చంద్రబాబు, పవన్‌కల్యాణ్, లోకేశ్‌లపై విమర్శలు చేయాలని వైసీపీ నేతలకు పార్టీ పెద్దలు సూచిస్తున్నారనేది నిజం. ఇటీవల కాలంలో కేవలం వేళ్లపై లెక్క పెట్ట కలిగే నాయకులు మాత్రమే టీడీపీ, జనసేన అధినేతలపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. మెజార్టీ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తమకెందుకులే అని మౌనాన్ని ఆశ్రయించారు.
వైసీపీ ప్రజాప్రతినిధులు ప్రత్యర్థులపై విమర్శలు చేయడానికి ముందుకు రాకపోవడం వల్లే, ప్రతిదానికీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడాల్సి వస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రత్యర్థులపై విమర్శల ప్రాతిపదికగా వైసీపీ లేదా జగన్‌పై ఆ నాయకుల నిబద్ధతను గుర్తిస్తామని అంటున్నారు. అలాంటి వారికే టికెట్ల విషయంలోనూ ప్రాధాన్యం వుంటుందని చెబుతున్నారు. ఈ లెక్కన చూస్తే… తెల్లారిన మొదలు సూర్యాస్తమయం వరకూ మంత్రి ఆర్కే రోజా తమ రాజకీయ ప్రత్యర్థులైన చంద్రబాబు, లోకేశ్, పవన్‌కల్యాణ్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుంటారు. ప్రత్యర్థుల నుంచి నీచమైన తిట్లు తిట్టించుకుంటుంటారు.
అయినా ఆమెకు ఒరిగిందేంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రోజాకు ఏ మాత్రం సంబంధం లేకుండా, ఆమెను వ్యతిరేకించే సొంత పార్టీ నేతలకు ఇష్టానుసారం పదవులు, అలాగే ఆర్థిక లబ్ధి చేకూరేలా పనులు ఇస్తున్నారు. ఉదాహరణకు ఆర్.చక్రపాణిరెడ్డికి శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గా నియమించారు. అలాగే నగరి మాజీ మున్సిపల్ చైర్మన్ కేజే శాంతికి రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్ చైర్‌పర్సన్ పదవి దక్కింది.
అలాగే శాంతి భర్త, మున్సిపల్ మాజీ చైర్మన్ కేజే కుమార్‌కు నగరి నియోజకవర్గంలో మైన్స్ కట్టబెట్టారు. నగరిలో రోజాకు వ్యతిరేకంగా ప్రతి మండలంలోనూ నాయకులను పార్టీ పెద్దలే ప్రోత్సహిస్తున్నారు. రోజా వ్యతిరేక వర్గీయులను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నారు.
ప్రత్యర్థులపై విరుచుకుపడే రోజాకు వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న గౌరవం ఇది. ప్రత్యర్థులపై విమర్శలు చేయలేదని కొందరికి టికెట్లు నిరాకరించడంలో అర్థం వుందా? అనే ప్రశ్న వినిపిస్తోంది.