ఆ ఒక్కఓటును సాధించి ఉంటే.. ఆయన ప్రభుత్వం నిలబడేది.
కానీ వాజపేయి, ఆయన నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ఆ పనిచేయలేదు. తాము విలువలకు కట్టుబడిన, సిద్ధాంతాలు కలిగిన వారుగా నిలిచిపోయారు. అదొక గర్వకారణం. ఇప్పటి భారతీయ జనతా పార్టీలో ఆ పేరు మిగిలిందే తప్ప ఆ విలువలు మచ్చుకైనా ఉన్నాయా? ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. అక్కడ తమ పార్టీకి పిడికెడు సీట్లు ఉంటే చాలు.. అధికారంలో ఉన్న పార్టీని కుట్రలతో చీల్చి.. తాముకూడా కలిసి గద్దెనెక్కడానికి ప్రయత్నించే దిగజారుడు పార్టీగా అది రూపుమారిపోయింది కదా. అదొక దుఃఖం.
వామపక్ష పార్టీలను తీసుకుందాం. పోరాటాలే ఊపిరిగా పుట్టిన పార్టీలు అవి. అంతో ఇంతో కాస్త విలువలు మిగిలిఉన్నాయి గానీ.. దిగజారిపోయిన దాఖలాలే ఎక్కువ. ఇవాళ్టికి కూడా ఎన్నికల్లో తమకు లబ్ధి ఉంటుందో లేదో అనే పట్టింపు లేకుండా ప్రజాసమస్యల మీద వారు ఉద్యమిస్తుంటారు. అయితే మరో కోణంలో దిగజారిపోతున్నారు. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ తో పొత్తు కోసం ఎంత తహతహలాడారు. అది చెడగానే చెంగుమని గెంతి కాంగ్రెస్ పొత్తుల్లో కుదురుకున్నారు. చివరిదాకా బేరమాడి చెడిన తర్వాత సొంతంగా పోటీచేశారు. తమకు ఒక సిద్ధాంతం ఉంటుందనే విషయాన్ని వారు ఎంత ఈజీగా మర్చిపోతున్నారు? అనేది ఒక దుఃఖం.
వర్తమాన రాజకీయాలను ప్రజాసేవా రంగంగా చూడాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదు. ఇది పూర్తిగా ఒక దుర్మార్గమైన కార్పొరేట్ వ్యాపార రంగంగా మారిపోయింది. వీరిని సేవకులు అనడానికి సిగ్గుపడాలి. నాయకులు అని చెప్పడానికి ఇంకా ఎంతెంతో దిగజారాలి. ఇలాంటి అత్యంత హేయమైన నవీన రాజనీతికి కారణం ఒక్కటే.
పార్టీలకు సిద్ధాంతాలు లేవు.. నాయకులకు విలువలు లేవు!
..ఎల్. విజయలక్ష్మి