టీడీపీ, జనసేన అభ్యర్థుల ఎంపిక నిత్యం ఉత్కంఠత రేపుతోంది. జనసేనకు ఇచ్చే సీట్లపై రకరకాల ప్రచారం జరుగుతోంది. నిన్నటికి నిన్న కాపు నాయకులు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య విడుదల చేసిన ప్రకటనలో 40 నుంచి 60 సీట్లకు తగ్గకుండా జనసేన నిలిస్తేనే గౌరవం దక్కుతుందని పవన్‌కు సూచించినట్టు పేర్కొన్నారు. లేదంటే అసలుకే ఎసరు వస్తుందని, జాగ్రత్తగా వుండాలని హెచ్చరించారు కూడా.
మరోవైపు కొన్ని సీట్లపై పవన్‌కు చంద్రబాబు క్లారిటీ ఇచ్చారనే ప్రచారం జరుగులోంది. దీంతో ఆ సీట్లలో అభ్యర్థుల ఎంపికపై పవన్ కసరత్తు చేస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో వైసీపీకి రాజీనామా చేసిన బందరు ఎంపీ బాలశౌరికి తిరిగే అదే లోక్‌సభ నియోజకవర్గం లేదా గుంటూరు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాను జనసేనలో చేరుతున్నట్టు బాలశౌరి ప్రకటించిన సంగతి తెలిసిందే.
కనీసం పవన్‌ను ఇంకా కలవకుండానే, ఆయనకు జనసేనాని బెర్త్ ఖరారు చేయడం విశేషం. గుంటూరులో టీడీపీకి సరైన అభ్యర్థి లేకపోవడంతో అక్కడికి బాలశౌరిని పంపినా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే… 20 లేదా 30 సీట్లు జనసేనకు కేటాయించినా, సగం సీట్లలో తమ అభ్యర్థుల్నే నిలపొచ్చని చంద్రబాబు ఆలోచించారు. అయితే తాజా పరిస్థితుల్ని గమనిస్తుంటే టీడీపీ నుంచి పంపితే తప్ప అభ్యర్థులు దొరకని వాతావరణం లేదనే అభిప్రాయానికి ఆ పార్టీ నేతలు వచ్చారు.
వైసీపీ నుంచి నేతల్ని తెచ్చుకుని తన వాళ్లుగా బరిలో దింపడానికి పవన్ కసరత్తు చేస్తున్నారని తెలిసింది. దీంతో టీడీపీ నేతలు … అనుకున్నదేంటి? అవుతున్నదేంటి? అని చర్చించుకుంటున్నారు. వైసీపీకి రాజీనామా చేసి వెళుతున్న నేతలు మాత్రం పవన్ కోసం కట్టుబడి వుండేవాళ్లే. ఇదే టీడీపీకి రాజీనామా చేసి, జనసేనలో చేరుతున్నారంటే మ్యాచ్ ఫిక్సింగ్ అని అర్థం చేసుకోవాల్సి వుంటుంది.
ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో కూకట్‌పల్లితో సహా మరో రెండు, మూడు నియోజకవర్గాల్లో బీజేపీకి రాజీనామా చేయడం, జనసేనలో చేరడం, ఆ వెంటనే టికెట్ దక్కించుకోవడం విమర్శలకు దారి తీసింది. అదే రీతిలో ఏపీలో కూడా టీడీపీ చేస్తుందనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికి ఆ వాతావరణం కనిపించడం లేదు.
జనసేన నిఖార్పైన అభ్యర్థుల్నే ఎంపిక చేస్తున్నారు. తన వాళ్లనుకునే నేతలకే పవన్ టికెట్లు ఇస్తున్నారు. దీంతో డ్యామిట్ కథ అడ్డం తిరుగుతోందనే ఆవేదన టీడీపీలో సహజంగానే వుంది. ఇదే రీతిలో అభ్యర్థుల ఎంపిక వుంటే మాత్రం… టీడీపీ నుంచి జంపింగ్‌లు ఎక్కువే వుంటాయి. ఎందుకంటే 25 నుంచి 30 చోట్ల నాయకత్వాన్ని పోగొట్టుకోడానికి ఏ నాయకుడూ సిద్ధం ఉండరు కదా?