Advertisement

Advertisement


Home > Politics - Telangana

సింగిల్ ఎజెండాతో స్వతంత్ర అభ్యర్థి

సింగిల్ ఎజెండాతో స్వతంత్ర అభ్యర్థి

ఎన్నికల వేళ ప్రధాన పార్టీల అభ్యర్థుల కంటే స్వతంత్ర అభ్యర్థులే ఎక్కువగా కనిపిస్తుంటారు. రకరకాల కారణాల వల్ల స్వతంత్రులు తెరపైకి వస్తుంటారు. వీళ్లలో కొందరు రెబల్ అభ్యర్థులుంటే, మరికొందరు రాజకీయాలపై ఇష్టంతో పోటీ చేస్తుంటారు. అయితే మల్కాజ్ గిరీ సెగ్మెంట్ లో మాత్రం ఓ స్వతంత్ర అభ్యర్థి, సింగిల్ ఏజెండాతో ఎన్నికల బరిలో నిలిచాడు.

ఇతడి పేరు చిరిపిరెడ్డి రమేష్. దిల్ సుఖ్ నగర్ కు సమీపంలో ఉన్న చైతన్యపురి వద్ద ఇతడికి బండిపై ఓ టిఫిన్ సెంటర్ ఉండేది. ఇతడిలానే మల్కాజ్ గిరి సెగ్మెంట్ లో వేల మంది తోపుడు బండిపై చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

అయితే ఎన్నికల వేళ వీళ్ల రోడ్ సైడ్ వ్యాపారాలన్నీ రోడ్డున పడ్డాయి. ఎప్పటికప్పుడు అధికారులకు లంచాలు ఇచ్చుకంటూ, మరోవైపు కావాల్సిన పర్మిషన్లు తెప్పించుకుంటూ బండి లాగిస్తున్నప్పటికీ.. ఇలా జరగడంతో రమేష్ తట్టుకోలేకపోయాడు. గడిచిన 45 రోజులుగా ఉపాధి కోల్పోయిన ఈ చిరు వ్యాపారి, ఎలాగైనా రాజకీయ నేతలకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు.

అనుకున్నదే తడవుగా స్వతంత్ర అభ్యర్థిగా మల్కాజ్ గిరి సెగ్మెంట్ నుంచి ఎంపీ నామినేషన్ వేశాడు. ఎన్నికల సంఘం ఇతడికి అల్మరా గుర్తు కేటాయించింది. తనలా ఉపాధి కోల్పోయిన రోడ్డు సైడ్ వ్యాపారులంతా తనకు మద్దతివ్వాలని కోరుతున్నాడు రమేష్. ఈ మేరకు సెగ్మెంట్ మొత్తం గట్టిగా ప్రచారం చేస్తున్నాడు. ఈ సెగ్మెంట్ లో దాదాపు 1500 మంది చిరు వ్యాపారులు తమ ఉపాధి కోల్పోయినట్టు ఒక అంచనా.

భారతదేశంలోనే అత్యథిక ఓట్లు కలిగిన పార్లమెంట్ సెగ్మెంట్లలో మల్కాజ్ గిరి ఒకటి. ఈ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ తరఫున సునీతా మహేందర్ రెడ్డి, బీజేపీ నుంచి ఈటల రాజేందర్, బీఆర్ఎస్ నుంచి లక్ష్మారెడ్డి బరిలో ఉన్నారు. వీళ్లకు పోటీగా రమేష్ రంగంలోకి దిగడంతో వార్తల్లో వ్యక్తిగా మారాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?