ఈ కాలం ఓ సినిమా హిట్టయిందా లేదా ఫ్లాప్ అయిందో చెప్పడానికి కొలమానంగా మారింది ఓటీటీ రిలీజ్. ఫ్లాప్ అయిన సినిమా వీలైనంత తొందరగా ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు డెవిల్ సినిమా కూడా అదే దారిలో నడిచింది. అన్నీ తానై అభిషేక్ నామా తీసిన ఈ సినిమా మరికొన్ని గంటల్లో ఓటీటీలో ప్రత్యక్షంకానుంది.
కల్యాణ్ రామ్ హీరోగా నటించిన సినిమా డెవిల్. అతడి కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమా ఇది. ఈ సినిమా కోసం భారీ సెట్స్ వేశారు. కాస్ట్యూమ్స్ కోసం మెటీరియల్ ను ప్రత్యేకంగా ఇటలీ నుంచి తెప్పించారు. ఇలా చాలా హోప్స్ పెట్టుకొని విడుదల చేసిన ఈ సినిమా ఫ్లాప్ అయింది.
2023 ఏడాదికి మంచి ఫినిషింగ్ టచ్ ఇస్తుందని అంతా భావించారు. కానీ డెవిల్ సినిమా కల్యాణ్ రామ్ కెరీర్ లో ఫ్లాప్ గా నిలిచింది. అప్పటికే ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ కంపెనీ, ఈరోజు రాత్రి నుంచి డెవిల్ ను స్ట్రీమింగ్ కు పెడుతోంది.
అటు మరో ఫ్లాప్ సినిమా ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్ కూడా స్ట్రీమింగ్ కు రెడీ అయింది. నితిన్ హీరోగా, వక్కంతం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై ఫ్లాప్ అయింది. ఇప్పుడీ సినిమా వచ్చే శుక్రవారం నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు రాబోతోంది.