చిన్నికి ముందున్నది ముసళ్ల పండగేనా?

విజయవాడ నుంచి గెలిచిన తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని ముక్కుసూటి తనాన్ని భరించలేని చంద్రబాబునాయుడు అప్రకటితంగా వెలివేసిన నాటినుంచి పండగ చేసుకుంటున్న వ్యక్తి ఒకరున్నారు. ఆయనే- నాని తమ్ముడు కేశినేని చిన్ని. Advertisement తన…

విజయవాడ నుంచి గెలిచిన తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని ముక్కుసూటి తనాన్ని భరించలేని చంద్రబాబునాయుడు అప్రకటితంగా వెలివేసిన నాటినుంచి పండగ చేసుకుంటున్న వ్యక్తి ఒకరున్నారు. ఆయనే- నాని తమ్ముడు కేశినేని చిన్ని.

తన అన్న నానిని పక్కన పెట్టడానికంటె ముందునుంచి విజయవాడ తెలుగుదేశం ఎంపీ టికెట్ చిన్నికే అనే ప్రచారం తెలుగుదేశంలో మొదలైంది. దానికి తగ్గట్టుగానే చిన్ని కూడా మురిసిపోతూ వచ్చారు. తీరా తిరువూరు సభకు రానే వద్దంటూ కేశినేని నానిని చంద్రబాబు వెలివేసిన తర్వాత.. ఆయన తన దారి తాను చూసుకుంటూ వెళ్లి జగన్మోహన్ రెడ్డి పంచన చేరిన తర్వాత.. చిన్ని మరింత రెచ్చిపోయారు.

విజయవాడ ఎంపీ సీటునుంచి నాని రెండు సార్లు గెలిచారంటే .. తాను పడిన కష్టం వల్లనే అని ఆయన చెప్పుకున్నారు. తమ రెండు కుటుంబాల మధ్య తగాదాలు ఉన్నప్పటికీ కూడా.. తెలుగుదేశం పార్టీ కోసం తాను నాని విజయానికి పనిచేశానని కూడా ఆయన సెలవిచ్చారు. తద్వారా.. నాని గెలుపు మొత్తం తన మొహం చూసి పడిన ఓట్ల వల్లే జరిగిందనే సంకేతాలు ఇస్తూ.. తనకు ఎంపీ టికెట్ ఇస్తే సొంతంగా గెలవగలనని ఇండైరక్టుగా చెప్పుకున్నారు. చంద్రబాబు కూడా అలాంటి లీకులు ఇస్తూ వచ్చారు.

ఇంత వరకు బాగుంది. కానీ.. చివరివరకు తేల్చకుండా.. అవకాశవాదంతో వ్యవహరించే చంద్రబాబునాయుడు వైఖరి వలన కేశినేని చిన్నికి ప్రమాదం తప్పదనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది.

భారతీయ జనతా పార్టీలో ఉన్న చంద్రబాబునాయుడు కోవర్టు సుజనా చౌదరి రూపంలో చిన్నికి గండం పొంచి ఉన్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. 2024 ఎన్నికల్లో విజయవాడ ఎంపీసీటునుంచి తాను పోటీచేయబోతున్నట్టుగా సుజనా ప్రకటించుకున్నారు.

తెలుగుదేశం- జనసేన జట్టుతో తమ భారతీయ జనతా పార్టీ కూడా కలిసి పోటీచేస్తుందా లేదా ఇంకా క్లారిటీ రాలేదని అంటూనే.. పొత్తుల గురించి రాష్ట్ర పార్టీ నాయకుల అభిప్రాయాలను ఢిల్లీ పెద్దలకు నివేదించేశామని ఆయన అంటున్నారు.

పొత్తులకు సానుకూలంగానే సుజనా వంటి తెదేపా కోవర్టుల అభిప్రాయాలు ఢిల్లీ వెళ్లినట్టుగా సమాచారం. కాగా.. పొత్తులు ఉన్నా లేకపోయినా తాను బిజెపి తరఫున విజయవాడ ఎంపీ బరిలో ఉంటానని ఆయన అంటున్నారు. అదే జరిగితే.. చంద్రబాబునాయుడు, తన మనిషి అయిన సుజనా చౌదరి విజయానికే ప్రయత్నిస్తారు కదా.. అనేది పలువురి వాదన.

చిన్ని మహా అయితే విజయవాడ ఎంపీ సీటు గెలవడానికి తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడుతారేమో. కానీ.. ఢిల్లీలో గానీ ఇతరత్రా గానీ చంద్రబాబుకు ఉండే అనేక రకాల పనులను చక్కబెట్టడానికి సుజనాచౌదరి ఉపయోగపడతారని అందుకే చంద్రబాబు ఆయనకు లోపాయికారీగా విజయానికి సాయం చేస్తారని పలువురి అంచనా.

బెజవాడ సీటుపై సుజనాచౌదరి మనసుపడిన తర్వాత- పొత్తులు ఉంటే బిజెపికి కేటాయించేస్తారని.. పొత్తులు లేకపోతే కేశినేని చిన్నికి టికెట్ ఇచ్చినా సరే ఆయనను స్వయంగా బాబే ఓడిస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు.