పాదయాత్ర చేసినా.. ప్రజల వద్ద గుర్తింపు రావడం మాటేమో కానీ, తెలుగుదేశం అభ్యర్థుల ఎంపికలో లోకేష్ ఇంకా జూనియర్ గానే మిగిలిపోతున్నట్టుగా ఉన్నాడు! తెలుగుదేశం- జనసేన పొత్తు నేపథ్యంలో లోకేష్ కు దక్కుతున్నది జూనియర్ ఆర్టిస్ట్ వేషమేలాగుంది!
పాదయాత్రలో ఒక దశలో లోకేష్ అభ్యర్థులను ప్రకటించారు. అయితే అది ఒకటీ రెండు నియోజకవర్గాల్లోనే! ఆ తర్వాత వివిధ నియోజకవర్గాల్లో ఆశావహుల చేతులు పట్టుకుని పైకి ఎత్తాడు కానీ, వారే అభ్యర్థులనే ప్రకటన చేసే సాహసం చేయలేదు! అది కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా అక్కడ పాదయాత్రకు డబ్బులు ఖర్చు పెట్టుకున్న వారిని అభ్యర్థులుగా ప్రకటించలేదు లోకేష్!
ఇక ఎన్నికలకు దగ్గరబడుతున్న తరుణంలో తెలుగుదేశం అభ్యర్థుల విషయంలో లోకేష్ ప్రమేయం పెద్దగా లేకుండా పోతోందని స్పష్టం అవుతోంది. బయట జరిగే ప్రచారం.. జనసేనతో పొత్తు లోకేష్ కు ఇష్టం లేదనేది! కావాలంటే సోలోగా తేల్చుకోవాలనే ఆసక్తి లోకేష్ ఉన్నా, చంద్రబాబు ధోరణి, కమ్మ సామాజికవర్గం లోలోపలి ఒత్తిళ్ల ఫలితంగా టీడీపీ- జనసేన పొత్తుకు అవకాశాలు ఏర్పడ్డాయి. ఎలాగూ పవన్ కూడా ఇది కోరుకున్నదే! అసలు కోరుకోనిది మాత్రం లోకేష్ అంటారు!
జనసేనతో పొత్తునే ఇష్టపడని లోకేష్ అభ్యర్థుల ఎంపిక విషయంలో అస్సలు జోక్యం చేసుకుంటున్నట్టుగా లేరు. ఎవరకీ హామీలు ఇవ్వడం కానీ, తనకంటూ ఒక టీమ్ ను ఏర్పాటు చేసుకునే ప్రయత్నం కానీ లోకేష్ తరఫున జరుగుతున్నట్టుగా లేదు! మరి అంత పాదయాత్ర చేసి.. పట్టుమని పదిమందిని తను చెప్పిన వారికి టికెట్ లు ఇప్పించుకున్నారనే పేరును కూడా లోకేష్ తెచ్చుకోలేకపోతుండటం గమనార్హం. ఇక ఎన్నికల ప్రచారం విషయంలో కూడా.. పవన్ కల్యాణ్ హైలెట్ కావాల్సిందే తప్ప, లోకేష్ కు అవకాశం ఉండకపోవచ్చు!
ఇలా ఎదిగొచ్చిన కొడుకు కన్నా.. అలా దత్తపుత్రుడినే చంద్రబాబు నమ్ముకుంటున్నట్టుగా ఉన్నారు. సొంతపుత్రుడి కన్నా.. దత్తపుత్రుడికే చంద్రబాబు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారనే విషయాన్ని సామాన్యులు కూడా గొణుక్కోవడంలో పెద్ద వింత లేదు! పరిణామాలు అలా ఉన్నాయి మరి!