హనుమాన్ కు అందరూ ఫ్యాన్సే

ఏ సినిమా అయినా కంటెంట్ బాగుంటే ఎవరూ మోయనక్కరలేదు. జనాలే మోసి, విజయ తీరం చేరుస్తారు. అదే సినిమా కంటెంట్ వీక్ అయినా మీడియా అయినా, సోషల్ మీడియా అయినా కాస్త సాయం పట్టాలి.…

ఏ సినిమా అయినా కంటెంట్ బాగుంటే ఎవరూ మోయనక్కరలేదు. జనాలే మోసి, విజయ తీరం చేరుస్తారు. అదే సినిమా కంటెంట్ వీక్ అయినా మీడియా అయినా, సోషల్ మీడియా అయినా కాస్త సాయం పట్టాలి. ఈ రెండూ కాకుండా మరో సంగతి వుంది. సినిమా యావరేజ్ అయినపుడే ఫ్యాన్స్ సాయం కూడా అవసరం అవుతుంది. గుంటూరు కారం సినిమాకు ఇప్పుడు మహేష్ మినహా మిగిలిన ఫ్యాన్స్ అంతా ఒక్కటైనట్లు కనిపిస్తోంది. హనుమాన్ హీరోకి అంటూ ప్రత్యేకంగా ఫ్యాన్స్ లేరు. కానీ ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్‌ మినహా అంతా హనుమాన్ ఫ్యాన్స్ కింద మారిపోయారు.

నిజానికి ఇది ఒక్క రోజులో జరగలేదు. గుంటూరు కారం విడుదలకు చాలా కాలం ముందుగానే ప్రారంభమైంది. గుంటూరుకారం సినిమాకు ఏ పబ్లిసిటీ అవసరం లేదు. ఏ రివ్యూలు అవసరం లేదు. ఎవరైనా ముందగా ఏ సినిమా చూడాలని కోరుకుంటారు. ఇలాంటి మాటలు ఆ సినిమా పట్ల పాజిటివిటీ కంటే, హనుమాన్ సినిమా పట్ల సింపతీని పెంచాయి.రాజమౌళి సినిమాల రికార్డులకు దగ్గరగా వెళ్తాము అనగానే ఇద్దరు ముగ్గురు పెద్ద హీరో ప్యాన్స్ సహజంగానే గుంటూరు కారం సినిమాకు దూరం అయ్యారు.

ఇప్పుడు ఇండస్ట్రీ జనాలు ఏమంటున్నారు? సినిమా నిర్మాత ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అనవసరంగా ఎక్కువ మాట్లాడితే లేని పోని విధంగా వెళ్లి, సినిమా మీద కనిపించని నెగిటివిటీని పెంచుతాయి అని అంటున్నారు. నిర్మాతలకు ఇదో లెసన్ అని కామెంట్ చేస్తున్నారు.

దీనికి తోడు హనుమాన్ సినిమాకు నైజాంలో మిగిలిన పంపిణీ దారులు చేసిన పనులు కూడా సింపతీని తెచ్చి పెట్టాయి. సిటీ పరిథిలో నాలుగే నాలుగు సింగిల్ స్క్రీన్ లు కేటాయించడం చాలా అంటే అనుకూలమైన సింపతీని తెచ్చింది. హనుమాన్ ను నొక్కేస్తున్నారు అని క్లారిటీ ఇచ్చింది.

పైగా ఇండస్ట్రీ పెద్దలు మాట్లాడుతూ గుంటూరు కారం పెద్ద సినిమా, నాగార్జున, వెంకటేష్ పెద్ద హీరోలు వాళ్ల సినిమాలకు సహజంగానే థియేటర్లు వుంటాయి అని చెప్పారు. అక్కడితో ఆగకుండా హనుమాన్ కు లోకల్ గా డిస్ట్రిబ్యూటర్లు మాట్లాడుకుని సెట్ చేసుకోవాలి అని, తమది కాదు, హనుమాన్ ను కొనుక్కున్నవాళ్లదే బాధ్యత అనే ఫీలర్లు పంపారు. ఇది కూడా హనుమాన్ కు ప్లస్ అయింది.

ఇవి చాల వన్నట్లు కొందరు ఇండస్ట్రీ పెద్దలు హనుమాన్ విషయంలో ఫ్రస్టేట్ అయిపోయారు. మీడియా మీద కొట్టడానికి మీద మీదకు వెళ్లారు. వేలు చూపి బెదిరించారు. దాంతో మరింత డ్యామేజ్ జరిగింది తప్ప ప్లస్ కాలేదు.

ఇలా ఇటు వివిధ హీరోల ఫ్యాన్స్, అటు సోషల్ మీడియా, ఇటు రెగ్యులర్ మీడియా, ఇలా రకరకాలుగా గుంటూరుకారం మీద వ్యతిరేకత కన్నా, హనుమాన్ మీద సింపతీ జనరేట్ చేసింది. గమ్మత్తేమిటంటే, విడుదలకు ముందు హనుమాన్, గుంటూరుకారం పట్ల న్యూట్రల్ గా వున్న కొన్ని మీడియా, ఇండివిడ్యువల్ ట్విట్టర్ హ్యాండిల్స్ కూడా విడుదల తరువాత క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నాలు ప్రారంభించి, హనుమాన్ వైపు మొగ్గేసి,తమదే విజయం అన్నట్లు మీసాలు మెలేయడం ప్రారంభించారు. అందువల్ల ఏమయింది? గుంటూరు కారం సినిమాను కొమ్ము కాసే వారే కరువయ్యారు.

మొత్తం మీడియా తమ చేతిలోనే వుంది అనుకున్నారు సినిమాకు ముందు. కానీ ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఏ మీడియా తమది అనుకున్నారో, ఆ మీడియా మొత్తం హనుమాన్ ను వెనకేసుకు వస్తోంది. ఏయే హ్యాండిల్స్ అన్నీ తమవి అనుకున్నారో, అవే ఇప్పుడు జై హనుమాన్ అంటున్నాయి.

హనుమాన్ కు ఎవరో ప్రత్యేకంగా ఫ్యాన్స్ కాదు. ఎవరో ప్రత్యేకంగా బజ్ తీసుకురాలేదు. గుంటూరు కారం సినిమాకు ఎవరు అనుకూలం అనుకున్నారో, ఎవరు తమది అనుకున్నారో వాళ్లే దాన్ని ఇప్పుడు పక్కన పడేసి, హనుమాన్ ను భుజానికి ఎత్తుకున్నారు. ఇప్పుడు అందరూ హనుమాన్ ఫ్యాన్స్ నే.