పవన్ కల్యాణ్ ఈ ఎన్నికల్లో ప్రధానంగా కాపు ఓట్ల మీదనే ఆధారపడి రాజకీయం చేస్తున్నారనే సంగతి అందరికీ తెలుసు. పైకి తనకి కులాల పట్టింపులేనేలేదని, రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలను తాను ఉద్దరించేస్తానని ఆయన అంటుంటారు గానీ.. చేసేది మాత్రం వేరు.
కేవలం కాపు ఓట్లు బలంగా ఉన్న నియోజకవర్గాల మీదనే ఆయన కన్నేస్తున్నారు. కాపు ఓట్లను సమీకరించడానికి ప్రయత్నిస్తున్నారు. తనమీద తీవ్రమైన విమర్శలు చేసిన ముద్రగడ పద్మనాభం ఇంటికి వెళ్లి, ఆయనను తన పార్టీలో చేర్చుకోవడానికి అనేక మెట్లు దిగి ప్రయత్నించడం కూడా.. కాపు ఓట్లు చీలకుండా జనసేనకు దక్కేలా చేసుకోవడానికి మాత్రమే.
అయితే.. ఒక్క నిర్ణయం మాత్రం.. ఆయనకు కాపుల ఓట్లను గణనీయంగా దూరం చేస్తుందేమోననే అభిప్రాయం పలువురిలో కలిగిస్తోంది. అదే వంగవీటి రాధాకృష్ణను నమ్మించి మోసం చేయడం.
రాష్ట్రంలో కాపులు అందరూ కూడా వంగవీటి రంగాను ఆరాధ్యుడిగా చూస్తారు. ఆయన కొడుకు రాధాకు కూడా కాపుల్లో అంతే క్రేజ్ ఉంది. అయితే రాధా టెక్నికల్ గా తెలుగుదేశంలో ఉన్నప్పటికీ.. చాలా కాలంగా ఆ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. ఆయన జనసేనలో చేరుతారని గత ఏడాది ముమ్మరంగా ప్రచారం జరిగింది.
మచిలీపట్నం ఎంపీ సీటును వంగవీటి రాధాకృష్ణకు ఇవ్వడానికి పవన్ కల్యాణ్ ఆఫర్ చేశారని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు సీన్ మారింది. రాధా పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.
వైయస్ఆర్సీపీ తరఫున గెలిచిన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఆ పార్టీకి రాజీనామా చేశారు. జనసేనలో చేరబోతున్నట్టు ఆయన ప్రకటించారు కూడా. నిజానికి ఆయన గుంటూరులో ఎంపీ సీటు ఆశిస్తున్నప్పటికీ.. ఆ జిల్లాలో సీటును జనసేనకు కేటాయించే పరిస్థితి లేదు. దీంతో మచిలీపట్నం నుంచే ఆయనను మళ్లీ ఎంపీగా బరిలోకి దించడానికి జనసేన ప్రతిపాదిస్తున్నదని వార్తలు వస్తున్నాయి. అంటే వంగవీటి రాధాకు ప్రామిస్ చేసిన అవకాశం విషయంలో మాట తప్పినట్టే.
రాష్ట్రంలోని కాపులు అందరూ కూడా పార్టీలకు అతీతంగా వంగవీటి కుటుంబాన్ని ఇష్టపడతారు. రాధాను కూడా అభిమానిస్తారు. అలాంటి రాధాకు స్వయంగా పవన్ కల్యాణ్ ఇలాంటి మోసం చేస్తే.. కాపు వర్గంలో కొంత శాతం ఓట్లు ఆయనకు దూరమయ్యే అవకాశం ఉన్నదని పలువురు అంచనా వేస్తున్నారు.
కాపులు ఆగ్రహించకుండా రాధాకు పవన్ కల్యాణ్ ఎలాంటి ప్రత్యామ్నాయ అవకాశం కల్పిస్తారు అనేదాన్ని బట్టి.. సమీకరణాలు మారుతాయి. ప్రస్తుతానికి రాధా తెలుగుదేశంలోనే ఉన్నందున చంద్రబాబును ఒప్పించి అక్కడే ఇంకేదైనా అవకాశం కల్పిస్తారేమో కూడా చూడాలి.