భారతీయ జనతా పార్టీ ముందు ఇప్పటికే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పలు దఫాలుగా సాగిలా పడారు! రకరకాలుగా కమలం పార్టీ నేతలను మెప్పించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు అయితే చేశారు. పచ్చమీడియా కూడా ఆ విషయాన్ని హైలెట్ చేసింది. త్వరలోనే చంద్రబాబును మోడీ ఢిల్లీకి పిలిపించుకొనబోతున్నాడని రెండేళ్ల కిందటే ప్రచారం చేసి పెట్టింది. ఆ తర్వాత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాకా ఇక దేశంలో బీజేపీకి చంద్రబాబు తప్ప మరో దిక్కులేదన్న రీతిలో పచ్చ బ్యాచ్ హడావుడి చేసింది. అయితే ఇప్పటి వరకూ చంద్రబాబును బీజేపీ అధినాయకత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు!
అక్కడకూ ఏపీ బీజేపీ నిండా చంద్రబాబు శ్రేయోభిలాషులే ఉన్నారు. బంధువులు, కులబాంధవులు, తనే స్వయంగా బీజేపీలోకి పంపిన వారు.. ఇలాంటి వారే ఏపీ బీజేపీలో ఉన్నారు. వీరు ఈ పాటికి చంద్రబాబుతో పొత్తు తమకు ఎంత అవసరమో అధినాయకత్వానికి ఎంతలా చెప్పి ఉంటారో అంచనా వేయొచ్చు! అయినా చంద్రబాబుతో పొత్తుకు కమలం పార్టీ హైకమాండ్ పెద్ద ఆసక్తితో ఉన్నట్టుగా లేదు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇప్పటికే చంద్రబాబు తరఫున బీజేపీతో పొత్తు కోసం పవన్ కల్యాణ్ కూడా బోలెడన్ని పాట్లు పడ్డాడు. బాహాటంగా ఇదే విషయాన్ని ఆయనా చెప్పాడు! చంద్రబాబుతో కలిసి వెళ్లడమే తమకు మంచిదన్నట్టుగా పవన్ కల్యాణ్ పలుసార్లు బాహాటంగానే వ్యాఖ్యానించాడు. తనకు రోడ్ మ్యాప్ ఇవ్వలేదంటూ బీజేపీని నిందించారు పవన్. అయితే బీజేపీ హైకమాండ్ మాత్రం పవన్ కోరిన రోడ్ మ్యాప్ ను ఇప్పటి వరకూ ఇవ్వలేదు!
ఇలాంటి నేపథ్యంలో.. ఇక ఎన్నికలకు పెద్దగా సమయం లేని నేపథ్యంలో.. ఇంకో మారు పవన్ ను చంద్రబాబు ఢిల్లీకి పంపుతున్నట్టుగా తెలుస్తోంది. ఢిల్లీకి వెళ్లి పొత్తుల విషయంలో పవన్ చంద్రబాబు తరఫున చివరి ప్రయత్నం చేయబోతున్నట్టుగా సమాచారం. ఒకవైపు తను ఎన్డీయేలో ఉన్నట్టుగా ఆ మధ్య సమావేశాలకు వెళ్లి, ఇవతల చంద్రబాబుతో పొత్తు ప్రకటించాడు, సీట్ల చర్చలు కొనసాగిస్తున్నారు పవన్. బీజేపీ ఏపీ నేతలేమో పవన్ తమ మిత్రపక్షమే అని చెబుతున్నారు. మరి అధినాయకత్వం మనసేంటో తెలుసుకోవడానికి పవన్ చంద్రబాబు తరఫున చివరి ప్రయత్నానికి రెడీ అవతున్నారట!
ఈ విషయంలో కూడా చంద్రబాబు పవన్ కు గట్టిగానే పాఠం చెప్పి పంపిస్తున్నాడని, గతాన్ని మరిచిపోయి తనతో చేతులు కలపాల్సిందిగా బీజేపీ నేతల వద్దకు పవన్ ను చంద్రబాబు రాయబారిగా వాడుకుంటున్నారని స్పష్టం అవుతోంది. ఇకపై అలాంటి ద్రోహాలు చేయమని ఇద్దరి తరఫునా పవన్ పూచీ ఇవ్వనున్నారు కాబోలు! అలాగే కోరినన్ని ఎంపీ సీట్లు ఇవ్వడానికి కూడా వీరు బీజేపీకి బంపర్ ఆఫర్ ఇవ్వనున్నారట! మొత్తానికి చంద్రబాబుకు పవన్ భలే దొరికాడబ్బా!