ఆనందాన్ని ఎవరు కోరుకోరు.. అందరికీ అది కావాలి. కానీ ఏదీ ఉచితంగా రాదు. ఆనందం కూడా అంతే. ఎంతో కొంత త్యాగం చేయాల్సి ఉంటుంది. సంతోషకరమైన జీవితాన్ని గడపాలంటే కొన్నింటిని త్యాగం చేయక తప్పదంటున్నారు డైటీషియన్లు.
ఇకపై ఏది తినాలన్నా ఆలోచించి తినాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. శరీరానికి ఏది ఎక్కువైనా ముప్పే అంటున్నారు. తీపి పదార్థాలు అందరికీ ఇష్టమే. కానీ అతిగా తీపి తింటే ఒంట్లో షుగర్ పెరుగుతుంది. కూల్ డ్రింక్స్ అందరికీ ఇష్టం. కానీ అతిగా తాగితే శరీరం వ్యర్థాల కుప్పగా మారుతుంది.
ఇప్పుడంతా ప్రాసెస్ మయం. తినే ప్రతి ఆహార పదార్థం ప్రాసెస్ చేసిందే. ఇలాంటి ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల అధిక నష్టం సంభవిస్తోంది. ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల్లో రుచికోసం అదనపు రసాయనాలు కలుపుతారు. ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. రుచి కోసం అనారోగ్యకరమైన కొవ్వులు మిక్స్ చేస్తారు.
వీటికి ట్రాన్స్ ఫాట్స్ కూడా కలిశాయి. బాగా వేయించిన ఆహార పదార్థాల్లో, బేక్ చేసిన ఆహార ఉత్పత్తుల్లో ట్రాన్స్ ఫాట్స్ ఎక్కువగా ఉంటున్నాయి. వీటి వల్ల నరాలు బలహీనం అవుతాయి, మెదడు దెబ్బతింటుంది. ఇక కృత్రిమంగా తీపి అందించే మూలకాలు మెదడు సమస్యలకు కారణం అవుతాయి.
బేకరీల్లో దొరికే ప్రతి వస్తువులో రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. వైట్ బ్రెడ్, ప్యాస్ట్రీస్, కేక్స్, బిస్కెట్స్.. ఇలా అన్నింటిలో ఉండే రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ శరీరానికి హాని కలిగిస్తాయి. ఇక ఆల్కహాల్, కెఫిన్ గురించి తెలిసిందే. వీటిని సాధ్యమైనంతవరకు తగ్గించుకోవాలి.
అందరూ వ్యాయామాలు చేయరు. కనీసం వాకింగ్ చేసే వాళ్లు కూడా చాలా తక్కువ. దైనందిన జీవితంలో పడి కొట్టుకుపోతుంటారు. అలాంటివాళ్లు కనీసం తినే తిండి విషయంలోనైనా కాస్త అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. ప్రతి దానికి ప్రత్యామ్నాయం ఉందని, పైన చెప్పిన పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే జీవితంలో అంత ఆనందంగా ఉంటామని అంటున్నారు.