విశాఖలో సంక్రాంతి సంబరాలను బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు నిర్వహిస్తున్నారు. ఆయన నాలుగు రోజుల పాటు ఈ వేడుకలను పెద్ద ఎత్తున చేస్తున్నారు. అయితే ఈ వేడుకలను ఎస్ బిఐ సొమ్ముతో చేస్తున్నారు అని సీపీఎం తీవ్ర ఆరోపణలు చేసింది. ఎస్ బిఐ సొమ్ముతో సంక్రాంతి సంబరాలా అంటూ సీపీఎం విశాఖ జిల్లా కమిటీ కార్యదర్శి ఎం జగ్గు నాయుడు ఆరోపణలు గుప్పించారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సొమ్ము తో బీజేపీ ఎంపి జీవీఎల్ నరసింహారావు సంక్రాంతి సంబరాలు నిర్వహించటానికి సీపీఎం విశాఖ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తోందని ఆయన అన్నారు. దీనిపై ఎస్ బిఐ అధికారులు తక్షణం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తన రాజకీయ లబ్దికోసం బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవిఎల్ ఎస్ బిఐ సిఎస్ఆర్ నిధులను సంక్రాంతి సంబరాలు పేర దుర్వినియోగం చేస్తున్నారని ఆయన విమర్శించారు
సంక్రాంతి సంబరాలు నిర్వాహణకు అయ్యే మొత్తం ఖర్చును ఎస్.బిఐ అధికారులపై వత్తిడి తీసుకొచ్చి లక్షల రూపాయలు అక్రమంగా దొడ్డి దారిన ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. నిజానికి చూస్తే కనుక నిబంధనల ప్రకారం విద్యా, వైద్యం, ప్రజల అత్యవసర అవసరాలు, ప్రజా సంక్షేమానికి వినియోగించాలని గుర్తు చేశారు.
సిఎస్ఆర్ నిధులను అధికారులను బెదిరించి తమ రాజకీయ స్వార్థ ప్రయోజనం కోసం బీజేపీ వినియోగించటం పెద్ద రాజకీయ అవినీతి చర్యగా సీపీఎం నేత పేర్కొన్నారు. అలాగే, స్టీల్ ప్లాంట్, హెచ్ పీసిఎల్, విశాఖ పోర్టు, ఎల్ఐసి ఇతర అనేక ప్రభుత్వ సంస్థల సిఎస్ఆర్ నిధులను బలవంతంగా తమ పార్టీతో పాటు, అర్ ఎస్ ఎస్ అనుబంధ సంస్థల విస్తరణ కొరకు బీజేపీ వినియోగిస్తోందని ఆయన ఫైర్ అయ్యారు.
దీనికి బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. సంక్రాంతి సంబరాలు విశాఖలో మొదటిసారి బీజేపీ తరఫున ఘనంగా జీవీఎల్ నిర్వహిస్తున్నారు. దీని మీద రాజకీయ ఆరోపణలతో వివాదానికి కామ్రేడ్స్ తెర తీశారు. బీజేపీ పెద్దలు జవాబు ఏమి చెబుతారో చూడాల్సి ఉంది అని అంటున్నారు.