5వారాలు గడిచాయి.. అప్పుడే కూల్చివేత ముహూర్తం!

తెలంగాణలో పదేళ్లు సాగిన కేసీఆర్ పరిపాలనకు చరమగీతం పాడేసి.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా డిసెంబరు 7వ తేదీన పదవీ స్వీకార ప్రమాణంచేశారు. ఇప్పటికి సరిగ్గా అయిదు వారాలు మాత్రమే గడచింది.…

తెలంగాణలో పదేళ్లు సాగిన కేసీఆర్ పరిపాలనకు చరమగీతం పాడేసి.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా డిసెంబరు 7వ తేదీన పదవీ స్వీకార ప్రమాణంచేశారు. ఇప్పటికి సరిగ్గా అయిదు వారాలు మాత్రమే గడచింది. అప్పుడే ఆయన ప్రభుత్వం ఎప్పుడు కూలిపోబోతున్నదో అందుకు ముహూర్తం కూడా నిర్ణయించేస్తున్నారు రాజకీయ ప్రత్యర్థులు.

ఎలా కూలిపోబోతున్నదో కూడా జోస్యం చెబుతున్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చాలా మంది భారాస అధినేత కేసీఆర్ తో టచ్ లో ఉన్నారని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.

కేసీఆర్ కాంగ్రెసు ఎమ్మెల్యేలను కొంటున్నారని బండి సంజయ్ అంటున్నారు. తొలినుంచి కూడా కేసీఆర్ మీద వీరబీభత్స స్థాయిలో విరుచుకుపడుతూ ఉండే బండి సంజయ్ కుట్రలకు కేరాఫ్ అడ్రస్ కేసీఆర్ అని వ్యాఖ్యానించడం విశేషం.

అసలు ప్రభుత్వం మనగలగాలంటే కాంగ్రెస్ పార్టీ వారు కేసీఆర్ కదలికల మీద నిఘా పెట్టాలని కూడా బండి సలహా ఇస్తున్నారు. బండి సంజయ్ ఎన్నికల సమయంలోనే, కేసీఆర్ గురించి ఇలాంటి మాటలు చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థులు పలువురికి భారాస ఎన్నికల ఖర్చులకు నిధులు సమకూరుస్తోందని, టికెట్లు ఇప్పిస్తోందని ఆయన అప్పట్లో ఆరోపించారు.

భారాస- కాంగ్రెస్ మధ్య లోపాయికారీ బంధం ఉందనేందుకు అప్పట్లో ఆ ఆరోపణలు చేశారని అంతా అనుకున్నారు. కానీ.. ఇప్పుడు కూడా.. కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు ఎమ్మెల్యేలను కొంటున్నారని, అది పార్లమెంటు ఎన్నికల తర్వాత జరుగుతుందని అనడంతో చర్చ ఆసక్తికరంగా మారుతోంది.

అయితే రేవంత్ ప్రభుత్వం కూలిపోతుందనే ఈ ప్రచారానికి కాంగ్రెస్ వైపునుంచి దీటైన కౌంటర్లే వస్తున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్ చేసే ధైర్యం ఎవ్వరికీ లేదని, బీఆర్ఎస్ అంత సాహసం చేయదని మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. విఫల ఎంపీలలో దేశంలోనే బండి సంజయ్ నెంబర్ వన్ అని అంటున్న పొన్నం.. రాముడి కటౌట్లతో ఓట్లు అడుగుతున్న బిజెపిపై విరుచుకుపడ్డారు.

అయితే.. తమ ప్రత్యర్థి పార్టీ అధికారంలోకి వస్తే.. వారి ప్రభుత్వాన్ని కూల్చడానికి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే, ఆ పార్టీని రెండు ముక్కలు చేసే టెక్నిక్స్ అలవాటైన భాజపా.. తెలంగాణలో వారికి సొంతంగా చాలా పరిమితమైన బలం ఉండడంతో అలాంటి పని కూడా చేయలేక.. ఆ పనిచేయడంకోసం కేసీఆర్ ను పురిగొల్పుతున్నట్టుగా బండి సంజయ్ వ్యాఖ్యలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనే శ్రద్ధ కేసీఆర్ కు ఉన్నదో లేదో గానీ.. అవకాశం వస్తే బిజెపి మాత్రం వదులుకోదని జనం నవ్వుకుంటున్నారు.