ఏది చేసినా అతిగా చేయడం తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు అలవాటు! చంద్రబాబు రాజకీయం విషయంలో అతి జాగ్రత్తగా ఉంటారని అనే అంటూ ఉంటారు. ఏ అవకాశాన్నీ వదులుకోకుండా అన్ని అవకాశాలనూ వాడుకుంటూ ఉంటారని చంద్రబాబు విజయాలను గమనించిన వారు అంటూ ఉంటారు. 2014లో చంద్రబాబు నాయుడు మోడీ, పవన్ వంటి వాళ్ల కాళ్లూ గడ్డాలు పట్టుకోకపోయి ఉంటే.. టీడీపీ కథ అప్పటికే ముగిసేదనడంలో పెద్ద ఆశ్చర్యం లేదు.
మరి పదేళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు మళ్లీ అదే పని చేస్తూ ఉన్నారు. పవన్ కల్యాణ్ ఎలాగూ చంద్రబాబు చేతిలోనే అప్పటి నుంచి కొనసాగుతూ ఉన్నారు. అవసరానికి తగ్గట్టుగా పవన్ ను చంద్రబాబు వాడుకుంటూ వస్తున్నారు! అయితే.. ఇప్పుడు ఏకులా వచ్చిన పవన్ మేకులా తయారైతే తెలుగుదేశం పరిస్థితి ఏమవుతుందనేది ఆసక్తిదాయకమైన అంశం!
జనసేనకు కనీసం 60 సీట్ల వరకూ సాధించుకుంటేనే కాపు ఓట్లు తెలుగుదేశం పార్టీకి ట్రాన్స్ ఫర్ అవుతాయని కాపు పెద్ద మనుషులే బాహాటంగా అంటున్నారు. పవన్ కు అన్ని సీట్లు తీసుకునే ఆసక్తి కానీ, ఆశ కానీ లేదనేది కూడా బహిరంగ సత్యమే! ఇప్పుడు మధ్యలో కాపు పెద్ద మనుషుల కామెంట్లతో అదో చర్చగా మారింది. నంబర్ 60 వరకూ చేరడంతో.. రేపు చంద్రబాబు 30 సీట్ల వరకూ కేటాయించినా సగమే అవుతుంది!
కాపుల కోరిక పవన్ సీఎం కావాలనేది, పవన్ కోరిక మాత్రం అలాంటిదేమీ లేదు. జగన్ ను దించేతే ఆయన అహం చల్లబడుతుంది. ఆ తర్వాత మళ్లీ ఐదేళ్ల పాటు ఆయన దేన్నీ పట్టించుకోకపోవచ్చ కూడా! మరి ముప్పై సీట్లే కేటాయిస్తే.. కాపుల ఓట్లు బదిలీ కావనే అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి!
ఒకవేళ ముప్పై సీట్లను టీడీపీ అధినేత కేటాయించినా, ఆ మేరకు టీడీపీ తన స్థానబలిమిని కోల్పోవడం మొదలైనట్టే! బీజేపీకి గతంలో సీట్లను కేటాయించిన అనుభవం ఉంది చంద్రబాబుకు. అయితే బీజేపీ వేరు, జనసేన వేరు! కాపుల కులాభిమానం మెండుగా ఉందనుకుంటున్న జనసేనకు గనుక 30 సీట్లు కేటాయించి పోటీ చేయించినా.. దానికో బేస్ మెంట్ బలంగా వేసిఇచ్చినట్టుగా అవుతుంది!
ఎన్నికలంటే అవి 2024లో జరగబోయేవి మాత్రమే కాదు! ఈ సారికి బయటపడితే చాలు అని.. చంద్రబాబు అనుకోవచ్చు. బహుశా చంద్రబాబే చెప్పుకున్నట్టుగా ఆయనకు చివరి ఎన్నికలు కావొచ్చు. ఈ సారి ఎలాగైనా గెలిచేసి సీఎం పీఠం ఎక్కేసి, ఆ తర్వాత తన కొడుకును సీట్లో కూర్చోబెడితే తన బాధ్యత తీరిపోతుందని చంద్రబాబు అనుకోవచ్చు! అయితే.. దీర్ఘకాలంలో ఈ పొత్తు తెలుగుదేశం పుట్టి ముంచదనడంతో పెద్ద ఆశ్చర్యం లేదు!
కేవలం జనసేనే కాదట.. బీజేపీని కూడా కచ్చితంగా పొత్తులో దించుతారని.. ఆ పార్టీకి ఎంపీ సీట్లను ఎరగా వేయనున్నారని కూడా క్లారిటీ వస్తోంది.
2014లో నాటి బీజేపీ కాదు అది, జనసేన కూడా 2014 నాటిది కాదు.. చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. అప్పటిలా ఆటలు ఆడితే చంద్రబాబును మడత పెట్టి ఆ పార్టీలు తెలుగుదేశం పార్టీని మింగేయగలవు కూడా! మరి ఇదంతా చంద్రబాబుకు కూడా తెలియనిది కాదు. అయితే ఇంతకు మించి గత్యంతరం లేదు! సొంతంగా వెళ్లి గెలిచే చేవ కానీ, ప్రజల మద్దతు పొందడం కానీ చంద్రబాబుకు చేతకాదు. సొంతగా గెలుపు సాధ్యం కాదని తెలిసి.. తెలుగుదేశం పార్టీని గుల్ల చేసి అయినా మరోసారి అధికారంలో ఉన్నట్టుగా అనిపించుకోవడానికి చంద్రబాబు పాట్లు పడుతున్నారు!
మరి ఇంతజేసీ.. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తే.. ఆ ఐదు లక్షల ఓట్ల తేడాతో అయినా 2014లోగా అధికారం అందుతుందా అంటే.. జగన్ కూడా 2014 నాటి జగన్ కాదు, అతడూ 2024 నాటికి రాటుదేలిన వాడే!