Advertisement

Advertisement


Home > Politics - Analysis

అమరావతిపై అమిత్ షా నయా నయవంచన!

అమరావతిపై అమిత్ షా నయా నయవంచన!

ఎన్నికల సీజన్ వస్తే చాలు అందరికీ వంచనతో కూడిన మాటలు వెల్లువలా వచ్చేస్తుంటాయి. ఎవరికి తోచినట్లుగా వారు పుంఖాను పుంఖాలుగా అబద్ధాలను వండి వార్చడానికి ఉత్సాహపడిపోతుంటారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏమాత్రం తక్కువ తినడం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను మభ్యపెట్టడానికి ఆయన అమరావతి ఆస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు.

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా అమరావతికి శంకుస్థాపన చేసినప్పుడు, కేంద్ర ప్రభుత్వం తరఫున ముఖ్యఅతిథిగా వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ ఎంత అవమానకరమైన కానుక ఇచ్చారో ప్రజలందరికీ ఇప్పటికీ గుర్తుంది. ఇప్పుడు మళ్లీ కేంద్రంలో మోడీని, రాష్ట్రంలో చంద్రబాబును గెలిపించండి.. చిటికెలో అమరావతిని రాజధానిగా పూర్తి చేస్తాము అనే తరహాలో అమిత్ షా కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు.

అమరావతిని మళ్లీ రాజధానిగా చేయడానికి మాత్రమే తమ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయని భీషణ ప్రతిజ్ఞ చేస్తున్న అమిత్ షా ఆ మాటలు చిత్తశుద్ధితో చెబుతున్నవేనని తెలుగు ప్రజల ఎదుట ఎలా నిరూపించుకుంటారు? తాను నిజాయితీగానే మాట్లాడుతున్నానని ప్రజలను నమ్మించడం ఎలాగో ఆయనకు తెలుసా? గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోగతి పట్ల ఎంతటి చులకన భావంతో వ్యవహరిస్తూ వచ్చిందో ప్రజలందరికీ గుర్తుంది. ఇప్పుడు అమిత్ షా ఒక అబద్ధపు హామీ చెప్పగానే ప్రజలందరూ ఎగబడి దానిని విశ్వసించడానికి పూనుకుంటారా.. అనేది అందరి మదిలో మెదులుతున్న సందేహం!

అసలు జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్ట్, అధికార వికేంద్రీకరణ మంత్రం ఏరకంగా చెడ్డవో ప్రజలకు తెలియజెబితే తప్ప, అమరావతిని ఏకైక రాజధానిగా ఉంచాలని మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. అలాంటి తార్కికమైన రాజకీయం అమిత్ షాకు అలవాటు లేదనే అనుకుందాం. ఆయన అమరావతిని రాజధానిగా చేయడానికి ఉత్సాహపడుతున్న నాయకుడే అనుకుందాం.

కనీసం ఆ శ్రద్ధనైనా ఆయన గతంలో ఎన్నడైనా నిరూపించుకున్నారా? చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని శంకుస్థాపన చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి చేయూత అందించారో.. అమిత్ షా కాస్త స్పష్టత ఇవ్వగలరా? కేంద్రం నుంచి ప్రత్యేకంగా రాజధాని కోసం ఒక్క రూపాయి అయినా విదిలించారా లేదా చెప్పగల ధైర్యం ఈ నాయకుడికి ఉందా అనేది ప్రజల ప్రశ్న.

రాజధాని సంగతి మాత్రమే కాదు. కేంద్రంలో నరేంద్ర మోడీని, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుని తిరిగి అధికారంలో కూర్చోబెడితే.. రెండేళ్లలోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఆయన అంటున్నారు. ఎంత ఘోరమైన వంచనతో కూడిన మాట ఇది. విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి ఖర్చయ్యే ప్రతి రూపాయిని కేంద్రమే వెచ్చించి పూర్తి చేయాల్సి ఉండగా.. ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేయకుండా ఆ ప్రాజెక్టు భవితవ్యం మొత్తం ప్రశ్నార్ధకం అయ్యేలాగా దుర్మార్గంగా వ్యవహరించినది కేవలం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం.

ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు తమ కూటమిలో భాగంగా ఉన్నాడు గనుక ఆయన నిధులు స్వాహా చేయడానికి అనుకూలంగా కేంద్రమే పనులు చేపట్టకుండా ఆయనకు వదిలేసిన దుర్మార్గమైన వైఖరి బిజెపిది. అలాంటి వాస్తవాలను ఈ ప్రజలు మరిచిపోయారని అనుకుంటున్నారో ఏమో. ఇప్పుడు మళ్లీ గెలిపిస్తే రెండేళ్లలో పూర్తి చేస్తామంటూన్నారు. కేవలం ఎన్నికలలో రాజకీయ లబ్ధి కోసమే ఇన్నాళ్లు పోలవరం ప్రాజెక్టుకు రూపాయి అయినా విదిలించకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని యాతన పెడుతూ వచ్చారా అనే అనుమానం అమిత్ షా మాటలను బట్టి  ప్రజలకు కలుగుతుంది.

ఢిల్లీలోని కమలం పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే కొత్తగా కల్లబొల్లి హామీలను ఇవ్వడం కాదు.. ముందు ప్రత్యేక హోదా సహా ఇప్పటిదాకా చేసిన ద్రోహాలకు సంజాయిషీలు చెప్పుకోవాలి .. అని ప్రజల డిమాండ్ చేస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?